శనివారం 08 ఆగస్టు 2020
Hyderabad - Aug 01, 2020 , 23:43:35

ప్రభుత్వ దవాఖానలపై విశ్వాసం ఉంచండి...

ప్రభుత్వ దవాఖానలపై విశ్వాసం ఉంచండి...

ప్రైవేటు హాస్పిటల్స్‌ను ఆశ్రయించి ఇబ్బందులు పడొద్దు

ఆగస్టు నెల మరింత జాగ్రత్తగా ఉండాలి 

హోం క్వారంటైన్‌లో ఉన్నవారు.. బయట తిరుగుతున్నారు 

ఈఎస్‌ఐని కొవిడ్‌ పడకల దవాఖానగా మారుస్తాం 

వైద్యసిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలి

గాంధీ, ఆయుర్వే ద, టిమ్స్‌ దవాఖానను సందర్శించిన కేంద్ర సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి 

కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తున్నది. ఆగస్టు నెలలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. పేద ప్రజలు ప్రభుత్వ దవాఖానలపై విశ్వాసం ఉంచండి.. సర్కారు దవాఖానల్లోనే మెరుగైన వైద్యం అందుతుంది. అనవసరంగా ప్రైవేటు దవాఖానలను ఆశ్రయిస్తూ ఇబ్బందులు పడవద్దు. త్వరలోనే ఈఎస్‌ఐని కొవిడ్‌ పడకల దవాఖానగా మార్చేస్తాం. టిమ్స్‌ దవాఖానలో వెయ్యి పడకలు ఏర్పాటు చేయాలని కేంద్రం హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం టిమ్స్‌, గాంధీ, ఎర్రగడ్డలోని ఆయుర్వేద దవాఖానను సందర్శించి వసతులను పరిశీలించటంతో పాటు అధికారులతో సమావేశమై పలు సూచనలు ఇచ్చారు.

శేరిలింగంపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా మహమ్మారి బాధితులకు చికిత్సలు అందించేందుకు గచ్చిబౌలిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (టిమ్స్‌) దవాఖానను శనివారం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌ రెడ్డి సందర్శించారు. దవాఖానలో వసతులను పరిశీలించడంతోపాటు రోగులను కలిసి వారితో మాట్లాడారు. అనంతరం టిమ్స్‌లో పనిచేస్తున్న పారామెడికల్‌ సిబ్బంది, డాక్టర్లు, అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఈ నెలలో(ఆగస్టు) మరింత జాగ్రత్తగా ఉండటంతోపాటు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు బయటకు రాకపోవడం ఉత్తమమన్నారు. టిమ్స్‌ దవాఖానను మరింత అభివృద్ధి చేయాలని, పూర్తి స్థాయి వసతులు కల్పించడంతోపాటు సిబ్బందిని నియమించాలన్నారు. 

రాష్ర్టాలకు పూర్తి సహకారం..!

కేంద్ర ప్రభుత్వం కరోనా నివారణ కోసం రాష్ర్టాలకు పూర్తి సహకారం అందిస్తున్నదని అన్నారు. తెలంగాణకు 1200 వెంటిలేటర్లతోపాటు పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్కులు, మందులు అందజేశామన్నారు. త్వరలోనే ఈఎస్‌ఐ హాస్పిటల్‌ను కొవిడ్‌ పడకల హాస్పిటల్‌గా మార్చేందుకు కేంద్రం నిర్ణయించిందని, ఇప్పటికే రైల్వే దవాఖానను 100 పడకల దవాఖానగా ఏర్పాటు చేశామన్నారు. 

ఆయుర్వేద దవాఖానలో..

యూసుప్‌గూడ: ఎర్రగడ్డలోని ఆయుర్వేద దవాఖానలో చికిత్స పొందుతున్న కరోనా బాధితులను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వైద్య బృందంతో కలిసి పరామర్శించారు.

కరోనా విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరింత పటిష్టంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ట్రేసింగ్‌, టెస్టింగ్‌, ట్రీటింగ్‌ మీద దృష్టి పెట్టాలని, హోం క్వారంటైన్‌లో ఉన్న రోగులు బయట తిరుగుతున్న పరిస్థితి తెలంగాణలో ఉందన్నారు. హోంక్వారంటైన్‌లో ఉన్నవారు బయట తిరుగవద్దని కోరారు. పేద ప్రజలకు ప్రభుత్వ దవాఖానలపై విశ్వాసం లేక ప్రైవేటు హాస్పిటళ్లను ఆశ్రయిస్తూ ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వ దవాఖానల మీద విశ్వాసం కలిగించేందుకే తాను పర్యటన చేపడుతున్నట్లు తెలిపారు. 

గాంధీ దవాఖానకు..

ఏం కావాలన్నా ఇస్తాం

ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌ సేవలు అభినందనీయం

బన్సీలాల్‌పేట్‌ : కరోనా బాధితులకు ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌ అందిస్తున్న సేవలు అభినందనీయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. శనివారం సికింద్రాబాద్‌లోని గాంధీ దవాఖానను సందర్శించిన ఆయన.. అధికారులతో కలిసి కొవిడ్‌ క్యాజువాలిటీని పరిశీలించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ వైద్యులు, సిబ్బంది మాస్కులు, గ్లౌజులు, పీపీఈ కిట్లు తప్పనిసరిగా ధరించి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నాలుగైదు నెలలుగా కరోనా రోగులకు వైద్య సేవలు అందిస్తున్న గాంధీ వైద్యులు, నర్సులు, టెక్నీషియన్లు, పారిశుధ్య సిబ్బంది, పోలీసులను ఆయన అభినందించారు. దవాఖాన పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాబోయే రోజుల్లో కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నదని.. ఈ నేపథ్యంలో గాంధీలో బెడ్స్‌ సంఖ్య పెంచాల్సిన అవశ్యకత ఉందన్నారు.

మానసిక ైస్థెర్యం నింపేందుకే వచ్చా..

కరోనా నోడల్‌ కేంద్రమైన గాంధీకి ఏం కావాలన్నా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి ప్రకటించారు. కొవిడ్‌ చికిత్స పొందుతున్న వారికి మానసిక ైస్థెర్యం నింపేందుకే దవాఖానను సందర్శించినట్లు ఆయన చెప్పారు. డీఎంఈ డాక్టర్‌ రమేశ్‌ రెడ్డి, గాంధీ దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎం.రాజారావు, డిప్యూటీ సూపరింటెండెంట్‌లు డాక్టర్‌ నర్సింహారావునేత, డాక్టర్‌ శోభన్‌బాబు, ఆర్‌ఎంఓలు శేషాద్రి, ప్రభాకర్‌ రెడ్డి, కిరణ్‌ తదితరులు మంత్రి వెంట ఉన్నారు.


logo