గురువారం 26 నవంబర్ 2020
Hyderabad - Jul 05, 2020 , 23:50:08

అదిరేలా.. ఆరంభం..!

అదిరేలా.. ఆరంభం..!

పచ్చని పందిళ్ల నడుమ నగర ప్రవేశం 

ప్రయాణికులను ఆకట్టుకునేలా ఇంటర్‌ఛేంజ్‌ల బ్యూటిఫికేషన్‌

కనువిందు చేసేలా అందాలు, స్వాగత తోరణాలు 

మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు హెచ్‌ఎండీఏ సన్నాహాలు  

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఆరంభం అదిరిపోనున్నది. అబ్బురపరిచే రీతిలో నగర ప్రవేశం మారనున్నది. జిల్లాల నుంచి భాగ్యనగరంలోకి వచ్చే ప్రయాణికులు, సందర్శకులకు వినూత్న రీతిలో స్వాగతం పలికేలా ఏర్పాట్లకు హెచ్‌ఎండీఏ సిద్ధమైంది. రాజధాని మణిహారమైన ఔటర్‌ కేంద్రంగా నాగ్‌పూర్‌ (ఎన్‌హెచ్‌ 44), బెంగళూరు (ఎన్‌హెచ్‌ 44), ముంబై (ఎన్‌హెచ్‌ 65), విజయవాడ (ఎన్‌హెచ్‌ 65) రహదారుల నుంచి నగరంలోకి ప్రవేశించే ప్రయాణికులకు ఆపూర్వ స్వాగతం పలికేలా ఇంటర్‌ఛేంజ్‌లను తీర్చిదిద్దనున్నారు. ఒక్కో ఇంటర్‌ఛేంజ్‌లో ఒక్కో థీమ్‌తో సుందరీకరణ పనులు చేపట్టనున్నారు. వరంగల్‌ వైపు నుంచి నగరానికి వచ్చే ప్రయాణికులకు ఘట్‌కేసర్‌ ఇంటర్‌ఛేంజ్‌లో వరంగల్‌ విశిష్టత.. ప్రాముఖ్యతను వివరిస్తూ కాకతీయ తోరణం, నాగార్జునసాగర్‌ నుంచి వచ్చే వారిని ఆకట్టుకునేలా బొంగుళూరు ఇంటర్‌ఛేంజ్‌ వద్ద బుద్దుడి శిల్పం.. ఇలా జిల్లాల వారీగా ప్రత్యేకతలతో స్వాగత తోరణాలను ఏర్పాటు చేయనున్నారు. కరీంనగర్‌ నుంచి వచ్చే వారిని దృష్టిలో ఉంచుకొని శామీర్‌పేట, ఓల్డ్‌ ముంబై హైవే మీదుగా వచ్చే వారికి పటాన్‌చెరువు, నిజామాబాద్‌ నుంచి వచ్చే ప్రయాణికులకు కండ్లకోయ జంక్షన్‌లో సరికొత్త అందాలు స్వాగతం పలుకనున్నాయి.  ఔటర్‌లోని 19 ఇంటర్‌ఛేంజ్‌లు కోకాపేట,  ఈదుల నాగుర్లపల్లి, పటాన్‌చెరు, సుల్తాన్‌పూర్‌, దుండిగల్‌/సారాయిగూడెం, మేడ్చల్‌, శామీర్‌పేట, కీసర, ఘట్‌కేసర్‌, తారామతిపేట, పెద్దఅంబర్‌పేట, బొంగుళూరు, రావిర్యాల, తుక్కుగూడ, పెద్ద గోల్కొండ, కండ్లకోయ, శంషాబాద్‌, రాజేంద్రనగర్‌, టీఎస్‌పీఏ, నానక్‌రాంగూడలో సుందరీకరించనున్నారు. మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు సుందరీకరణ పనులకు సంబంధించిన థీమ్‌ల రూపకల్పనపై ఔటర్‌ విభాగం అధికారులు కసరత్తు చేస్తుండగా, త్వరలోనే టెండర్లను పిలిచి పనులను చేపట్టనున్నారు. 

ఎటు చూసినా పచ్చదనమే..

  వివిధ జిల్లాల నుంచి నగరానికి వచ్చే ప్రయాణికులను ఆకట్టుకునే రీతిలో పచ్చదనాన్ని పెంపొందించే దిశగా హెచ్‌ఎండీఏ అర్బన్‌ ఫారెస్ట్రీ విభాగం అధికారులు చర్యలు చేపట్టనున్నారు. ఓఆర్‌ఆర్‌ దాటి నగరానికి చేరుకునే క్రమంలో కిలోమీటర్ల మేర ప్రధాన రహదారికి పచ్చని సొబగులను అద్దనున్నారు. ప్రధాన రహదారికి మధ్యసెంట్రల్‌ మీడియన్‌లో ఆకట్టుకునే మొక్కలు, రోడ్డుకు ఇరువైపులా పచ్చని తోరణాలు కనువిందు చేసేలా చర్యలు చేపట్టనున్నారు. సంబంధిత మున్సిపాలిటీ అధికారుల సమన్వయంతో ఈ గ్రీనరీ పనులు చేపట్టనున్నారు.