సోమవారం 03 ఆగస్టు 2020
Hyderabad - Jul 07, 2020 , 23:52:00

ఆలోచించండి...

ఆలోచించండి...

విస్తరిస్తున్న కరోనా.. కట్టడి మీ చేతుల్లోనే..

పాజిటివ్‌ కేసులు

జీహెచ్‌ఎంసీలో 1422

రంగారెడ్డిలో 176

మేడ్చల్‌లో 94

వారం రోజుల్లో 9227 

ఉన్నఊరిలో పూటగడువక పొట్టచేతపట్టుకుని పట్నం వచ్చిన వారిని అక్కున చేర్చుకున్న భాగ్యనగరం.. అందరికీ ఉపాధి కల్పించింది. వలస జీవులను అతిథులుగా స్వీకరించింది. ఎవరికి తోచిన పని వారు చేసుకునేలా అవకాశం కల్పించింది. ఎందరినో ఇక్కడ స్థిరపడేలా చేసింది. దీంతో వారు బతుకుతూ.. భాగ్యనగరాన్ని మహానగరంగా తీర్చిదిద్దారు. కాని అలాంటి ఈ నగరానికి ఇప్పుడు ఏమైందో ఎవరికీ అంతుపట్టని ప్రశ్నగా మారింది. నాడు క్రమశిక్షణతో ఉన్న ప్రజలు ఇప్పుడు విచక్షణ కోల్పోయి వ్యవహరిస్తున్నారు. కరోనా మహమ్మారిని సులభంగా అరికట్టే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా తీవ్రతను పెంచుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగమే కాదు.. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రే రంగంలోకి దిగి భరోసా కల్పించినప్పటికీ.. ప్రజలు ఎందుకు పెడచెవిన పెడుతున్నారు.? దీంతో ఎవరు నష్టపోతున్నారు..? ‘గోటితో పోయే కరోనా సమస్యను గొడ్డలివరకు తెచ్చినట్లు’ నిబంధనలు పాటించక విపత్తును పెంచుతూ.. పట్నం వదిలి పల్లెలకు తిరుగుపయనం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికంతటికీ ఎవరు కారణం.. ఎవరికి వారుగా స్వీయ నిర్బంధం, మాస్కులు, భౌతిక దూరం పాటిస్తూ వైద్యుల సూచనల మేరకు మెదులుకుంటే ఈ పరిస్థితి వచ్చేదా..? పరిశ్రమల్లో ఉపాధి కొరత వచ్చేదా..? ఆలోచించండి.. ప్రభుత్వ నిబంధనలు, వైద్యుల సూచనలు పాటిస్తూ కరోనా కట్టడికి తోడ్పడండి. వారం రోజుల్లోనే 9224 పాజిటివ్‌ కేసులు వచ్చాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

తుమ్మినా.. దగ్గినా.. అనుమానమే..!

ఎక్కడ కరోనా ఉందో.. ఎవరికి కరోనా సోకిందో అర్థంకాకుండా ఉంది. నిత్యం మన చుట్టూ తిరిగే వందల మందిలో ఎవరికి ఏముందో తెలియని పరిస్థితి. ఎవరిని నమ్మలేం.. అలా అని అనుమానించలేం. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైరస్‌ ఎక్కడ ఎలా సోకుతుందో ఊహించలేము. మామూలుగా ఎవరైనా తుమ్మినా.. దగ్గినా అదే రకంగా చూడటం అలవాటైపోయింది. అదే పాజిటివ్‌ వచ్చిన వ్యక్తితో కలిసి ఉంటున్నామని తెలిస్తే.. ఇంకేమైనా ఉందా.. గుండె ఆగినంత పనైపోతుంది. ఇటీవల నగరంలో ఇలాంటి సంఘటన ఒకటి చోటుచేసుకున్నది. ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఉంటున్న యువకుడి పాజిటివ్‌ రావడంతో అతడితో ఉన్నవారంతా వణికిపోతున్నారు.

నెగెటివ్‌ వచ్చినా.. జాగ్రత్త అవసరం

కరోనా టెస్టు చేయించుకున్నాను.. నాకు నెగెటివ్‌ వచ్చింది అనే నిర్లక్ష్యం పనికిరాదు. ఎగిరి గంతేస్తే మొదటికే మోసం వస్తుంది. ఎందుకంటే టెస్టుల్లో నెగెటివ్‌ వచ్చినా.. వైరస్‌ తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇటీవల ఓ వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ అనుమానంతో టెస్టులు చేయించుకోగా నెగెటివ్‌ వచ్చింది. కాని అతడి కుటుంబానికి కరోనా సోకింది. ఎలా వచ్చిందనేది తలలు పట్టుకున్నా అర్థం కావడంలేదు. 

యువకులే.. అధికం..

నేను యువకుడిని.. నాకేమి కాదన్న నిర్లక్ష్యంతో విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఇటీవల బాధితుల్లో ఎక్కువ శాతం యువతనే ఉంటున్నారు. అది కూడా 45 ఏండ్ల లోపువారే కరోనా బారిన పడుతున్నట్లు పలు సర్వేలు తెలుపుతున్నాయి. లాక్‌డౌన్‌ సడలింపు తర్వాత ఈ వయస్సుకు చెందిన వారు ఉపాధి కోసం బయటకు రావడం, భౌతికదూరం పాటించకుండా, మాస్కులు లేకుండా తిరగడంతోనే వైరస్‌ వ్యాపిస్తున్నదని నిపుణులు తెలుపుతున్నారు.

అలసట అందుకే..

కొవిడ్‌-19 లక్షణాలైన జ్వరం, దగ్గు కనిపించే వరకు వైరస్‌ బాధితులు నిరీక్షించకూడదు. కండరాల నొప్పి, అలసట, తలనొప్పి, విరోచనాలు, చర్మంపై దద్దుర్లు వంటివి ఉన్నప్పుడే అనుమానపడాలి. ప్రారంభదశలోనే వారు క్వారంటైన్‌లోకి వెళ్లిపోవాలి. దీంతో ఇతరులకు వైరస్‌ సోకే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. 

యూసుఫ్‌గూడలో 42 మందికి..

వెంగళరావునగర్‌ : జీహెచ్‌ఎంసీ యూసుఫ్‌గూడ సర్కిల్‌-19 పరిధిలో మంగళవారం 42 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు ఉప కమిషనర్‌ రమేశ్‌ తెలిపారు. యూసుఫ్‌గూడ డివిజన్‌లో 17, బోరబండలో 8, రహ్మత్‌నగర్‌లో 7, ఎర్రగడ్డలో 7, వెంగళరావునగర్‌లో 3కేసులు నమోదైనట్లు తెలిపారు.

ఉప్పల్‌లో 15 మందికి..

రామంతాపూర్‌ : ఉప్పల్‌ ఆరోగ్య కేంద్రం పరిధిలోని హబ్సిగూడ, రామంతాపూర్‌, ఉప్పల్‌ డివిజన్‌ పరిధిలోని పలు కాలనీల్లో మంగళవారం 15 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఉప్పల్‌ ఆరోగ్యకేంద్రం అధికారి తెలిపారు. 

కూకట్‌పల్లిలో 11 మందికి..

బాలానగర్‌ : కూకట్‌పల్లి, మూసాపేట సర్కిళ్ల పరిధిలో మంగళవారం పదకొండు పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఉమ్మడి బాలానగర్‌ మండల వైద్యాధికారి డాక్టర్‌ చందర్‌ తెలిపారు. మూసాపేట సర్కిల్‌ పరిధిలోని కేపీహెచ్‌బీకాలనీలో 7 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా కూకట్‌పల్లిలో ఒకటి, ఆల్విన్‌కాలనీలో ఒకటి, ఓల్డ్‌బోయిన్‌పల్లి మల్లికార్జుననగర్‌లో 2 పాజిటివ్‌  కేసులు వచ్చాయి. మొత్తం 241 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. 

కుత్బుల్లాపూర్‌లో 10 మందికి

దుండిగల్‌ : కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మంగళవారం 10 కేసులు నమోదుకాగా మొత్తం కేసుల సంఖ్య 447కు చేరుకుంది. కాగా  ఇప్పటి వరకు 11మంది మృతి చెందినట్లు మండల వైద్యాధికారులు తెలిపారు.

ముషీరాబాద్‌లో ఎనిమిది మందికి ..

బషీర్‌బాగ్‌ : ముషీరాబాద్‌ నియోజకవర్గంలో ఎనిమిది మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. పటాన్‌బస్తీలో ఇద్దరికి, మొరంబొందలో బాలికకు, అంబేద్కర్‌నగర్‌లో మహిళకు, గంగపుత్రకాలనీలో యువకుడికి, మోహన్‌నగర్‌లో వృద్ధుడికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని భోలక్‌పూర్‌ యూపీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ కృష్ణమోహన్‌ తెలిపారు. బైబిల్‌హౌస్‌ యూపీహెచ్‌సీ పరిధిలోని భోలక్‌పూర్‌లో భార్యాభర్తలకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు తెలిపారు.

అహ్మద్‌నగర్‌ : అహ్మద్‌నగర్‌ డివిజన్‌ ఎంజీనగర్‌లో 3, సయ్యద్‌నగర్‌లో 1 , చింతల్‌బస్తీ వీర్‌నగర్‌లో 1, శాంతినగర్‌లో 6 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  

బోడుప్పల్‌ : బోడుప్పల్‌లో ఐదుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. శివపురికాలనీలో వ్యక్తికి(52), హేమానగర్‌లో వ్యక్తికి(51), న్యూహేమానగర్‌ కాలనీలో వ్యక్తికి(40), రాజలింగంకాలనీలో వ్యక్తికి(57), బోడుప్పల్‌ ఓల్డ్‌ విలేజీలో వ్యక్తికి(52) కరోనా సోకినట్లు వైద్యులు తెలిపారు.

కాప్రా : కాప్రాసర్కిల్‌లో మంగళవారం ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా వచ్చినట్లు ఏఎంఓహెచ్‌ డా.మైత్రేయి తెలిపారు.

అల్వాల్‌ : ఓల్డ్‌ అల్వాల్‌లో మరో ఇద్దరికి కరోనా సోకిందని అల్వాల్‌ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్‌ ప్రసన్న తెలిపారు.


logo