ఆదివారం 09 ఆగస్టు 2020
Hyderabad - Jul 04, 2020 , 01:37:33

ఆరడుగుల దూరం.. మోగుతుంది అలారం

ఆరడుగుల దూరం.. మోగుతుంది అలారం

భౌతిక దూరం పాటించని వారిని పట్టేసే ‘సుడ్‌ఆర్‌జడ్‌'

డిస్టెన్సింగ్‌ మానిటరింగ్‌ టూల్‌ను రూపొందించిన మావెన్‌ సంస్థ 

కొండాపూర్‌: ప్రపంచాన్ని వణికిస్తూ జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా ఇప్పట్లో అంతమయ్యేలా లేదు. స్వీయ నియంత్రణ, భౌతిక దూరమే రక్షిస్తాయని ఓ వైపు ప్రభుత్వం, మరోవైపు వైద్యులు మొత్తుకుంటున్నా కొందరు పెడ చెవిన పెడుతున్నారు. అయితే రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు భౌతిక దూరాన్ని విస్మరిస్తున్న విషయాన్ని తెలుసుకోవడం ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఇదే విషయాన్ని సవాల్‌గా తీసుకున్న మావెన్‌ సంస్థ డిస్టెన్సింగ్‌ మానిటరిగ్‌ టూల్‌-సుడోఆర్‌జెడ్‌ను రూపొందించింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అమర్చిన సీసీ కెమెరాల్లో ఈ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్‌ చేసింది. దీంతో రద్దీగా ఉన్న ప్రాంతాల్లో భౌతిక దూరం పాటించని వారి వివరాలను గుర్తిస్తున్న సీసీ కెమెరాలు  డెస్క్‌టాప్‌లకు అలర్ట్‌ సందేశాన్ని ఇస్తుండగా.. సంబంధిత అధికారులు అప్రమత్తమవుతున్నారు. 

పనితీరు ఇలా.. 

మాల్స్‌, మార్కెట్లు, బస్‌స్టేషన్లలో ఇప్పటికే ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల మానిటరింగ్‌ సిస్టమ్స్‌లో సుడ్‌ఆర్‌జెడ్‌ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్‌ చేస్తారు. వ్యక్తికి వ్యక్తికి మధ్య ఆరు అడుగుల సామాజిక దూరం పాటించేలా ఈ సాఫ్ట్‌వేర్‌లో ప్రోగ్రాం రూపొందించారు. అయితే రద్దీగా ఉండే ప్రాంతాల్లోని కెమెరాలు ప్రజల కదలికలను గమనించడంతో పాటు ఎక్కడైతే సామాజిక దూరం పాటించరో వెంటనే మానిటరింగ్‌ చేస్తున్న సిస్టమ్స్‌కు సిగ్నల్‌ పంపగా.. అలారం మోగుతుంది. వెంటనే అధికారులు ఆ ప్రాంతంలో తగు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సాఫ్ట్‌వేర్‌ను హైదరాబాద్‌లోని సెంట్రల్‌ యూనివర్సిటీలో ఉన్న ఇంక్యుబేటర్‌ సెంటర్‌లో వినియోగిస్తున్నారు.

ఏదో ఒకటి చేయాలన్న తలంపుతోనే..  

కరోనా కట్టడికి ఏదో ఒకటి చేయాలన్న తలంపుతోనే సుడ్‌ఆర్‌జెడ్‌ను రూపొందించాం. రద్దీగా ఉండే ప్రదేశంలో ప్రజలు భౌతిక దూరం పాటించేలా చూడటమే ఈ సాఫ్ట్‌వేర్‌ ముఖ్యోద్దేశం. పాస్‌పోర్టు వెరిఫికేషన్‌, ఉద్యోగుల వివరాల సేకరణ వంటి ప్రదేశాల్లో ఏఐ టెక్నాలజీని వినియోగించి రిమోట్‌ ఫేషియల్‌ రికగ్నైజేషన్‌ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తున్నాం. ఇది ప్రస్తుతం ట్రయల్‌ రన్‌లో ఉంది. - సి. భవాని శంకర్‌గౌడ్‌, సీఈఓ మావెన్‌ సంస్థ


logo