ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Hyderabad - Aug 12, 2020 , 22:59:23

ఆ మోసగాడు.. చైతన్యే..!

ఆ మోసగాడు.. చైతన్యే..!

   సిటీబ్యూరో: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పేరొందిన గాయకురాలి పేరుతో మోసాలకు పాల్పడిన వ్యక్తి మరో మోసం చేసినట్లు సైబరాబాద్‌ పోలీసులు గుర్తించారు. ఇటీవల సైబరాబాద్‌ సైబర్‌ ఠాణా పోలీసులకు చిక్కిన అనంతపురం ప్రాంతానికి చెందిన అంకే చైతన్య అలియాస్‌ చాణక్య.. రాచకొండ పరిధిలో మరో మహిళ నుంచి రూ.1.70 కోట్లు వసూలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఇటీవల తెలుగు సినీ గాయకురాలు చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు చేసిన సైబర్‌ క్రైం పోలీసులు.. వారం రోజుల కిందటే చైతన్యను అరెస్టు చేశారు. ఈ వార్తను పత్రికల్లో చూసిన బాధితురాలు.. రాచకొండ సైబర్‌ ఠాణాలో తాజాగా ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం జైలులో ఉన్న చైతన్య మోసాలు ఒక్కొక్కటికి బయటకువస్తున్నాయి. చైతన్య ఇంకా ఎంత మందిని మోసం చేశాడు.. అతడితో కలిసి ఇంకా ఎవరైనా ఉన్నారా..! అన్న కోణంలో దర్యాప్తు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఇందుకు జైలులో ఉన్న చైతన్యను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. వినోద పాత్రలను పోషించే నటిని బాధితురాలి వద్దకు ఎలా పంపించాడు.. అన్న విషయాన్ని తెలుసుకునేందుకు నటి పాత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.logo