e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home హైదరాబాద్‌ అమ్మల వేదిక అనుభవాల కలయిక

అమ్మల వేదిక అనుభవాల కలయిక

అమ్మల వేదిక అనుభవాల కలయిక
 • ఇంట్లో సంతోషం, బాధలు, విజయాలు, ఆర్థిక విషయాలు చర్చించుకునే వెసులుబాటు
 • చిన్న కుటుంబాలు కావడంతో తగ్గిన సత్సంబంధాలు
 • 18వేల మంది సభ్యులతో ‘తెలుగు మామ్స్‌’ ఫేస్‌బుక్‌ గ్రూప్‌
 • ప్రదీప్తి విస్సంశెట్టి వినూత్న ఆలోచన

సిటీబ్యూరో, జూన్‌ 11 (నమస్తే తెలంగాణ): ప్రస్తుతం అన్నీ చిన్న కుటుంబాలే..ఉద్యోగం, వ్యాపారం, ఉపాధి కోసం చాలామంది వలసలు రావడంతో ఉమ్మడి కుటుంబాలు కనుమరుగయ్యాయి. ఇంట్లో భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు. ఎవరి పని వారిదే. ఇంటికోసం, పిల్లల అభ్యున్నతి కోసం రోజంతా కష్టపడే తల్లి తపన అంతాఇంతా కాదు. అయితే ఆ తల్లి బాధలు, సంతోషం, సాధించిన విజయం, పిల్లల పెంపకం, ఆర్థిక పురోగతి తదితర విషయాలు చర్చించుకునేందుకు, ఆమె మనోభావాలు పంచుకునేందుకు కరువయ్యారు. ఇలాంటి వారికి చక్కటి వేదిక కావాలని, ఇల్లాలి అనుభవాలు మరింతమందికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఉన్నత స్క్యూబ్‌ రేడియో ఆర్‌జే, స్వచ్ఛంద సేవకురాలు ప్రదీప్తి విస్సంశెట్టి ‘తెలుగు మామ్స్‌ నెట్‌వర్క్‌’ పేరిట ఫేస్‌బుక్‌ గ్రూప్‌ ఏర్పాటు చేశారు. తెలుగుపై మమకారం,మాతృభాషలోనే అమ్మల మనోభావాలను పంచుకోవాలనే సంకల్పంతో ప్రారంభించిన ఈ గ్రూప్‌లో కేవలం 18 నెలల్లోనే ప్రపంచవ్యాప్తంగా 18 వేలమంది సభ్యులు చేరడం విశేషం. ఇందులోని సభ్యులెవరైనా గొప్పపని చేస్తే అభినందిస్తారు. కష్టాల్లో ఉంటే ఓదార్పు కల్పించేందుకు గ్రూప్‌ సభ్యులు ముందుంటారు.

తెలుగు మామ్స్‌ గ్రూప్‌లో..

ఈ గ్రూప్‌లో తల్లులు, పెద్ద వయస్కుల వారు, కొత్తగా పెళ్లి చేసుకున్న మహిళలు ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ గ్రూప్‌ సభ్యులు తెలుగులోనే తమ ఆలోచనలు పంచుకుంటారు. ఇందులో పలు రంగాలకు చెందిన ప్రముఖ మహిళలు ఉన్నారు. ఉద్యోగాలు చేసేవారు, ఇంటిపని బాధ్యతగా చేసుకునే గృహిణులు, ఇంటి నుంచి రకరకాల వ్యాపారాలు చేసి సంపాదించేవారు, రచయిత్రులు, టీచర్లు, యూట్యూబ్‌ చానల్‌ నిర్వాహకులు..ఇలా ఆయా రంగాల్లో పేరు పొందిన ఎంతోమంది ఉన్నారు. అందరికీ ఉపయోగపడే విషయాలను చర్చించుకునేందుకు ప్రతిరోజు ఒక అంశంపై ఈ గ్రూప్‌లో చర్చ జరుపుతుంటారు.

రోజువారీగా చర్చించే అంశాలు ప్రధానంగా..

 • సోమవారం- శారీరక, మానసిక ఆరోగ్యం, ఇంటి అలంకరణ చిట్కాలు, విషయాలు, సలహాలు
 • మంగళవారం- మంచి అలవాట్లు, పుస్తక పరిచయాలు, పుస్తక విశ్లేషణ, హాబీలు, ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌
 • బుధవారం- వ్యాపార ప్రకటనలు, ఉద్యోగావకాశాల ప్రకటనలు, యూట్యూబ్‌ చానళ్లు
 • గురువారం- తెలుగు సాహిత్య చర్చలు, సాహిత్య పోటీలు
 • శుక్రవారం- తెలుగు ఆచారాలు, పండుగలు, మన గ్రూప్‌ మహాలక్ష్మి (ఆర్థిక ప్రగతిపై)
 • శనివారం- వంటింటి చిట్కాలు,రెసిపీలు, సౌందర్య చిట్కాలు, పిల్లల చదువు
 • ఆదివారం- సినిమా కబుర్లు, విశ్లేషణలు, సరదా ఆటలు, గ్రూప్‌లోని సభ్యుల వ్యక్తిగత పరిచయం లేదా అమ్మల్లో స్ఫూర్తిని పెంచే కార్యక్రమాలు నిర్వహిస్తారు.

పెరిగిన సోషల్‌ మీడియా ప్రాధాన్యం

- Advertisement -

ప్రస్తుతం సోషల్‌మీడియాకు ప్రాధాన్యం పెరిగింది. అందులోనూ ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ వంటి వినియోగం జీవితంలో భాగమైంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మన మాతృభాషలో తొలిసారి అమ్మల కోసం ప్రారంభించిన తెలుగు మామ్స్‌ నెట్‌వర్క్‌ ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులోని అమ్మలు తమ సమస్యలు,వృత్తి పనులు, వ్యాపారపరమైన అంశాలపైనే కాకుండా వారి మనసులోని భావాలను వ్యక్తం చేసేందుకు అమ్మంటే.. పేరుతో పుస్తకాన్ని వెలువరించారు. వెంటనే 50 మంది సభ్యులు తమ మనోభావాలను అమ్మంటే శీర్షికతో కథలు, కవితలు, వ్యాసాలు రాశారు. రచయితలు, వ్యవస్థాపకులు, వైద్యులు, ఆహార పదార్థాల తయారీదారులు,బ్యూటీషియన్లు, మనస్తత్వవేత్తలు, విద్యావేత్తలు, గాయకులు, వ్యాఖ్యాతలు, గృహిణులు, ట్యూటర్లు ఇలా అనేక రంగాలకు చెందిన ఎంతో మంది ఉన్నారు. నిత్యం ఆన్‌లైన్‌లో మాట్లాడుతుండటం, సందేశాల ద్వారా ఒకరినొకరు పలకరించుకోవడం వల్ల చాలామంది తల్లులు స్నేహితులయ్యారు.

గ్రూప్‌లో విమర్శలనేవి ఉండవు

అమ్మలకు సంబంధించి ఆంగ్లంలో ఫేస్‌బుక్‌ గ్రూపులు చాలా ఉన్నాయి. కానీ తెలుగులో గ్రూపు ఉండాలనే ఉద్దేశంతో 2019 సెప్టెంబర్‌ 4న ‘తెలుగు మామ్స్‌ నెట్‌వర్క్‌’ పేరుతో ఫేస్‌బుక్‌ గ్రూప్‌ ఏర్పాటు చేశాం. ఇందులో ఒక్కరోజులోనే 600 మంది సభ్యులుగా చేరారు. 18 నెలల్లోనే ప్రపంచవ్యాప్తంగా 18వేల మంది చేరడం ఎంతో ఆనందాన్నిచ్చింది. నాతోపాటు గ్రూప్‌ సహ నిర్వాహకురాలిగా స్వప్న చేరడంతో సమష్టిగా చర్చిస్తూ మహిళలకు ఉపయోగపడేలా కార్యాచరణ అమలు చేస్తున్నాం. గ్రూప్‌లో ఒకరినొకరు గౌరవించుకోవడం తప్ప.. విమర్శలు అనేవి ఉండవు. గ్రూప్‌లో చేర్చుకోవాలంటే మొదటి నిబంధన ఇదే.

ఇందులో అమ్మలు తప్ప మరొకరికి ప్రవేశం లేదు. ‘అమ్మా నీకు వందనం’ పేరుతో 1800 మందికి పైగా తల్లులతో ఆన్‌లైన్‌ వేదికగా నిర్వహించిన గ్లోబల్‌ ఈవెంట్‌ తెలుగుబుక్స్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో నమోదైంది. తెలుగువారి సంస్కృతి భావితరాలకు పదిలంగా ఉండాలన్న ఉద్దేశంతో మన పండుగలు, వివిధ ఆధ్యాత్మిక సందర్భాలను ఆన్‌లైన్‌ వేదికగా గుర్తు చేసుకుంటాం. శ్రావణమాసం రాగానే వాయినాలు ఇచ్చుకునే సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ తాంబూలం పేరిట మొత్తం 5 మంగళవారాలు, 5 శుక్రవారాలు ప్రపంచవ్యాప్తంగా 50 మంది తల్లులకు తాంబూలం పేరిట చిన్న మొత్తాలను అందించాం. 2020 సెప్టెంబర్‌ 4న మొదటి వార్షికోత్సవం సందర్భంగా గ్రూప్‌లోని అమ్మల్లో ఒకరికి తెలియకుండా మరొకరికి వారిపేరు మీద రూ.250 విలువైన గిఫ్ట్‌లు పంపించాం. దీనిపై చాలామంది ఆనందం వ్యక్తం చేశారు. – ప్రదీప్తి విస్సంశెట్టి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అమ్మల వేదిక అనుభవాల కలయిక
అమ్మల వేదిక అనుభవాల కలయిక
అమ్మల వేదిక అనుభవాల కలయిక

ట్రెండింగ్‌

Advertisement