హైదరాబాద్: హైదరాబాద్ నగరం ధమ్ బిర్యానీకి మాత్రమే కాదు, వివిధ రకాల ఆహార పదార్థాలకు ప్రసిద్ధి. ముఖ్యంగా నగరంలో ఎంతో రుచికరమైన స్ట్రీట్ ఫుడ్స్ లభిస్తాయి. ఆ రుచికరమైన స్ట్రీట్ ఫుడ్స్‌లో పానీపూరి కూడా ఒకటి. కాచిగూడలోని భగవతి పానీపూరి దుకాణంలో ఎంతో రుచికరమైన గప్‌చుప్‌లు లభిస్తాయి. ఈ దుకాణానికి ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 60 ఏండ్లకు పైగా చరిత్ర ఉన్నది. ఆరు దశాబ్దాలుగా ఈ పానీపూరి దుకాణం గప్‌చుప్ లవర్స్‌ను ఆకర్షిస్తూనే ఉన్నది.
కాచిగూడలోని మహంకాళీ ఆలయం సమీపంలో ఈ భగవతి పానీపూరి దుకాణం ఉన్నది. సాయంత్రం అయ్యిందంటే చాలు ఈ పానీపూరి షాప్ ఛాట్ ప్రియులతో కిటకిటలాడుతుంది. భగవతి బాయి అనే 65 ఏండ్ల వృద్ధురాలు నిర్వహిస్తున్న ఈ పానీపూరి దుకాణం సుదీర్ఘకాలంగా నగరంలోని గోల్ గప్పా ప్రియులకు అడ్డాగా కొనసాగుతున్నది. సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్య ఈ దుకాణం యమ రద్దీగా ఉంటుంది.
స్ట్రీట్ ఫుడ్ లవర్స్ ఇక్కడ ప్లేట్లకు ప్లేట్లు ఛాట్ లాగిస్తుంటారు. ఆ రెండు గంటల్లోనే తాను వందల ప్లేట్ల పానీపూరి అమ్ముతానని భగవతి బాయి చెప్పారు. సాంప్రదాయ చింతపండు నీళ్లకు బదులుగా ఉసిరి నీటిని వాడటం తమ పానీపూరి దుకాణం ప్రత్యేకత అని ఆమె తెలిపారు. 60 ఏండ్ల క్రితం ఇదే స్థలంలో భగవతి బాయి తాత గోల్గప్పా దుకాణాన్ని ప్రారంభించాడు. ఆయన అనంతరం గత 35 ఏండ్లుగా భగవతి బాయి ఈ దుకాణాన్ని నడుపుతున్నారు.
బిజినెస్ అంతకంతకే పెరిగిపోవడంతో తాను ఒక్కదాన్నే దుకాణం నిర్వహించడం కష్టంగా మారిందని, దాంతో ఇంజినీరింగ్ చదివిన తన కొడుకులు రాజేశ్వర్, మహేశ్వర్ ఉద్యోగాలకు వెళ్లకుండా తనతో కలిసి వ్యాపారం చూసుకుంటున్నారని భగవతి బాయి చెప్పారు. భగవతి బాయి పానీపూరి దుకాణంలో సరుకు సామాన్లు పెద్దగా ఏమీ ఉండవు. ఒక టేబుల్, కొన్ని గిన్నెలు, కప్పులతోపాటు ఛాట్‌కు సంబంధించిన పదార్థాలు ఉంటాయి.
భగతతి బాయి పానీపూరి సెంటర్లో పానీపూరీల నుంచి మసాలా నీళ్ల వరకు ప్రతి వస్తువును ఇంట్లోనే చేతితో తయారు చేసి తీసుకొస్తారు. మీరు ఈ దుకాణానికి వెళ్తే కేవలం పానీపూరితో మాత్రమే సరిపెట్టుకోకుండా హాట్‌హాట్‌గా ఉండే రగడా ఛాట్‌ను కూడా మిస్సవకుండా తినేసి రండి.