మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Hyderabad - Aug 06, 2020 , 00:43:54

కండ్లల్లో నీళ్లు తిరిగినయ్‌..

కండ్లల్లో నీళ్లు తిరిగినయ్‌..

 పాజిటివ్‌ అని తెలియగానే ఆందోళన చెందా 

 నా భార్య పరిస్థితి గుర్తొచ్చి ఏడ్చేశా 

 వైద్యుల అభయంతోనే ఆరోగ్యవంతుడిగా మారా 

 కరోనా విజేత దిపాంకర్‌వాల్‌

చార్మినార్‌: ‘ఎక్కడ ఎలా అంటుకుందో తెలియదు. మూడు రోజులుగా ఒకటే జ్వరం. తీవ్రమైన ఒళ్లు నొప్పులు. స్థానికంగా ఉన్న ఓ డాక్టర్‌ వద్దకు వెళితే సాధారణ జ్వరమే అని మందులిచ్చిండు. అయినా తగ్గకపోగా రాత్రిపూట తీవ్ర జ్వరం. ఒకటే దగ్గు. ఏం అవుతుందోనని ఆందోళన పెరిగిపోయింది. స్నేహితుడి సూచన మేరకు కరోనా టెస్ట్‌ చేయించుకున్నా. పాజిటివ్‌ అని చెప్పగానే ఏడుపు తన్నుకొచ్చింది. ముఖ్యంగా నా భార్య పరిస్థితి గుర్తొచ్చి ఆందోళన మొదలైంది. నేను లేకుంటే ఎలా అన్న ప్రశ్నలే నా మదిని తొలిచేశాయి. స్నేహితులు, వైద్యులు కొండంత భరోసా ఇచ్చారు. త్వరగానే కరోనా నుంచి కోలుకున్నానని’ చార్మినార్‌కు చెందిన కరోనా విజేత దిపాంకర్‌ వాల్‌ తెలిపారు. తన అనుభవాలను ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్నారు.  ఏమన్నాడంటే ఆయన మాటల్లోనే..

బిజీబిజీగా గడుస్తుండగా.. 

బిజీబిజీగా రోజులు గడుస్తున్నాయి. కస్టమర్ల నుంచి వస్తున్న ఆర్డర్లతో తీరిక లేకుండా ఉన్నా. తయారైన ఆభరణాలను ఎప్పటికప్పుడు కస్టమర్లకు అందించే పనిలో పడ్డా. అదే సమయంలో ఓ రోజు రాత్రి జ్వరంతో పాటు జలుబు అందుకుంది. నాలుగు రోజులైనా తగ్గలే. మరో రెండు రోజులు గడిచేసరికి జ్వరం అధికమైంది. దగ్గు కూడా తీవ్రమైంది. దీంతో భయమేసింది. ఓ స్నేహితుడి సూచన మేరకు భయం భయంగానే కరోనా టెస్ట్‌ చేయించుకున్నా. పాజిటివ్‌ అని తేలగానే కండ్లల్లో నీళ్లు తిరిగినయ్‌. నా భార్య గర్భవతి. ప్రసవానికి మరో నెలన్నర సమయమే ఉండటంతో డాక్టర్లు అన్న మాటలు గుర్తొచ్చినయి. కరోనా వచ్చిందంటే ప్రాణాలు పోవడమే అన్న భావన ఉండే. సన్నిహితులు, స్నేహితులు ఇచ్చిన ధైర్యంతో వైద్యశాలలో చేరా. అక్కడ డాక్టర్లు బాగానే చూసుకున్నారు. కరోనా అంటే చిన్నపాటి జ్వరమే. త్వరగానే తగ్గిపోతుందంటూ భరోసా ఇచ్చారు. వైద్యులిచ్చిన సూచనలు, సలహాలతో ఆత్మవిశ్వాసం బలపడింది. ఆరు రోజుల చికిత్స అనంతరం కరోనా నుంచి బయటపడ్డా. ప్రస్తుతం వైద్యులు సూచించిన మేరకు మందులు వేసుకుంటున్నా. ఇప్పటికే రెండు వారాల హోం క్వారంటైన్‌ పూర్తి చేశా. పూర్తిగా ఆరోగ్యం కుదుటపడ్డాక ప్లాస్మా దానం చేస్తా.


logo