శుక్రవారం 14 ఆగస్టు 2020
Hyderabad - Aug 02, 2020 , 00:24:43

చెదిరిన మనసుకు.. సాంత్వన పలికి

చెదిరిన మనసుకు.. సాంత్వన పలికి

కుంగుబాటుతో సతమతమవుతున్న మహిళలకు భరోసాగా సంఘమిత్ర

సైబరాబాద్‌ పోలీసుల మరో వేదిక  

పోలీస్‌ స్టేషన్‌ మెట్లు ఎక్కకుండానే వేదనల పరిష్కారం 

ఆగస్టు 22 నుంచి సేవలు అందుబాటులోకి 

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: పోలీసులు, బాధితులకు మధ్య వారధి.. నిరాశ.. నిస్పృహ.. అసంతృప్తితో తమలో తాము కుమిలిపోతున్న వారికి కొండంత అండ.. పోలీస్‌స్టేషన్‌ మెట్లు ఎక్కకుండానే బాధితుల సమస్యలు పరిష్కరించే ఆత్మీయ నేస్తం సంఘమిత్ర. ఇప్పటికే మార్గదర్శక్‌ల ద్వారా ఐటీ రంగంలోని మహిళా ఉద్యోగులకు వారధిగా ఉండి పని చేసే చోట సురక్షితమైన వాతావరణాన్ని అధికారులు కల్పిస్తుండగా.. మరోవైపు లాక్‌డౌన్‌ నేపథ్యంలో సమాజంలోని మిగతా వర్గాల వారు ముందుకొచ్చి పేదలకు భరోసాగా నిలువగా.. వీరి అందరి భాగస్వామ్యంతో నగరంలో ప్రశాంత వాతావరణం ఏర్పడం ఖాయమని సుస్పష్టమైంది. ఈ నేపథ్యంలో సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ ఐటీ కారిడార్‌ కాకుండా ఇతర వ్యాపార, కార్పొరేట్‌, సామాన్య వర్గాల వారితో కలిపి ఓ వేదికను ఏర్పాటు చేయాలని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ ఆలోచించారు. ఇందులో భాగంగా సరికొత్తగా సంఘమిత్రను తెరపైకి తెచ్చారు. ఈ సంఘం సభ్యులు,  పోలీసులు బాధితులకు మధ్య వారధిగా ఉండి సమస్యల పరిష్కారానికి మార్గం చూపించనున్నారు. మరీముఖ్యంగా మహిళల భద్రత, బాలబాలికల రక్షణకు సంబంధించిన అంశాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇదిలా ఉంటే అన్ని వర్గాల వారు సంఘ మిత్ర ప్రతినిధులుగా చేరవచ్చు. ఇలా చేరిన వారికి ఎస్‌సీఎస్‌సీ, పోలీసుల తరుపున ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించి వారు చేయాల్సిన బాధ్యతలను వివరిస్తారు. ఆగస్టు 22 నుంచి సంఘమిత్ర ప్రతినిధులు తమ విధులను నిర్వర్తించనున్నారు. శనివారం గచ్చిబౌలి సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో సంఘమిత్రను సీపీ సజ్జనార్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సిని నటి అమల, నమ్రతా శిరోద్కర్‌, ఎస్‌సీఎస్‌సీ కార్యదర్శి కృష్ణ ఏదుల, ఉమెన్స్‌ ఫోరమ్‌ కార్యదర్శి ప్రత్యూష, ఎలికో సంస్థ డైరెక్టర్‌ వనితా దాట్ల, సైబరాబాద్‌ షీ టీమ్స్‌ డీసీపీ అనసూయతో కలిసి ప్రారంభించారు. అనంతర సంఘమిత్ర పోస్టర్‌ను అవిష్కరించారు. మొదటి బ్యాచ్‌కు అవగాహన తరగతులను ప్రారంభించారు.

జంతువులను ప్రేమించండి: సినీనటి అమల

నేను నా పాత రోజుల్లో శునకాలతో రోడ్డుపై నడిచేదాన్ని. ఆ సమయంలో ఈవ్‌ టీజర్లు నా వద్దకు రావడానికి జంకేవారు. జంతువులను మనం ప్రేమిస్తే అవి మనకు రక్షణగా నిలుస్తాయని అప్పుడే అర్థమైంది. మహిళల రక్షణ కోసం అన్ని వర్గాల వారినీ భాగస్వామ్యం చేస్తూ సంఘమిత్రను ఏర్పాటు చేయడం ఆనందంగా ఉంది. త్వరలో అన్నపూర్ణ సంస్థ నేతృత్వంలో కాలేజ్‌ ఆఫ్‌ ఫిలిం ఆన్‌లైన్‌ కోర్సులను ప్రారంభిస్తున్నాం. సినిమా రంగంలో మహిళల పట్ల పెరుగుతున్న వ్యతిరేక విధానాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తా. మహిళలను గౌరవించేలా రచయితలు కథలు రాయాలని కోరుతున్నా. 

ఓ మహిళ మరో మహిళకు తోడు ఉండాలి: నమ్రత శిరోద్కర్‌, నటి

   మహిళలను గౌరవించే సంప్రదాయం ముందు మన ఇంటి నుంచే ప్రారంభం కావాలి. పిల్లలకు మహిళలను గౌరవించే విధానం నేర్పాలి. ఆపదలో ఉన్న మహిళలకు మరో మహిళ తోడుగా నిలువాల్సిన సమయమిది. సేఫ్‌ సిటీ కోసం సైబరాబాద్‌ పోలీసులు సంఘమిత్రను ఏర్పాటు చేయడం అభినందనీయం. బాధిత మహిళలకు సంఘమిత్ర ఓ నమ్మకంగా నిలువాలి. 

బాధలో ఓ స్నేహితుడు తోడవుతాడు.. 

సైబరాబాద్‌ పోలీసులు తీసుకున్న ఈ సరికొత్త కార్యక్రమం చాలా బాగుంది. సంఘమిత్ర ద్వారా బాధలో ఉన్న వారికి ఓ స్నేహితుడు తోడవుతాడు. ఇక ప్రతి సమస్యకు పరిష్కార మార్గం దొరుకుతుందని ఆశ కలుగుతుంది. పాఠశాల స్థాయి నుంచే మహిళలను గౌరవించేలా విద్యార్థులకు అవగాహన కల్పించాలి. పిల్లలకు కౌన్సెలింగ్‌లు ఇచ్చి మర్యాదపూర్వకమైన ఆలోచనను పెంపొందించాలి. 

-వనితా దాట్ల, ఎలికో సంస్థ డైరెక్టర్‌

అన్ని ప్రాంతాల్లో మహిళలకు రక్షణ

సంఘమిత్ర వెనుక షీ టీమ్‌ కీలక పాత్ర పోషిస్తుంది. బాధలో ఉన్న వారికి సంఘమిత్ర ప్రతినిధులు తోడునీడగా ఉంటారు. పలు వేదికల ముందుకు వారి సమస్యలను తెచ్చి పరిష్కరిస్తారు. సైబరాబాద్‌ పరిధిలో షీ టీమ్స్‌, భరోసా కేంద్రం, ఆపరేషన్‌ స్మైల్‌, ఎస్‌సీఎస్‌సీ ఉమెన్‌ ఫోరంల ద్వారా మహిళలు, బాల బాలికలకు పూర్తి భద్రతను కల్పిస్తున్నాం. 

-అనసూయ, డీసీపీ షీ టీమ్స్‌, చైల్డ్‌ ప్రొటెక్షన్‌


 నిరంతరం అప్రమత్తం చేస్తున్నాం

సేఫ్‌సిటీ కోసం నిరంతరం పోలీసులతో కలిసి పని చేస్తున్నాం. అన్ని వర్గాలను భాగస్వాములను చేసి సామాజిక బాధ్యతను పటిష్టం చేస్తున్నాం. సైబర్‌ క్రైమ్స్‌, ట్రాఫిక్‌ సమస్యలు, ఇతర అంశాలపై నిరంతరం ఐటీ కారిడార్‌తో పాటు ప్రజలను అప్రమతం చేస్తున్నాం. కొవిడ్‌ సమయంలో వివిధ వర్గాలు చూపించిన బాధ్యతను పరిగణలోకి తీసుకుని ఇప్పుడు ఐటీ కారిడార్‌తో పాటు ఫార్మా, కన్వెన్షన్స్‌, హోటల్స్‌, నిర్మాణరంగంలో కూడా ఎస్‌సీఎస్‌సీ సేవలను విస్తరిస్తున్నాం. ప్లాస్మా దానంతో చాలామంది కొవిడ్‌ బాధితులు సురక్షితంగా బయటపడ్డారు. సంఘమిత్రతో సొసైటీలోని అన్ని వర్గాల వారికి సేవలు అందిస్తాం. 

-కృష్ణ ఏదుల, ప్రధాన కార్యదర్శి ఎస్‌సీఎస్‌సీ

 మహిళల జోలికి వస్తే ఊరుకోం

మహిళల భద్రతతో పాటు నగరంలో సురక్షితమైన వాతావరణం నెలకొల్పేందుకు సమాజంలోని అన్ని వర్గాల వారిని సంఘమిత్ర ప్రతినిధులుగా ఆహ్వానిస్తున్నాం. 700 మంది మార్గదర్శక్‌ ప్రతినిధులతో ఇప్పటికే ఐటీ కారిడార్‌లో పనిచేసే మహిళా ఉద్యోగులకు సురక్షితమైన వాతావరణం కల్పించాం. ఇక సంఘమిత్ర ప్రతినిధులు ఆపద, బాధలో ఉన్న వారికి అండగా ఉంటారు. వారి సమస్యలను విని పరిష్కార మార్గాలను అన్వేషించి భరోసాను నింపుతారు. ఇప్పటికే హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పరిధిలో దాదాపు ఏడు లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి దేశంలోనే నెం.1గా, ప్రపంచంలోనే 16వ సురక్షితమైన నగరంగా మార్చాం. మహిళల జోలికి వచ్చే వారిని వదలం. సంఘమిత్రతో సత్ఫలితాలు వస్తాయి. మహిళలే కాకుండా సామాజిక బాధ్యత కలిగిన ప్రతిఒక్కరూ సంఘమిత్రులుగా చేరొచ్చు.

- సజ్జనార్‌, సైబరాబాద్‌

పోలీస్‌ కమిషనర్‌  

తాజావార్తలు


logo