మంగళవారం 19 జనవరి 2021
Hyderabad - Aug 28, 2020 , 00:36:11

ప్లాస్మా దాతలకు సన్మానం

ప్లాస్మా దాతలకు సన్మానం

కొవిడ్‌ కంట్రోల్‌ సిబ్బందికి రివార్డులు

ప్రాణాలు నిలిపిన కరోనా విజేతలకు అభినందనల వెల్లువ 

పోలీసులను దేవుళ్లుగా కీర్తించిన ప్లాస్మా గ్రహీతలు

కరోనా నియంత్రణలో దేశానికి మనమే ఆదర్శం: హోం మంత్రి

‘మీరే మాకు స్ఫూర్తి.. ప్లాస్మాదాత.. సుఖీభవ’.. అంటూ ప్రతి ఒక్కరూ దీవెనలు అందించారు. పోలీసులు చూపిన మానవత్వానికి చేతులెత్తి దండం పెట్టారు. గురువారం సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయం ఇందుకు వేదికైంది. అపోహలు వీడి..ధైర్యంగా ముందుకొచ్చి.. ఎందరో జీవితాల్లో వెలుగులు నింపిన ప్లాస్మాదాతలను సన్మానించారు. వారిని ప్లాస్మా గ్రహీతలు మనస్ఫూర్తిగా అభినందించారు. పోలీసులను దేవుళ్లుగా కీర్తించారు. హోం మంత్రి మహమూద్‌ అలీ దాతలకు ప్రశంసా పత్రాలు, కొవిడ్‌ కంట్రోల్‌ సిబ్బందికి రివార్డులు అందించారు. కొవిడ్‌ నియంత్రణలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. కరోనా విజేతల్ల్లో చైతన్యం తీసుకొచ్చి.. ప్లాస్మాదానానికి ముందుకు తీసుకురావడంలో పోలీసులు చూపిన చొరవను ప్రశంసించారు.

మా భయాన్ని పోగొట్టారు..

మాలో ధైర్యం నింపారు..

కన్నీళ్లను ఆనంద బాష్పాలుగా మార్చారు..

ప్లాస్మా దాతలను సన్మానించిన హోం మంత్రి..

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: సైబరాబాద్‌ పోలీసులు దేవుళ్లు.. వైద్యులు ప్లాస్మా థెరపీ కావాలనప్పుడు మేము పడ్డ వేదన చెప్పలేము. పోలీసులకు ఒక ఫోన్‌ చేశాం.. అంతే మా ముందు ప్లాస్మా దాతలు ప్రత్యక్షమయ్యారు. పోలీసులు ప్రాణ దాతలను పంపించి.. మా కుటుంబ సభ్యులకు ఆయుష్షు పోశారు. పోలీసుల మానవతా స్ఫూర్తిని ఎన్నటికీ మరువలేం. సైబరాబాద్‌ పోలీసులు కల్పించిన అవగాహన మాలో ధైర్యాన్ని నింపింది. పోలీసుల కృషితో ప్లాస్మా దాతల సేవలు పొందిన వారు.. ప్లాస్మా దానం చేసిన వారు కూడా తమలోని ఆనందాన్ని పంచుకుంటూ సైబరాబాద్‌ పోలీసుల మీద ప్రశంసల వర్షాన్ని కురిపించారు. గురువారం గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్లాస్మా దాతల సన్మానానికి హోం మంత్రి మహమూద్‌ అలీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన ప్లాస్మా దాతలకు ప్రశంస పత్రాలను అందించి.. సన్మానించారు. 

మా ఇంట్లో 11 మందికి కరోనా: డాక్టర్‌ సంగీత శర్మ

మా ఇంట్లో 11మందికి కరోనా సోకింది. అందరం రికవరీ అయ్యాం. కానీ.. నా భర్తకు ప్లాస్మా థెరపీ అవసరమయ్యింది. సైబరాబాద్‌ కొవిడ్‌ కంట్రోల్‌ను సంప్రదించిన రెండు గంటల్లోనే మా వద్దకు ప్లాస్మా దాతను పంపించారు. దేవుడి లా వచ్చిన ప్లాస్మా దాత చేసిన దానంతోనే నా భర్త ఈరోజు ఆరోగ్యంగా ఉన్నారు. 

కరోనా ఎదురించారు.. విజేతలుగా నిలిచారు 

ప్లాస్మా దానానికి అన్ని వర్గాల నుంచి స్పందన రావడం చాలా ఆనందంగా ఉంది. ఇంకా చాలా మంది అపోహలతో కొట్టుమిట్టాడుతున్నారు. అనుమానాలు ఏమీ పెట్టుకోవద్దు. ప్లాస్మా దానంతో ముగ్గురి ప్రాణాలు నిలబడుతాయి. మన స్ఫూర్తితో ఇప్పుడు మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక రాష్ర్టాల్లో కూడా విస్తృతంగా ప్లాస్మా దానంపై అవగాహన కల్పిస్తున్నారు. కరోనా పంజాకు చిక్కి.. విషమ పరిస్థితుల్లో ఉన్న వారు ఆరోగ్యంగా ఇంటికి చేరడం చాలా సంతోషంగా ఉంది. ప్లాస్మా దానం కోసం వాలంటీర్లు, సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ అందిస్తున్న సేవలు అభినందనీయం. మన రాష్ట్రం, మన నగరమే కాదు.. ఇతర రాష్ర్టాల నుంచి కూడా ప్లాస్మా కావాలని చాలా విజ్ఞప్తులు వస్తున్నాయి. దాతలు కూడా సంకోచించకుండా.. ప్రాణాలను నిలబెట్టాలనే ఆలోచనతో ఎక్కడికైనా వెళ్లేందుకు సిద్ధమంటున్నారు. ఇది మాలో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మొత్తం 761 మంది దాతల సహకారంతో 1350 మంది ప్రాణాలను కాపాడగలిగాం. 

- సజ్జనార్‌, సీపీ సైబరాబాద్‌

మా నాన్న మాతో ఉన్నారు: నళిని

మా నాన్నకు కరోనా వచ్చింది. దీంతో అతడి ఆరోగ్య పరిస్థితి విషమించింది.  వైద్యులు ప్లాస్మా థెరపీ చేయాలన్నారు. తెలిసిన వారు సైబరాబాద్‌ కొవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌ను సంప్రదించాలని సలహా ఇచ్చారు. 24 గంటల్లో మాకు ప్లాస్మా దాతను అందించారు. దాత చేసిన ప్లాస్మా దానంతో ఈ రోజు మా నాన్న మాతో ఉన్నారు. 

ప్లాస్మా ఇచ్చేందుకు భయపడ్డా : సాయితేజ

ప్లాస్మా దానం చేయడానికి చాలా భయపడ్డా.  సైబరాబాద్‌ పోలీసులు ఇచ్చిన అవగాహన నాలో స్ఫూర్తిని నింపింది. ఇప్పుడు నా ప్లాస్మా దానంతో ఒకరి ప్రాణం నిలబడటం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను అదృష్టంగా భావిస్తున్నా. 

ప్లాస్మా దాతలను పంపారు: ఆసిఫ్‌

మా నాన్నకు కరోనా వచ్చింది. ఆరోగ్యం విషమించి.. ప్రాణవాయువు 18వరకు పడిపోయింది. రూ.50వేల ఇంజక్షన్‌ను బెంగళూరు నుంచి తెప్పించాం. వైద్యులు ప్లాస్మా థెరపీ చేద్దామని చెప్పారు. మాది ఖమ్మం. ఇక్కడ ఎవరూ తెలియదు. కొంత మంది సైబరాబాద్‌ పోలీసులను సంప్రదించాలని సూచించారు. విషయం పోలీసులకు తెలుపగా.. ఐదుగురు ప్లాస్మా దాతలను పంపించి మా నాన్నను కాపాడారు.  ప్లాస్మా దాతలకు, పోలీసులకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. 

కరోనా వచ్చిందనగానే మానవ బాంబులాగా చూశారు

మేము పోలీసులం. మా జీవితం ప్రజా సేవకు అంకితమని నిర్ణయించుకున్నాం. సాధారణ పౌరులు కూడా ధైర్యంగా ముందుకు వచ్చి.. ప్లాస్మాను దానం చేసి ప్రాణాలను నిలబెడుతున్నారు. సైబరాబాద్‌ పోలీసులు చేస్తున్న కృషిని అభినందించాల్సిందే. మా ఇంట్లో నలుగురికి కరోనా వచ్చింది. బంధువులు, స్నేహితులు మా అందరినీ మానవ బాంబులాగా చూశారు. బాదేసింది. మనో ధైర్యం, జాగ్రత్తలు, వైద్యుల సూచనలతో కరోనాను జయించాం. సైబరాబాద్‌ పోలీసుల సూచనలతో నేను, నా కుమారుడు ప్లాస్మా దానం చేశాం. మేము ప్లాస్మాదానం చేసిన రోగి ఆరోగ్యంగా దవాఖాన నుంచి బయటికి రావడం చాలా సంతోషం. నా కోరిక ఒక్కటే.. వైరస్‌ వ్యాపించకుండా ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలి. ఇతరులు ధరించేలా చేయాలి. భౌతిక దూరాన్ని పాటించాలి. - వెంకట్‌రెడ్డి, సీఆర్పీఎఫ్‌ అధికారి

అవగాహన పెరిగింది

మానవతా దృక్పధంతో విషమ పరిస్థితుల్లో ఉన్న వారి ప్రాణాలను కాపాడాలనే లక్ష్యంతో ప్లాస్మాదానం కోసం సైబరాబాద్‌ పోలీసులతో కలిసి పని చేస్తుండటం  గర్వంగా ఉంది. సైబరాబాద్‌ కొవిడ్‌ కంట్రోల్‌, స్వచ్ఛంద సంస్థలు, రాబిన్‌హూడ్‌, హిందుస్థాన్‌ సేవా సంస్థలు నిరంతరం శ్రమిస్తున్న తీరు.. చాలా మంది కష్టాలను దూరం చేస్తున్నాయి. ఇప్పుడు మహారాష్ర్టాలో కూడా ప్లాస్మా దానంపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. 

- కృష్ణ ఏదుల, ప్రధాన కార్యదర్శి, సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌