ఆదివారం 17 జనవరి 2021
Hyderabad - Nov 24, 2020 , 08:31:47

‘నేను భాయ్‌ని మాట్లాడుతున్నా..

‘నేను భాయ్‌ని మాట్లాడుతున్నా..

  • డబ్బుల కోసం ఒంటరి వృద్ధులకు బెదిరింపులు
  • లేదంటే కిడ్నాప్‌ చేస్తామంటూ హెచ్చరిక 
  • ఫిర్యాదు చేసిన 24 గంటల్లోనే ముఠా గుట్టురట్టు 
  • రాచకొండ పోలీసులకు వృద్ధ దంపతుల కృతజ్ఞతలు 
హైదరాబాద్‌ : ‘నేను భాయ్‌ని మాట్లాడుతున్నా.. నా గురించి ఎవరినైనా అడగండి.. నేను చెప్పినట్లు చేయకపోతే మిమ్మల్ని కిడ్నాప్‌ చేస్తా’ అంటూ వృద్ధ దంపతులను బెదిరించిన ముఠాను రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో వృద్ధులకు సేవ పేరుతో బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్న దందా వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు వచ్చిన 24 గంటల్లోనే పరిష్కరించి ముఠా గుట్టును రట్టుచేసిన మల్కాజిగిరి ఎస్‌వోటీ బృందాన్ని సీపీ మహేశ్‌భగవత్‌ అభినందించారు. వివరాల్లోకి వెళ్తే.. ఎన్‌ఎమ్‌డీసీ రిటైర్డ్‌ డీజీఎమ్‌ జవహర్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయనకు వైద్య సేవలు అందించేందుకు కౌకూర్‌లోని  దుర్గా హోమ్‌ కేర్‌ సర్వీసు సంస్థను సంప్రదించారు. బాధితుడికి రోజు మూడు ఇంజెక్షన్లు వేసేందుకు రూ.1800కు ఒప్పందం కుదుర్చుకున్నారు. సంస్థ ప్రతినిధులు గీత, ఆమె భర్త ఆనంద్‌తోపాటు లఖన్‌ అనే వ్యక్తి బాధితుడికి ఇంజెక్షన్లు ఇస్తున్నారు. 
ఈ క్రమంలో ఇంట్లో ఇద్దరూ వృద్ధులే ఉంటుండటంతోపాటు చాలా డబ్బు ఉందని భావించి బెదిరించి డబ్బు దండుకునేలా పథకాన్ని రచించారు. ముగ్గురూ కలిసి ఖమ్మంకు చెందిన కరణ్‌ అనే వ్యక్తి ద్వారా వృద్ధులను బెదిరించేలా ప్లాన్‌చేశారు. ఈ నెల 18న కరణ్‌ వృద్ధులకు ఫోన్‌ చేసి.. ‘భాయ్‌ని మాట్లాడుతున్నా.. రూ.5 లక్షలు ఇవ్వకపోతే కిడ్నాప్‌ చేస్తా’అని బెదిరించాడు. ఇలా ఆ రోజు 5 సార్లు ఫోన్‌ చేశాడు. భయాందోళనకు గురైన వృద్ధ దంపతులు జవహర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 19న  కరణ్‌ మరోసారి ఫోన్‌చేసి  హెచ్చరించాడు. దీంతో వృద్ధులు మల్కాజిగిరి ఎస్‌వోటీ ఇన్‌స్పెక్టర్‌ నవీన్‌కుమార్‌ను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన ఎస్‌వోటీ బృందం కాల్‌ రికార్డును పరిశీలించగా బెదిరింపులకు దిగిన వ్యక్తి హైదరాబాద్‌లో మరో ఇద్దర్ని సంప్రదించినట్టు గుర్తించారు. ఆరా తీయగా వారు దుర్గా సంస్థ ప్రతినిధులని తేలింది. దీంతో నిందితులు గీత, ఆనంద్‌తోపాటు ఖమ్మంకు చెందిన కరణ్‌ను అరెస్టు చేశారు. బెదిరింపుల ముఠా అరెస్టు కావడంతో ఊపీరి పీల్చుకున్న వృద్ధులు  పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. ఒంటరిగా ఉంటున్న వృద్ధులు గుర్తు తెలియని వారిని పనుల్లో పెట్టుకోవద్దని సూచించారు.