మంగళవారం 04 ఆగస్టు 2020
Hyderabad - Jul 06, 2020 , 00:20:07

చుక్క నీరూ వృధా కాదు

చుక్క నీరూ వృధా కాదు

సిబ్బంది లేకుండానే ట్యాంకర్‌లోకి నీళ్లు 

ఐవోటీ పరిజ్ఞానంతో అక్రమాలు, నీటి వృథాకు చెక్‌ 

జూబ్లీహిల్స్‌ ఫిల్లింగ్‌ కేంద్రంలో ప్రయోగం సక్సెస్‌..

అన్ని చోట్లా అమలుకు జలమండలి సన్నద్ధం 

సిటీబ్యూరో: ట్యాంకర్‌ ఫిల్లింగ్‌ కేంద్రాల వద్ద నీటి వృథా, అక్రమాలను అరికట్టేందుకు జలమండలి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక నుంచి ఫిల్లింగ్‌ కేంద్రాల వద్ద ప్రతి నీటి బొట్టును లెక్కించనున్నారు. ట్యాంకర్ల ఫిల్లింగ్‌లలో ఆధునిక సాంకేతిక వ్యవస్థ ఇంటర్‌నెట్‌ ఆఫ్‌ థింక్స్‌ (ఐవోటీ) విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. ప్రస్తుతం నగరంలో 143 ఫిల్లింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాల వద్ద సిబ్బంది పైపులైన్‌ ద్వారా ట్యాంకర్లను నింపుతుండేవారు. ఈ క్రమంలో ట్యాంకర్లు నిండిపోయినా..నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల నీరు వృథాగా పోవడంతో పాటు అక్రమాలు సైతం చోటు చేసుకునేవి. ప్రస్తుతం తీసుకువచ్చిన ఈ విధానంతో ఎవరి ప్రమేయం లేకుండానే యాక్చువేటర్‌ పరికరం ఉపయోగించి.. ఐవోటీ  సాంకేతికతతో ట్యాంకర్లను నింపనున్నారు. తాజాగా జూబ్లీహిల్స్‌ ఫిల్లింగ్‌ కేంద్రం వద్ద  ప్రయోగాత్మకంగా ఈ కొత్త విధానం అమలు చేశారు. అది విజయవంతమైంది. త్వరలోనే మిగతా ఫిల్లింగ్‌ కేంద్రాల వద్ద అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఎండీ దానకిశోర్‌ వెల్లడించారు..

ఇలా పనిచేస్తుంది..

దశల వారీగా ఫిల్లింగ్‌ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసే ఐవోటీ విధానంతో చుక్క నీరు కూడా వృథా కాదు. పైపు కింద ట్యాంకర్‌ పెట్టగానే సెన్సార్ల ద్వారా ఆటోమేటిక్‌గా నీళ్ల్లు నిండిపోయి.. ఆగిపోతుంది. తద్వారా నీరు వృథా అరికట్టడమే కాకుండా అక్రమాలకు శాశ్వతంగా చెక్‌ పెట్టవచ్చు.  


logo