మంగళవారం 26 జనవరి 2021
Hyderabad - Nov 27, 2020 , 07:49:15

'థింక్‌ బిఫోర్‌ ఇంక్‌'

'థింక్‌ బిఫోర్‌ ఇంక్‌'

  • పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
  • ఆరేండ్లలో చేసింది చెప్పడానికి వంద గంటలైనా చాలవు
  • కేశవాపూర్‌ రిజర్వాయర్‌తో రోజూ తాగునీరు
  • బీజేపీది ఇప్పుడు ‘బేచో ఇండియా’ నినాదం
  • కుదిరితే ట్రంప్‌ను కూడాప్రచారానికి తెస్తారు
  • ముఖ్యమంత్రి కేసీఆర్‌ వాస్తవికవాది, పేదల పక్షపాతి
  • మ్యాక్స్‌ ప్రాజెక్ట్‌ ఎండీతో ముఖాముఖిలో మంత్రి కేటీఆర్‌

ఓటు ఆయుధం

‘ఓటు శక్తివంతమైన ఆయుధం లాంటిది. ఓటేయకుండా ఇంట్లోనే ఉండి సోషల్‌మీడియాకు పరిమితం కారాదు. బయటికొచ్చి ఓటుహక్కును వినియోగించుకోవాలి. దేశ భవిష్యత్తును రాజకీయాలే నిర్దేశిస్తాయి. ఎలాంటి భవిష్యత్తు కావాలో తేల్చుకోవడం మనచేతుల్లోనే ఉంది. దురదృష్టవశాత్తు పల్లెలతో పొల్చితే నగరాల్లో అతి తక్కువ పోలింగ్‌శాతం నమోదవుతున్నది. బాధ్యతగల పౌరులుగా ప్రతిఒక్కరు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకోవాలి’  - కేటీఆర్‌ 

పచ్చగ ఉన్న హైదరాబాద్‌లో పిచ్చి మాటలు మాట్లాడి  చిచ్చు పెట్టాలనుకుంటున్నరు కొందరు. హిందూ, ముస్లిం ఫీలింగ్‌ తేవాలె.. ఏదో ఒకటి చేసి పంచాయితీ పెట్టాలె.. ఇదే వాళ్ల ఆలోచన. ఎవ్వరూ ఆగం కాకుండ్రి. నగరం ప్రశాంతంగా ఉంటేనే పెట్టుబడులు వస్తయి. ఉద్యోగాలు వస్తయి. సంక్షేమ కార్యక్రమాలు అమలైతయ్‌. ఓటే మన ఆయుధం. మీకు అండగా ఉన్న కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి.

టీఆర్‌ఎస్‌ చేసిన ఆరేండ్ల అభివృద్ధి ప్రజల ముందు ఉన్నదని, నగరవాసులంతా ఓటువేసే ముందు ఆలోచించాలని (థింక్‌ బిఫోర్‌ ఇంక్‌) రాష్ట్ర మున్సిపల్‌, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామరావు పిలుపునిచ్చారు. నగర అభివృద్ధికి పాటుపడే ప్రగతిశీల ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఆయన అభ్యర్థించారు. మ్యాక్స్‌ ప్రాజెక్ట్‌ ఎండీ మీర్‌ నాజిర్‌ అలీఖాన్‌ మంత్రి కేటీఆర్‌తో గురువారం సైఫాబాద్‌లోని నిజాంక్లబ్‌లో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. తాము ఎంతో కష్టపడి హైదరాబాద్‌ బ్రాండ్‌ వాల్యూను పెంచామని, ప్రభుత్వంపై విశ్వాసంతోనే అంతర్జాతీయ పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. ఈ ఆరేండ్లల్లో తెలంగాణలో తాము చేసింది చెప్పుకుంటూపోతే వంద గంటలైనా సరిపోవని అన్నారు. ఇతర పార్టీలను, తమ ప్రభుత్వాన్ని పొల్చిచూసి ప్రజలు ఓట్లువేయాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే నగరంలో 96శాతం నీటి సమస్యను పరిష్కరించామని, కేశవాపూర్‌ రిజర్వాయర్‌ పూర్తయితే నగరవాసులకు ప్రతిరోజు నీళ్లు సరఫరా అవుతాయని తెలిపారు. కాలుష్యరహిత నగరం కోసం పలు సంస్కరణలు అమలుచేస్తున్నామని, ఇన్వెస్టర్లు, పారిశ్రామికవేత్తలంతా ఓఆర్‌ఆర్‌ సమీపంలో పెట్టుబడులు పెట్టి, శాటిలైట్‌ టౌన్‌షిప్పులు నిర్మించాలని సూచించారు. 

అయితే.. మీరేం చేస్తున్నారు?

‘గ్రేటర్‌లో ఎన్నికలు జరుగుతుంటే.. ఈ ఎన్నికలు బిన్‌లాడెన్‌, బాబర్‌ భక్తులకు.. దేశభక్తులకు మధ్య పోటీగా బీజేపీ నేతలు చెబుతున్నారు. బాబర్లు, బిన్‌లాడెన్లు ఏమైనా హైదరాబాద్‌ ఓటర్లా ? ఇది చాలదన్నట్టు రొహింగ్యాలున్నారని, సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేస్తామని అంటున్నారు. ఢిల్లీలో ఉన్నది మీరే కదా. రక్షణమంత్రి., ఓటర్‌ కార్డిచ్చే మంత్రి, ఆధార్‌ కార్డులిచ్చే మంత్రులంతా మీ వారే కదా? రొహింగ్యాలు హైదరాబాద్‌  వస్తుంటే ఇంతకాలం ఏంచేశారు? ఇక్కడి బీజేపీ అధ్యక్షుడి మాససిక స్థితి బాగా లేదు. ఆయనేం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడంలేదు’ అంటూ కేటీఆర్‌ చురకలంటించారు.

ట్రంప్‌ను కూడా తీసుకొచ్చేట్లున్నారు

‘గల్లీలో జరిగే ఎలక్షన్లకు ఢిల్లీ లీడర్లను దింపుతున్నరు. మోదీ, అమిత్‌షా, నడ్డా.. పక్క రాష్ర్టాల ముఖ్యమంత్రలు, కేంద్రమంత్రులు వస్తున్నారట. ఆఖరుకు ఖాళీగా ఉన్నాడని డొనాల్డ్‌ ట్రంప్‌ను కూడా బీజేపొల్లు ప్రచారానికి తీసుకొచ్చేటట్లున్నరు. రాష్టంలో అడుగుపెట్టే కేంద్ర మంత్రులంతా రాష్ర్టానికి బాకీపడ్డందుకు, ట్యాక్స్‌లు కడుతూ దేశాన్ని సాకుతున్నందుకు తెలంగాణకు థ్యాంక్స్‌ చెప్పాలె. బీజేపొల్లంతా పొలిటికల్‌ టూరిస్ట్‌లు. టూరిస్ట్‌లు వస్తారు.. పోతారు. వారంతా ఢీల్లీ బాయ్స్‌ అయితే.. మేమంతా గల్లీబాయ్స్‌. మాట్లాడితే మోదీ గారు.. స్కిల్‌ ఇండియా, ఫిట్‌ ఇండియా అంటుంటారు. ఇప్పుడు బేచో ఇండియా అంటున్నారు. ఇవన్నీ పక్కనబెట్టి సోచో ఇండియా అనాలె. నష్టాల్లో ఉన్న ఎయిర్‌ఇండియాతో పాటు, లాభాల్లో ఉన్న ఎల్‌ఐసీని కూడా  కేంద్రం అమ్మకానికి పెట్టింది. సోషల్‌మీడియా యాంటి సోషల్‌ మీడియాగా తయారయ్యింది. దేశంలో అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేసే వాట్సాప్‌ యూనివర్సిటీ నడుస్తోంది’ అని కేటీఆర్‌ మండిపడ్డారు.

సీఎం కేసీఆర్‌ వాస్తవికవాది..

‘సీఎం కేసీఆర్‌ ప్రాక్టికల్‌ మ్యాన్‌. ఆయన ఎప్పుడు పేదల పక్షపాతిగా గరీబుల గురించే ఆలోచిస్తారు. రాష్ట్రం ఏర్పడి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కొలువుదీరగానే నీళ్లు, వ్యవసాయం, కరెంట్‌ సమస్యలను అధిగమించేందుకు చర్యలు చేపట్టారు. టీఎస్‌ ఐపాస్‌, అంతరాయం లేని కరెంట్‌ లాంటి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. అంబానీలు వెలిగిపోవడం.. పేదలు పేదలుగానే ఉండటం మంచిదికాదని, అల్పాదాయ వర్గాల ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఉపాధి, ఉద్యోగావకాశాలు లేకనే చైన్‌స్నాచింగ్‌లు జరుగుతున్నాయి. నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం. తెలంగాణ ఇప్పటికే నాలుగు విప్లవాలకు నాంది పలికింది. ఒకటిన్నర కోట్ల ఎకరాల సాగుతో గ్రీన్‌ రెవెల్యూషన్‌, చేపల పెంపకంతో బ్లూ రెవెల్యూషన్‌, గొర్రెల పెంపకంతో పింక్‌ రెవెల్యూషన్‌, పాల ఉత్పత్తుల పెంపకంతో వైట్‌ రెవెల్యూషన్‌ వచ్చింది. గంటకు 200 కిలోమీటర్లు ప్రయాణించే హైస్పీడ్‌రైళ్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. వీటి రాకతో అరగంటలో ఖమ్మం, ఆదిలాబాద్‌, విజయవాడలు చేరుకునే సౌలభ్యం అందుబాటులోకి రాబోతున్నది’ అని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు.

హైదరాబాద్‌ అరుదైన నగరం

‘ఉద్యమ సమయంలో అనేక అనుమానాలు, పుకార్లు, ప్రశ్నలు, చర్చోపచర్చలు జరిగాయి. దేశంలో మరే ప్రాంతం ఎదుర్కొనన్నీ ప్రశ్నలను తెలంగాణ సమాజం చవిచూసింది. రాష్ట్రం నిలబడదని, రాష్ర్టాన్ని పాలించే సత్తాలేదని, పెట్టబడులు రావని, వచ్చిన పెట్టుబడులన్నీ వెనక్కివెళతాయని ఇలా అనేక అనుమానాలు వ్యక్తంచేశారు. ఈ ఆరేండ్ల కాలంలో వాటన్నింటిని పటాపంచలు చేయగలిగాం. ఇప్పుడు హైదరాబాద్‌ దేశంలోనే విశిష్ట నగరంగా మారింది. మేము నిర్మించిన దుర్గంచెరువు కేబుల్‌బ్రిడ్జి, కంట్రోల్‌ కమాండ్‌ సెంటర్లు నగర బ్రాండ్‌ వాల్యూను పెంచుతాయి. మతాలు, ప్రాంతీయ భేదాలతో నిమిత్తంలేకుండా నగరంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధిచేస్తున్నాం. పురాతన మోజంజాహి మార్కెట్‌ను, మహబూబ్‌చౌక్‌ను ఆధునీకరించాం. త్వరలోనే మౌలాలి దర్గాను ఆధునీకరిస్తాం. తారామతి బారాదరిలో థియేటర్‌ డిస్ట్రిక్ట్‌ను ఏర్పాటు చేయబోతున్నాం. శ్రీలంక, మలేషియా, దుబాయ్‌లలో టూరిజం, హాస్పిటాలిటీ రంగంలోనే ఉపాధి లభిస్తున్నది. సోమశిల నుంచి శ్రీశైలం వరకు బోటింగ్‌ చేస్తుంటే అమెజాన్‌ నదిలో బోటింగ్‌ చేస్తున్న అనుభూతి కలుగుతుందని మనవారంటుంటారు మన దగ్గర సైతం టూరిజం, హాస్పిటాలిటీ రంగాన్ని అభివృద్ధి చేయబోతున్నాం’ అని మంత్రి కేటీఆర్‌ వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ జీబీకే రావు, డాక్టర్‌. అశిష్‌ చౌహన్‌, సామా జగన్మోహన్‌రెడ్డి, దయాకర్‌రెడ్డి, అద్నాన్‌ సలాం, లిఖిత, జాకీర్‌హుస్సేన్‌, తదితరులు పాల్గొన్నారు. 


logo