సోమవారం 30 నవంబర్ 2020
Hyderabad - Oct 31, 2020 , 07:01:37

మరో రెండు చోట్ల అందుబాటులోకి లింకు రోడ్లు

మరో రెండు చోట్ల అందుబాటులోకి లింకు రోడ్లు

  • మూడు నెలల వ్యవధిలోనే పనులు పూర్తి
  • త్వరలో మంత్రి కేటీఆర్‌చే ప్రారంభం

హైదరాబాద్‌  : వాహనదారులకు ఉపశమనం కల్పి స్తూ వెస్ట్‌ కారిడార్‌లో చేపట్టిన లింకు రోడ్లు విడతల వారీగా అందుబాటులోకి వస్తున్నాయి. ఓల్డ్‌ ముంబై హైవే మార్గంలో రెండు కీలకమైన లింకు రోడ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. త్వరలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ఈ రెండు లింకు రోడ్లను అందుబాటులోకి తీసుకువచ్చేలా హెచ్‌ఆర్‌డీసీఎల్‌, జీహెచ్‌ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.  ఓల్డ్‌ ముంబై హైవే(లేదర్‌ పార్కు) నుంచి రోడ్‌ నంబరు 45 (హెచ్‌టీ లైన్‌) 1.2 కిలోమీటర్ల పనులను రూ.15.54 కోట్లతో చేపట్టింది. ఇక ఓల్డ్‌ ముంబై హైవే నుంచి ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ వయా ఇంజినీరింగ్‌ స్టాప్‌ కాలేజీ వరకు 1.38 కిలోమీటర్ల మార్గం పనులను రూ.19.51 కోట్లతో చేపట్టింది.  హైదరాబాద్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఆర్‌డీసీఎల్‌) ఆధ్వర్యంలో పనులు జరుగగా, జీహెచ్‌ఎంసీ సుమారు రూ.50లక్షలతో ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. లాక్‌డౌన్‌ సమయాన్ని సద్వినియోగం చేసుకుని 3 నెలల వ్యవధిలోనే ఈ రహదారులను అందుబాటులోకి తీసుకురావటం గమనార్హం.