బుధవారం 30 సెప్టెంబర్ 2020
Hyderabad - Aug 06, 2020 , 00:34:48

వీధి వ్యాపారులను ఆదుకునేందుకే..

వీధి వ్యాపారులను ఆదుకునేందుకే..

కొనసాగుతున్న సర్వే 

12 వేల మందిని గుర్తించే పనిలో అధికారులు 

ఇప్పటికే 30 మందికి రుణాలు అందజేత

అబిడ్స్‌, ఆగస్టు 5: గోషామహల్‌ నియోజకవర్గంలో వీధి వ్యాపారుల వివరాల నమోదు కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ప్రధానమంత్రి ఆత్మ నిర్భర్‌ యోజన పథకం ద్వారా వీధి వ్యాపారులకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించేందుకు గాను వీధి వ్యాపారులను గుర్తించేందుకు జీహెచ్‌ఎంసీ యూసీడీ విభాగం అధికారులు సర్వే నిర్వహించారు. ఇప్పటికే మొదటి దశ సర్వేలో మూడు వేల మంది వీధి వ్యాపారులను గుర్తించగా ప్రభుత్వం మరింత చొరవ తీసుకొని నియోజకవర్గంలో ఇంకా ఎంతమంది ఉన్నారో గుర్తించాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్‌ జోనల్‌ కమిషనర్‌ ప్రావీణ్య పర్యవేక్షణలో 14వ సర్కిల్‌ డిప్యూటీ కమిషనర్‌ వినయ్‌కపూర్‌ ఆధ్వర్యంలో యూసీడీ డీపీఓ రాధారాణి నేతృత్వంలో  సర్వే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఉన్నతాధికారులు వీధి వ్యాపారుల నుంచి ఆధార్‌ కార్డు తదితర ధృవీకరణ పత్రాలను పొంది వారి వివరాలను ఆన్‌లైన్‌ చేస్తున్నారు. అనంతరం బ్యాంకులతో మాట్లాడి వారికి రుణాలు ఇప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. గోషామహల్‌ నియోజకవర్గంలో ఇప్పటికే 30 మందికి పది వేల రూపాయల చొప్పున రుణాలను అందించారు.  

12 వేల మందిని గుర్తించే పనిలో అధికారులు

వీధి వ్యాపారుల సర్వే కొనసాగుతున్నది. ఇప్పటివరకు పాత వారితో కలిపి మూడు వేల మంది వీధి వ్యాపారులను అధికారులు గుర్తించి వారి వివరాలను సేకరించి.. ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. కాగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ వీధి వ్యాపారుల గుర్తింపు సంఖ్యను పెంచేందుకు అధికారులు మరోసారి సర్వే చేపడుతున్నారు.

అందరికీ రుణాలు అందేలా కృషి

తమ సర్కిల్‌లో వీధి వ్యాపారుల సర్వేను  చేపట్టాం. ఇప్పటికే మూడు వేల వీధి వ్యాపారులను గుర్తించాం. మరో తొమ్మిది వేల మందిని గుర్తించేందుకు సర్వే కొనసాగుతున్నది. ముప్పై మందికి బ్యాంకుల ద్వారా ఒక్కొక్కరికీ పది వేల చొప్పున రుణం లభించేలా చర్యలు తీసుకున్నాం. అందరికీ రుణాలు అందేలా చూస్తాం. 

-రాధారాణి, జీహెచ్‌ఎంసీ యూసీడీ డీపీఓlogo