శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Hyderabad - Aug 05, 2020 , 00:17:36

వీళ్ల బలహీనతే.. వాళ్ల పెట్టుబడి...

వీళ్ల బలహీనతే.. వాళ్ల పెట్టుబడి...

అత్యాశ చూపి భారీగా దోచేస్తున్న సైబర్‌ నేరగాళ్లు.. 

మాయమాటలకు బోల్తా పడుతున్న బాధితులు 

చవగ్గా దొరికితే బాగుండన్న అత్యాశ. ఏదైనా పొరపాటు జరిగినప్పుడు ఎవరిని సంప్రదించి పరిష్కరించుకోవాలో అవగాహన లేకపోవడం. ఏ శ్రమా లేకుండా ఎక్కడి నుంచో డబ్బులు ఊడిపడాలన్న అత్యాశ. ఇలాంటి బలహీనతలే సైబర్‌నేరగాళ్లకు స్వర్గధామమవుతున్నాయి. ఆన్‌లైన్‌ ఆకర్షణలనే పెట్టుబడిగా పెట్టి కోట్లు దోచుకుంటున్నారు. ఇందులో ఎక్కువగా బాధితులు చేసే పొరపాట్లే ఎక్కువగా ఉంటున్నాయని పోలీసులు విశ్లేషిస్తున్నారు. ప్రతి రోజూ సైబర్‌నేరగాళ్లు వివిధ రకాలుగా ప్రజలను మోసం చేస్తున్నారు. మోసం చేసే వారిలో చాలా మంది పదో తరగతి కూడా పాసై ఉండరు. కానీ మోసపోతున్న వారిలో అత్యధికులు ఉన్నత చదువులు చదివిన వారే ఉండటం గమనార్హం. ఏ ఒక్క అవకాశాన్నీ వదలకుండా సైబర్‌నేరగాళ్లు ప్రతి నిత్యం తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటారు. ఇందులో అమాయకులు, అత్యాశపరులు సులువుగా సైబర్‌నేరగాళ్లకు దొరికిపోతున్నారు. లాటరీ, మ్యాట్రిమోనీ, రుణాలు, బీమా, ఓఎల్‌ఎక్స్‌, జాబ్‌ ఫ్రాడ్‌ల వంటి వాటికి మూల కారణం అత్యాశనే. ఓటీపీలు, సోషల్‌మీడియా ద్వారా జరిగే నేరాలు, రిమోట్‌ యాప్స్‌, కేవైసీ అప్‌డేట్స్‌ వంటి నేరాలు అవగాహన రాహిత్యం జరుగుతుండగా, కస్టమర్‌ కేర్‌, స్ఫూపింగ్‌ మెయిల్స్‌తో జరిగే నేరాలు నిర్లక్ష్యంతో జరుగుతున్నట్లు పోలీసులు తేల్చారు.  -సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ

కోటి రూపాయల బహుమతి

ఏ శ్రమా లేకుండా కోటి రూపాయల బహుమతి వస్తుందంటే..వెనకా ముందు ఆలోచించాలి. ఆ లాజిక్‌ మరిచిపోతే ఏమవుతుందో ఈ ఘటన పాఠం నేర్పుతుంది. నగరానికి చెందిన ఓ వైద్యురాలికి ఫేస్‌బుక్‌లో గుర్తుతెలియని వ్యక్తితో స్నేహం ఏర్పడింది. తాను లండన్‌లో వ్యాపారినని నమ్మించాడు. ఆ తర్వాత ఇద్దరూ చాటింగ్‌ ప్రారంభించారు. ఇద్దరి స్నేహం బలపడింది. కొన్నాళ్లకు డాక్టర్‌కు కోటి రూపాయల బహుమతిని పంపిస్తున్నానంటూ చెప్పాడు. ఢిల్లీ విమానాశ్రయం నుంచి మాట్లాడుతున్నాననంటూ ఓ యువకుడు డాక్టర్‌కు ఫోన్‌ చేశాడు. విదేశాల నుంచి వచ్చిన విలువైన బహుమతికి 10 లక్షల వరకు కస్టమ్స్‌ చార్జీలు కట్టాలని చెప్పాడు. అంత విలువైన బహుమతి అనే సరికి డాక్టర్‌ కూడా లాజిక్‌ మరిచిపోయి ఆన్‌లైన్‌లో డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేసింది. ఆ మరుక్షణం నుంచి ఫేస్‌బుక్‌ స్నేహితుడు తన అకౌంట్‌ను తొలగించి కనిపించకుండా మాయమయ్యాడు. తనను నిండా ముంచారని డాక్టర్‌కు  ఆలస్యంగా అర్థమైంది.

కొత్తవారితో పరిచయం కొంపముంచింది 

అమీర్‌పేట్‌కు చెందిన మాలతి కొత్తగా ఫేస్‌బుక్‌ ఖాతాను తెరిచింది. తనకు తెలిసిన స్నేహితులందరికీ ఫ్రెండ్‌ రెక్వెస్ట్‌ పంపించింది. ఆమెకు కూడా కొన్ని ఫ్రెండ్‌ రెక్వెస్ట్‌లు రావడంతో పరిచయం లేని వారికి కూడా అంగీకారం తెలిపింది. రోజూ చాటింగ్‌ చేసుకునేవారు. అందులో అనేక విషయాలు, రహస్యాలు పంచుకునేవారు. తర్వాత ఆ మిత్రుడు కొన్నాళ్లకు ఆమె ఫొటోలను డౌన్‌లోడ్‌ చేసి చాట్‌ చేసుకున్న విషయాలను జతపరిచి అందరికీ తెలిసేలా పెట్టాడు. బ్లాక్‌ మెయిల్‌ చేయసాగాడు. నమ్మి రహస్యంగా మాట్లాడుకున్న మాటలన్నీ బయటపెట్టడంతో మాలతి హతాశురాలైంది. సోషల్‌ మీడియా అకౌంట్‌ను ఎలా వాడాలో అవగాహన లేకపోయేసరికి ఇలా ఇక్కట్ల పాలైంది.

ఓటీపీ కూడా చెప్పేశాడు 

అవగాహన లేకపోతే ఎలా మనం మోసపోతామో ఈ సంఘటన వివరిస్తుంది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసే శరత్‌ తన స్నేహితుడికి గూగుల్‌పే ద్వారా 10వేలు చెల్లించాడు. అయితే ఆ డబ్బు అతనికి చేరకపోవడంతో శరత్‌ గూగుల్‌లో కస్టమర్‌ కేర్‌ నంబర్‌ కోసం వెతికాడు. అందులో లభించిన ఓ నంబరుకు ఫోన్‌ చేస్తే వాళ్లు డబ్బులు వెనక్కి ఇచ్చేస్తామని చెప్పారు. అందుకోసం ఆన్‌లైన్‌లో కొన్ని వివరాలు నమోదు చేయాలంటూ బ్యాంకు ఖాతా, చిరునామా, మొబైల్‌ నంబర్‌ అడిగారు. చివరికి ఓటీపీ కూడా అడిగారు. ఇక్కడే ఒక్క క్షణం ఆగి ఆలోచించాల్సిన శరత్‌ విచక్షణ మరిచిపోయాడు. ఓటీపీ కూడా చెప్పేశాడు. వెంటనే అతని ఖాతా నుంచి 60వేల రూపాయలు సైబర్‌ నేరగాళ్ల ఖాతాలోకి బదిలీ అయ్యాయి. గూగుల్‌ పేలో ఉండే హెల్ప్‌ ఆప్షన్‌ను ఎంచుకొని ఉంటే శరత్‌కు ఈ సమస్య వచ్చి ఉండేది కాదు. ఎదైనా ఒక సంస్థకు సంబంధించిన సేవల కోసం ఆయా సంస్థలకు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్లనే సంప్రదించాలి. వీటిని పట్టించుకోకుండా వెంటనే గూగుల్‌లో కస్టమర్‌ కేర్‌ కోసం ప్రయత్నించి సైబర్‌నేరగాళ్ల చేతిలోకి చిక్కేస్తున్నారు.

చాటింగ్‌లో..చాలా దూరం వెళ్లి..

గుడ్డిగా నమ్మితే ఎలా మోసపోతారో ఇది ప్రత్యక్ష ఉదాహరణ. తార్నాకకు చెందిన ఓ యువతి పీజీ పూర్తి చేసి వివాహ సంబంధాలు చూసుకుంటున్నది. ఓ మ్యాట్రిమోనీ సైట్‌లో తన వివరాలు ఉంచింది. ఈ ప్రొఫైల్‌ను చూసిన ఓ యువకుడు తాను స్వీడన్‌లో వ్యాపారినని పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత తమ వ్యక్తిగత మొబైల్‌ నంబర్లతో చాటింగ్‌ ప్రారంభించారు. ఇలా కొన్నాళ్ల పాటు జరిగిన చాటింగ్‌లో ఇద్దరి మధ్య బంధం బలపడింది. తన వద్ద ఉన్న యూరోలను ఇండియాకు తీసుకొస్తున్నానని, వచ్చీ రాగానే అంగరంగ వైభవంగా వివాహం చేసుకుందామని చెప్పాడు. తీరా విమానాశ్రయం రాగానే కస్టమ్స్‌ అధికారులు విచారణ కోసం డబ్బులు ఆపారని నమ్మించాడు. కస్టమ్స్‌ డ్యూటీ 8 లక్షలు కడితే ఆ డబ్బులన్నీ మనవేనని లేదంటే కోట్ల రూపాయలు వృధాగా వాళ్ల వద్దే ఉండిపోతాయన్నాడు. ఇది నిజమేనని నమ్మిన ఆ యువతి ముందూ వెనకా ఆలోచించకుండా ఆ డబ్బులు చెల్లించేసింది.

డబ్బులు ఉచితంగా ఎందుకు ఇస్తారు 

ఎవరైనా సరే ఎందుకు మనకు ఉచితంగా డబ్బులిస్తారు? ఓ వస్తువు మనకే ఎందుకు తక్కువ ధరకు ఇవ్వాలని చూస్తున్నారు? ఉచితంగానైనా సరే పక్కింటోళ్లకు కూడా మనం పది రూపాయలివ్వాలంటే చాలా ఆలోచిస్తాం కదా. మరి మీతో ఏ బంధమూ, పరిచయమూ లేని వ్యక్తి ఎందుకు మీకు లక్షలు, కోట్లు బహుమతిగా పంపించాలనుకుంటున్నాడు? ఏ పూచీకత్తు లేకుండా రుణాలు ఎందుకు ప్రకటిస్తున్నారు? మీకు సరిపడా అర్హత లేకుండానే డబ్బులు తీసుకొని ఉద్యోగం ఎలా ఇస్తారు? ఇలాంటి ప్రశ్నలు మనకు మనమే వేసుకోవాలి. లేదా అలాంటి వ్యక్తులతో డబ్బులకు సంబంధించి వ్యవహారాలు జరిపేటప్పుడు తెలివైన స్నేహితుల సలహా తీసుకోండి. చర్చించండి. మీరు చేస్తున్న పని కరెక్టేనా అని ఒకటికి పదిసార్లు ఆలోచించండి. ‘డబ్బులు ఎవరూ మనకు ఉచితంగా ఇవ్వరు’ అనే చిన్న లాజిక్‌ ను మరిచిపోయి చాలా సులువుగా సైబర్‌ నేరగాళ్ల చేతిలో చిక్కుకుంటున్నారు. సైబర్‌నేరాలలో బాధితులే ఎక్కువగా తప్పులు చేస్తున్నారు. బాధితుల అత్యాశ, తొందరపాటు, నిర్లక్ష్యం, అవగాహన రాహిత్యం సైబర్‌నేరగాళ్లకు బాగా కలిసి వస్తున్నాయి. సులువుగా డబ్బు దక్కించుకోవాలనుకునే వాళ్లు ఉన్నంతవరకు సైబర్‌ దోపిడీలు జరుగుతూనే ఉంటాయి.


logo