మంగళవారం 11 ఆగస్టు 2020
Hyderabad - Jul 15, 2020 , 00:13:33

అంతస్తు దిగాల్సిందే

అంతస్తు దిగాల్సిందే

చిన్న ఐటీ కంపెనీలకు ‘కరోనా’ కష్టాలు.. 

తడిసి మోపెడవుతున్న అద్దె ఖర్చులు ఉద్యోగులకు ‘వర్క్‌ ఫ్రం హోం’ ఇచ్చి... 

పొదుపు మంత్రం పాటిస్తున్న సంస్థలు నాలుగు ఫ్లోర్‌ల నుంచి రెండు ఫ్లోర్‌లకు... 

ఆఫీసు స్థలాన్ని కుదించుకుంటున్న వైనం తక్కువ అద్దెలున్న భవనాల్లోకి మారుతున్న కంపెనీలు 

సైబర్‌ టవర్స్‌ సమీపంలో ఉన్న ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీకి విదేశాల్లో ప్రధాన కార్యాలయం ఉంది. ముంబై, బెంగళూరుతో పాటు హైదరాబాద్‌లోనూ సేవలందించేందుకు శాఖలున్నాయి. అయితే మాదాపూర్‌లో ఉన్న శాఖలో మొత్తం నాలుగు అంతస్తులలో దాదాపు 200 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. లాక్‌డౌన్‌లో భాగంగా మార్చి మూడో వారం నుంచి దాదాపుగా అందరూ ఇంటి నుంచే పని చేస్తున్నారు. కేవలం ఆఫీస్‌ సర్వర్‌, ఐటీ హార్డ్‌వేర్‌, కంపెనీ సాఫ్ట్‌వేర్‌ ట్రబుల్‌ షూటింగ్‌ సిబ్బంది మాత్రమే కార్యాలయంలో ఉంటున్నారు. దీంతో నాలుగు నెలలుగా మూడు ఫ్లోర్లు ఖాళీగానే ఉంటున్నాయి. ఉద్యోగులు కూడా సేవలకు అంతరాయం కలగనీయకుండా ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తుండటంతో ఆ కంపెనీ పై రెండు ఫ్లోర్లు ఖాళీ చేయాలని నిర్ణయించుకొని భవన యజమానికి సమాచారం అందించింది. 

-సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ

గచ్చిబౌలిలోని ఓ అపార్టుమెంట్‌లో రెండు ఫ్లాట్‌ల స్థలాన్ని అద్దెకు తీసుకొని 40 మందితో ఓ స్టార్టప్‌ పనిచేస్తున్నది. లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి ఆ రెండు ఫ్లాట్‌లలో ఏ ఒక్కరూ పనిచేయడం లేదు. అందరూ ఇంటి నుంచే పనిచేస్తున్నారు. దీంతో ఆ స్టార్టప్‌ నిర్వాహకులు ఆ రెండు ఫ్లాట్లను ఖాళీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆన్‌లైన్‌ వేదికలనే కార్యాలయంగా మార్చుకున్నారు. అప్పులేని వాడే అధిక సంపన్నుడని సామెత. ఇప్పుడు ఈ హితవునే అనుసరిస్తున్నాయి చిన్న చిన్న ఐటీ కంపెనీలు. ఓ వైరస్‌లా వచ్చి అన్ని వ్యవస్థలనూ ఛిన్నాభిన్నం చేస్తున్న కరోనాను ఎదుర్కోలేక చిన్నస్థాయి సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమలు కొత్త పొదుపు సూత్రాలను అవలంబిస్తున్నాయి. అటు తమ సేవలు, వ్యాపారానికి భంగం వాటిల్లకుండా ఇటు ఉద్యోగుల భద్రతకు నష్టం కలగకుండా అధిక ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. నాలుగు ఫ్లోర్లు అద్దెకు తీసుకున్న వాళ్లు రెండు ఫ్లోర్లలో మాత్రమే ఉద్యోగ సేవలను సరిపెట్టాలని యోచిస్తున్నాయి.

నిర్వహణకే 30 శాతం ఖర్చు

నగరంలో దాదాపు 1500 నుంచి 2 వేల వరకు చిన్నా పెద్ద ఐటీ కంపెనీలు ఉన్నాయి. దాదాపు 6 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. సాధారణంగా ఐటీ కంపెనీలు ప్రతి నెలా సుమారు 30 శాతం నిధులు కార్యాలయ నిర్వహణ కోసం కేటాయిస్తాయి. ప్రస్తుత కరోనా ఆపత్కాలంలో ఖర్చులు తగ్గించుకునేందుకు హైటెక్‌సిటీ, మాదాపూర్‌, కొండాపూర్‌, గచ్చిబౌలి, నానక్‌రాం గూడ తదితర ప్రాంతాల్లో కంపెనీలు తక్కువ అద్దెకు ఉన్న భవనాల్లోకి వెళ్లిపోతున్నాయి. తక్కువ విస్తీర్ణం గల గదుల్లోకి మారుతున్నాయి. కార్యాలయ స్థలాన్ని పొందే ప్రక్రియలో ఉన్నవారు లీజు ఒప్పందాలను రద్దు చేస్తుండగా.. ఇప్పటికే కార్యాలయ స్థలం ఉన్నవారు ఆఫీసు స్థలాన్ని విస్తరించడం అనవసరమని భావిస్తున్నారు. వర్క్‌ ఫ్రం హోం నేపథ్యంలో యాజమాన్యాలు నిర్వహణ ఖర్చులు తగ్గించుకుంటున్నాయి. 

‘ఇంటి నుంచి పని’ పొడిగింపు..!

ఐటీ కారిడార్‌లో ఇది వరకు కార్యాలయ స్థలాలు హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయేవి. ప్రస్తుతం ఆ పరిస్థితులు కనిపించడం లేదు. అన్ని కంపెనీల్లో దాదాపు 90 శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తున్నారు. మూడున్నర నెలలుగా ఉన్న ఈ సదుపాయాన్ని గూగుల్‌, డెలాయిట్‌ వంటి కంపెనీలు డిసెంబర్‌ వరకు పొడిగించాయి. మరికొన్ని కంపెనీలు మూడో వంతు ఉద్యోగులతో పనిచేస్తున్నాయి.

చిన్న కంపెనీలపై ఎక్కువ ప్రభావం 

చిన్న కంపెనీలపైనే కరోనా ప్రభావం ఎక్కువ పడుతున్నది. గదుల నిర్వహణ భరించలేక తక్కువ అద్దెలున్న ప్రాంతాల్లోకి కంపెనీలు మారుతున్నాయి. దేశవ్యాప్తంగా ఐటీ రంగంపై ఇదే ప్రభావం ఉంది. ముఖ్యంగా స్టార్టప్‌లకు కొంచెం కష్టకాలమనే చెప్పాలి. కొన్ని స్టార్టప్‌లు ఇప్పటికే మూతపడ్డాయి. కొత్త కంపెనీలు తమ కార్యకలాపాల విస్తరణ తాత్కాలికంగా వాయిదా వేసుకున్నాయి. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌ ఐటీ రంగం మెరుగ్గా ఉంది. 

-ఎం. సత్యనారాయణ, టీఎఫ్‌ఎంసీ అధ్యక్షుడు

ప్రత్యామ్నాయ మార్గాలు తప్పవు

మా ఆఫీసు విస్తీర్ణం 15 వేల చదరపు అడుగులు. 200 మంది ఉద్యోగులు పనిచేస్తుంటారు. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో 70 శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తున్నారు. 30 శాతం మంది ఆఫీసుకు వస్తున్నారు. కిరాయిలు తగ్గించాలని భవన యజమానులను కోరాం. అది సాధ్యం కాని పక్షంలో తక్కువ విస్తీర్ణంలో సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తాం. ఇంటి వద్ద నుంచి పనిచేయడం ఉద్యోగులకు అలవాటైంది. కొంతమంది సొంతూళ్ల నుంచి జాబ్‌ చేస్తున్నారు. 

-పుస్కూరు శ్రీకాంత్‌ రావు, వైస్‌ ప్రెసిడెంట్‌, టెక్నిక్స్‌ కంపెనీ


logo