శనివారం 04 ఏప్రిల్ 2020
Hyderabad - Feb 13, 2020 , 07:16:42

చోరీ చేసి ఆ డబ్బుతో జల్సాలు

చోరీ చేసి ఆ డబ్బుతో జల్సాలు

ఖైరతాబాద్‌ :  తెల్లవారుజామున త్రిపుల్‌ రైడింగ్‌ చేస్తూ రోడ్లపై వెళ్లే పాదచారులు, ప్రయాణికులే వారి టార్గెట్‌... వారి చేతిలో ఉన్న సెల్‌ఫోన్‌ను లాక్కొని రెప్పపాటులో ఉడాయిస్తారు... అలాగే పార్కింగ్‌ చేసిన బైక్‌లను అపహరిస్తారు... చోరీచేసిన ఫోన్లు, బైక్‌లను విక్రయించగా వచ్చి డబ్బుతో గంజాయి, మద్యంతో ఎంజాయి చేస్తారు... ఇది కరుడుగట్టిన పాతనేరస్తుల దినచర్య. పంజాగుట్ట, ఎస్‌ఆర్‌నగర్‌లో రెండు రోజుల క్రితం ఇద్దరి సెల్‌ఫోన్‌లను అపహరించిన ఘటనలో పంజాగుట్ట పోలీసులు 48 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి రూ.7లక్షల విలువైన 13 సెల్‌ఫోన్లు, ఆరు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాయింట్‌ కమిషనర్‌, వెస్ట్‌జోన్‌ డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌, పంజాగుట్ట ఏసీపీ తిరుపతన్న, ఎస్‌హెచ్‌ఓ నిరంజన్‌ రెడ్డి, అడిషనల్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగయ్యతో కలిసి వివరాలు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా, పలాసా మండలం, డిమ్మిడిజోలాకు చెందిన సమంతు తిరుపతి (21) కూకట్‌పల్లి మూసాపేటలోని జనతానగర్‌లో నివసిస్తూ సెంట్రింగ్‌ పనులు చేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన దోపన నరేశ్‌ అలియాస్‌ నానీ (19) ఫ్యాబ్రికేషన్‌ పనులు, ఎర్రగడ్డ ప్రేమ్‌నగర్‌కు చెందిన పెండల వెంకట్‌ (19) పెయింటర్‌గా పనిచేస్తున్నారు. ఈ ముగ్గురు స్నేహితులు. అయితే వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో... సెల్‌ఫోన్లు, బైకులు దొంగతనాలు చేస్తూ... వాటిని విక్రయించగా వచ్చిన డబ్బుతో గంజాయి, మద్యం సేవిస్తూ జల్సాలు చేసుకుంటారు. 

 బైక్‌పై తిరుగుతూ...

ఈ నెల 8న అమీర్‌పేట మైత్రివనం వద్ద వైద్యురాలు నాగసాయిలక్ష్మి ఇంటికి వెళ్లేందుకు క్యాబ్‌ కోసం ఎదురుచూస్తుండగా తిరుపతి, నరేశ్‌, వెంకట్‌ ఒకే బైక్‌పై వచ్చి.. ఆమె చేతిలోని ఫోన్‌ లాక్కెళ్లారు. అలాగే ఆ ప్రాంతంలోనే రామరాజ్‌ కాటన్‌ షోరూమ్‌ వద్ద బేగంపేట ఉమానగర్‌కు చెం దిన గోపల సత్యనూక ప్రసాద్‌ ఫోన్‌ మాట్లాడుకుంటూ రోడ్డుపై వెళ్తుండగా.. వెనక నుంచి వచ్చిన వీరు అతని ఫో న్‌ను లాక్కొని పారిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని.. సీసీ ఫుటేజీలు, సెల్‌ఫోన్‌ సిగ్నళ్ల ఆధారంగా వారిని గుర్తించి  అరెస్ట్‌ చేశారు. 

గతంలో నిందితులపై కేసులు...

నిందితుడు నరేశ్‌పై 20 సెల్‌ఫోన్‌, బైకు దొంగతనాల కేసులు ఉన్నాయి. అలాగే తిరుపతి, వెంకట్‌పై కూడా కేసులు ఉన్నాయి. పంజాగుట్ట, ఎస్‌ఆర్‌నగర్‌, సనత్‌నగర్‌, కూకట్‌పల్లి, మైలార్‌దేవరపల్లి, అంబర్‌పేట్‌, చిలకలగూడ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో వీరిపై కేసులు ఉన్నా యి. సదరు నిందితులు నాలుగు నెలల క్రితం జైలు నుంచి విడుదలై.. తిరిగి చోరీలు చేస్తున్నారు. వీరిపై పీడీ యాక్ట్‌ నమోదు చేస్తామని జాయింట్‌ కమిషనర్‌ ఏఆర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. కేసు ఛేదించిన ఎస్‌హెచ్‌ఓ నిరంజన్‌ రెడ్డి, అడిషనల్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగయ్య, సిబ్బందికి రివార్డులు అడిషనల్‌ కమిషనర్‌అందచేస్తామని తెలిపారు.


logo