సోమవారం 08 మార్చి 2021
Hyderabad - Jan 16, 2021 , 05:45:49

ఆ సీక్రెట్‌ ప్లేస్‌ను.. పసిగట్టలేకపోయారు

ఆ సీక్రెట్‌ ప్లేస్‌ను.. పసిగట్టలేకపోయారు

మా బంగారు ఆభరణాలు సేఫ్‌....ఇంట్లోకి దొంగలు వచ్చినా వాటిని గుర్తుపట్టలేకపోయారు... పోలీసులు కల్పించిన అవగాహన ఆభరణాలను కాపాడింది....ఇది ఓ ఇంటి యజమానురాలు సంతోషంతో పోలీసులకు చెప్పిన విషయం. ఈ సీన్‌కన్న ముందు.. సైబరాబాద్‌ మేడ్చల్‌ పోలీసులకు ఓ ఇంట్లో దొంగతనం అయ్యిందని ఫోన్‌ వచ్చింది. చోరీ జరిగిన ఇంటికి వెళ్లి దొంగతనం జరిగిన సీన్‌ను విశ్లేషించారు. ఇంట్లోని అల్మా రా, కప్‌బోర్డు లాక్‌లను దొంగలు విరగ్గొట్టి ప్రతి చీర, డ్రెస్సులను ఓపెన్‌ చేశారు. చివరకు.. అల్మారాలో ఉన్న కొంత సామగ్రిని ఎత్తుకెళ్లారని అక్కడి పరిస్థితి బట్టి పోలీసులు గుర్తించారు.   వెంటనే ఆ ఇంటి యజమానులకు ఫోన్‌ చేయగా గృహిణి మాట్లాడి.. సార్‌... దాదాపు మా ఇంట్లో 44 తులాల బంగారం ఉంది... చోరీ జరిగిందంటే అంతాపోయి ఉంటుందని ఆమె పోలీసులకు తెలిపింది. 44 తులాల బంగారం ఆభరణాలు .. దాదాపు రూ.22 లక్షల విలువ చేసే సొత్తా అని పోలీసులు షాక్‌కు గురయ్యారు. ఇన్ని చర్యలు తీసుకున్నా.. పెట్రోలింగ్‌ చేసినా.. దొంగలు ఎలా వచ్చారని పరేషాన్‌ అయ్యారు. ఈ సంఘటన మేడ్చల్‌ సూర్యనగర్‌లో బుధవారం అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో జరిగింది. 

 రహస్య ప్రాంతంలో భద్రం..

సంక్రాంతి రోజు ఇంట్లో దొంగతనం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇంతలో.. అదే రోజు సాయంత్రం ఆ గృహిణి కుమారుడు ఇంటికి వచ్చి వాళ్ల అమ్మ పెట్టిన రహస్య ప్రదేశంలో వెళ్లి చూశాడు. అక్కడ 33 తులాల బంగారం సేఫ్‌గా ఉందని గుర్తించాడు. ఈ విషయాన్ని మొదట తల్లికి చెప్పి.. ఆ తర్వాత పోలీసులకు చెప్పాడు. చోరీకి గురైంది తులం వెండి, పాత నొకియా ఫోన్‌.. కొంత చిల్లర సామాన్లు అని అతడు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకుని శభాష్‌ తల్లి.. నీవు గ్రేట్‌ అని ఆ గృహిణికి కితాబును ఇచ్చారు. అయితే .. దొంగలు సాధారణంగా అల్మారాలు, కప్‌బోర్డులు, మంచం పరుపు కింద, బట్టల మధ్యలో పెడ్తారని ఊహించి.. వాటన్నింటిని సర్దుతారని తెలిసి.. ఇంట్లోనే ఓ రహస్య ప్రాంతాన్ని గుర్తిం చి నగలను అక్కడ పెట్టానని ఆమె చెప్పింది. పోలీసులు కల్పిస్తున్న అవగాహన ఈ విధంగా సహాయం పడటంతో అందరూ సంతోషంగా ఉన్నారు. దర్యాప్తులో భాగంగా మేడ్చల్‌ పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా.. ఆ ఇంట్లోకి ప్రవేశించింది ఇద్దరు దొంగలని తేలిసింది. వారి కోసం గాలిస్తున్నారు.

VIDEOS

logo