e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home హైదరాబాద్‌ గ్రేటర్‌లో టెలీ మెడిసిన్‌కు పెరిగిన డిమాండ్‌

గ్రేటర్‌లో టెలీ మెడిసిన్‌కు పెరిగిన డిమాండ్‌

గ్రేటర్‌లో టెలీ మెడిసిన్‌కు పెరిగిన డిమాండ్‌
  • కరోనా ప్రభావంతో తగ్గిన కన్సల్టేషన్లు
  • వీడియో కాల్‌లో డాక్టర్‌తో సంప్రదింపులు
  • ఆన్‌లైన్‌లోనే ప్రిస్క్రిప్షన్‌ జారీ
  • ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో తగ్గిన ఓపీ సేవలు
  • కొనసాగుతున్న అత్యవసర శస్త్రచికిత్సలు

సిటీబ్యూరో, జూన్‌ 3 (నమస్తే తెలంగాణ) : హలో డాక్టర్‌ సార్‌.. నాకు జ్వరం ఉంది. ఒళ్లంతా నొప్పులు. చాలా నీరసంగా ఉంది. ఏం చేస్తే తగ్గుతుందో చెప్పండి అంటూ వీడియో కాల్‌. బాధితుడి పరిస్థితి అంచనా వేసిన డాక్టర్‌ వెంటనే ఆన్‌లైన్‌లో ప్రిస్కిప్షన్‌ ఇస్తున్నారు. కరోనా వేళ ఈ రకం సేవలు గ్రేటర్‌ వ్యాప్తంగా విస్తృతంగా సాగుతున్నాయి. మహమ్మారి నేపథ్యంలో చాలామంది డాక్టర్లు క్లినిక్‌లలో కన్సల్టేషన్లను తగ్గించారు. టెలీ మెడిసిన్‌ పేరుతో వీడియోకాల్‌లో మాట్లాడుతూ బాధితులు కోలుకునేలా చేస్తున్నారు. దీనికితోడు అన్ని రకాల ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ అవుట్‌ పేషెంట్‌ (ఓపీ) సంఖ్య భారీగా తగ్గింది. కేవలం అత్యవసర శస్త్రచికిత్సలు మాత్రమే నిర్వహిస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఆయా దవాఖానల్లో ఓపీ, ఐపీ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు వైద్యులు చెబుతున్నారు. సాధారణ సమయాల్లో చిన్నపాటి అనారోగ్య సమస్య వచ్చినా వెంటనే దవాఖానకు ఉరికేవారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. దవాఖానకు వెళితే ఎక్కడ వైరస్‌ అంటుకుంటుందోననే భయంతో అత్యవసరమైతే తప్ప దవాఖానల గడప తొక్కడంలేదు. లాక్‌డౌన్‌ కారణంగా కొన్ని రకాల అంటువ్యాధులు, ఇతర అనారోగ్య సమస్యలు తగ్గినట్లు వైద్యాధికారులు తెలిపారు. సామూహిక కార్యక్రమాలు, జాతర్లు, సభలు, సమావేశాలు, శుభకార్యాలు లేకపోవడం వల్ల స్వల్ప అనారోగ్య సమస్యలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయని అంటున్నారు. దోమలతో వచ్చే మలేరియా, డెంగీ కేసులు పెద్దగా నమోదు కావడం లేదని వివరిస్తున్నారు.

ఊరటనిస్తున్న బస్తీ దవాఖానలు

కరోనా సమయంలో బస్తీ దవాఖానలు పెద్ద ఎత్తున ఊరట కలిగిస్తున్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా దూర ప్రాంతాల్లో ఉన్న దవాఖానలకు వెళ్లే పరిస్థితులు లేవు. దీంతో జనం తమ ఇంటికి సమీపంలో ఉన్న బస్తీ దవాఖానలను ఆశ్రయిస్తున్నారు. ప్రతిరోజు 50నుంచి 100మంది వరకు రోగులు ఆయా బస్తీ దవాఖానల్లో ఓపీ సేవలు పొందుతున్నారు. ప్రైవేటు దవాఖానల్లో వైద్యులు నేరుగా కాకుండా ఎక్కువగా వీడియో కన్సల్టేషన్‌ ద్వారానే సేవలు అందిస్తుండడంతో ప్రైవేటుకు వెళ్లేవారు సైతం బస్తీ దవాఖానల బాట పడుతున్నారు. గ్రేటర్‌ వ్యాప్తంగా 260కి పైగా బస్తీదవాఖానలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి బస్తీ దవాఖానలో 54 రకాల వైద్యపరీక్షలు నిర్వహించడంతో పాటు అన్నిరకాల మందులు అందజేస్తున్నారు. కొన్ని బస్తీ దవాఖానల్లో కరోనా పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. అత్యవసర కేసులను గుర్తించి ఉస్మానియా వంటి పెద్ద దవాఖానలకు రిఫర్‌ చేస్తున్నారు.

టెలీ మెడిసిన్‌కు పెరిగిన డిమాండ్‌

గతేడాది కరోనా, లాక్‌డౌన్‌ ప్రారంభం నుంచి కార్పొరేట్‌తోపాటు బస్తీ దవాఖాన స్థాయి నుంచి ప్రభుత్వ దవాఖానల్లో కూడా టెలీ మెడిసిన్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. కరోనా భయంతో బయటకు వెళ్లలేని రోగులు చాలామంది టెలీ మెడిసిన్‌నే నమ్ముకుంటున్నారు. వీడియో కన్సల్టెన్సీ ద్వారా వైద్యులను సంప్రదిస్తూ తమ ఆరోగ్య సమస్యలను డాక్టర్లకు వివరిస్తున్నారు. ఈ మేరకు వైద్యులు ఆన్‌లైన్‌ ద్వారానే ప్రిస్క్రిప్షన్‌ను జారీ చేయడంతో వారు సూచించిన మందులను తెప్పించుకుంటున్నారు. ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్‌, ఎంఆర్‌ఐ వంటి టెస్టుల మినహా పలు రకాల రక్త పరీక్షలు, బీపీ, షుగర్‌ వంటి పరీక్షలను సైతం ఇంటివద్దకే వచ్చి నిర్వహిస్తుండడంతో వైద్య పరీక్షలకు సైతం రోగులు బయటకు రావడం లేదు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే దవాఖానలకు వెళ్తున్నట్లు పలువురు చెబుతున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
గ్రేటర్‌లో టెలీ మెడిసిన్‌కు పెరిగిన డిమాండ్‌

ట్రెండింగ్‌

Advertisement