e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, May 6, 2021
Advertisement
Home హైదరాబాద్‌ భాగ్యనగరానికి మహా జీవధార

భాగ్యనగరానికి మహా జీవధార

భాగ్యనగరానికి మహా జీవధార
 • కృష్ణాజలాల సరఫరాలో శాశ్వత పరిష్కారంగా 
 • సుంకిశాల ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్‌
 • 1450 కోట్ల అంచనా వ్యయానికి తాజా బడ్జెట్‌లో 725 కోట్ల కేటాయింపు
 • రెండు జీవ నదులతో నగర తాగునీటి వ్యవస్థ అనుసంధానం
 • ఇప్పటికే కేశవాపూర్‌లో భారీ ఎత్తున గోదావరి జలాల నిల్వకు పనులు మొదలు
 • వరుస కరువు సంవత్సరాల్లోనూ తాగునీటికి ఢోకా లేకుండా చర్యలు

హుస్సేన్‌సాగర్‌ను కాలుష్యకాసారంగా మార్చారు… దశాబ్దాలుగా గొంతు తడిపిన మూసీని కబ్జాలతో మూసేశారు… బీడు భూములకు మళ్లాల్సిన మంజీరా జలాల్ని నగర తాగునీటికి పరిమితం చేసి చేతులు దులుపుకొన్నా రు… అయినా హైదరాబాద్‌ మహా నగర దాహర్తి తీరకపోవడంతో ఏ పూటకు ఆ పూట ప్రతిపాదనలతో మూడు దశల్లో వందల కిలోమీటర్ల నుంచి కృష్ణాజలాల్ని తరలించారు. అవీ చాలకపోవడంతో బేసిన్‌ అవతల ఉన్న గోదావరిజలాల వైపు పరుగులు పెట్టారు. ఇదీ… విశ్వ నగరమైన హైదరాబాద్‌ తాగునీటి వ్యవస్థపై నిన్నటిదాకా పాలకుల ముందుచూపులేని ప్రణాళిక. అందుకే వేసవి వచ్చిందంటే చాలు… ఖైరతాబాద్‌ జలమండలి కార్యాలయం ఎదుట ఖాళీ బిందెల ప్రదర్శన. అంతేకాదు… రైల్వే వ్యాగన్లలోనూ విజయవాడ నుంచి హైదరాబాద్‌ నగరానికి తాగునీటిని తరలించిన చేదు జ్ఞాపకాలు సైతం ఉన్నాయి. మరి… తెలంగాణ వచ్చిన తర్వాత నిండు ఎండాకాలం కూడా నగరవాసి దాహర్తికి అల్లాడిన దాఖలాలు లేవు. అయినా… హైదరాబాద్‌ విస్తరిస్తున్న విశ్వ నగరం. అందుకే సీఎం కేసీఆర్‌ ఆది నుంచి చెబుతున్నట్లుగానే విశ్వనగరానికి రెండు జీవ నదులతో జీవధారల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. నగర శివారులో భారీ ఎత్తున గోదావరి జలా ల నిల్వ కోసం ఇప్పటికే కేశవాపూర్‌ రిజర్వాయర్‌ నిర్మాణ పనులకు వేగంగా చర్యలు తీసుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం… కృష్ణాజలాలపైనా శాశ్వత పరిష్కారానికి నాంది పలికింది. వర్షాభావంతో కరువు పరిస్థితులు ఏర్పడినా తాగునీటికి ఢోకా ఉండకుండా శాశ్వత పరిష్కారమైన సుంకిశాల ప్రాజెక్టుకు రాష్ట్ర సర్కారు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దాదాపు రెండు దశాబ్దాల కిందట రూపుదిద్దుకొని అటకెక్కిన ఈ ప్రాజెక్టుకు తాజా బడ్జెట్‌లో ఏకంగా 725 కోట్లు కేటాయించింది. 

ఎందుకీ సుంకిశాల?

మాధవరెడ్డి ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోయాలంటే నాగార్జుసాగర్‌ ప్రాజెక్టులో 510 అడుగులు, ఆపై నీటిమట్టం ఉంటేనే సాధ్యమవుతుంది. పైగా ఇది సాగునీటి ప్రాజెక్టు. అందుకే ఇలా కాకుండా హైదరాబాద్‌కు ప్రత్యేకంగా శాశ్వత పరిష్కారం కోసం రెండు దశాబ్దాల కిందటే సుంకిశాల ప్రాజెక్టు ప్రతిపాదనను రూపొందించారు. కానీ గత పాలకులు తాత్కాలిక ఆలోచనలతో పబ్బం గడిపారే తప్ప ప్రజల సమస్యల పరిష్కారానికి దూరదృష్టిని (విజన్‌) ప్రదర్శించలేదు. సుంకిశాల ప్రాజెక్టును చేపట్టడం ద్వారా నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులో 462 అడుగుల మేర (డెడ్‌స్టోరేజీ స్థాయి) నీటిమట్టం ఉన్నా హైదరాబాద్‌ తాగునీటి కోసం ముడి నీటిని సేకరించి, శుద్ధి చేసి నగరానికి అందించవచ్చు. ఈ స్థాయిలో సాగర్‌లో 132 టీఎంసీల నీటి పరిమాణం ఉంటుంది. 

రెండు జీవ నదులతో అనుసంధానం

తెలంగాణ ఉద్యమం నుంచి నగర తాగునీటిపై సీఎం కేసీఆర్‌ ఓ విజన్‌ను స్పష్టం చేస్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రోజుకు 172 మిలియన్‌ గ్యాలన్ల గోదావరిజలాల తరలింపు ప్రాజెక్టు పూర్తయింది. కానీ సీఎం కేసీఆర్‌ అంతటితో ఆగకుండా రానున్న ఐదారు దశాబ్దాల్లో నగర తాగునీటికి ఢోకా లేకుండా ఉండటంతో పాటు వర్షాభావ పరిస్థితుల్లోనూ దాహర్తికి ప్రజలు అల్లాడకుండా ముందుచూపు ప్రదర్శించారు. అందులో భాగంగానే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నుంచి నగర శివారుకు గోదావరిజలాల్ని తరలించి భారీ ఎత్తున నిల్వ చేసేందుకు కేశవాపూర్‌ రిజర్వాయర్‌ నిర్మాణాన్ని చేపట్టింది. ఈ పనులు ఇప్పటికే వేగంగా కొనసాగుతున్నాయి. అదేవిధంగా కృష్ణాజలాలపరంగానూ శాశ్వత పరిష్కారం కోసం తాజాగా సుంకిశాల ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 

నగరానికి కృష్ణాజలాల సరఫరా తీరిది

గ్రేటర్‌ హైదరాబాద్‌ తాగునీటి సరఫరాకు నాగార్జునసాగర్‌ జలాశయం నుంచి రోజుకు 270 మిలియన్‌ గ్యాలన్లు అంటే ఏడాదికి 16.5 టీఎంసీల జలాల్ని తరలిస్తున్నారు. ఇందుకోసం మూడు దశల్లో మూడు భారీ పైపులైన్ల నిర్మాణం చేపట్టారు. అయితే నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలంలో సాగునీటి కోసం నిర్మించిన ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎమ్మార్పీ)లో భాగంగా నాగార్జునసాగర్‌ ఫోర్‌షోర్‌ నుంచి (పుట్టంగండి టు ఏకేబీఆర్‌) అక్కంపల్లి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌కు నీటిని ఎత్తిపోసి… ఆయకట్టుకు నీరందించే కాల్వ నుంచి జలాల్ని మళ్లిస్తున్నారు. కోదండాపూర్‌ వద్ద నిర్మించిన నీటి శుద్ధి కేంద్రానికి ఆ ముడి నీటిని తరలించి అక్కడ శుద్ధి చేసి… ఆతర్వాత మరో మూడు దశల్లో నీటిని శుద్ధి చేసి నగరంలోని గృహాలకు సరఫరా చేస్తున్నారు. 

మూసీ సుందరీకరణకు రూ. 200కోట్లు

తెలంగాణ ప్రభుత్వం మూసీ నది సుందరీకరణను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. అందుకోసం ఈసారి బడ్జెట్‌లో 200 కోట్లు కేటాయించింది. దీంతో మరింత వేగంగా మూసీ సుందరీకరణ జరుగనున్నది. హైదరాబాద్‌ మహానగరం మీదుగా ఉన్న మూసీ నదిని సుమారు 53 కి.మీ మేర అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం మూడేండ్ల క్రితం మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఎంఆర్‌డీసీఎల్‌)ను ఏర్పాటు చేసింది. కాగా గతేడాది మాత్రం 20 కోట్లు వెచ్చించింది. తాజాగా బడ్జెట్‌లో కేటాయించిన 200 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడంతోపాటు డీపీఆర్‌ను కూడా ఈ ఏడాదే  రూపొందించనున్నారు. వచ్చే బడ్జెట్‌లో మాత్రం పెద్ద  మొత్తంలో బడ్జెట్‌ కేటాయించాల్సి ఉంటుంది.

డీపీఆర్‌ వచ్చిన తర్వాత పెద్ద మొత్తంలో నిధుల అవసరం

బడ్జెట్‌లో మూసీ నది సుందరీకరణ కోసం 200 కోట్లు కేటాయించిన సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. మూసీ సుందరీకరణకు సంబంధించి డీపీఆర్‌ (సమగ్ర ప్రాజెక్టు నివేదికను)ను రూపొందించాల్సి ఉంది. ఈ ఏడాది చివరి నాటికి డీపీఆర్‌ వస్తే మొత్తం ఎంత బడ్జెట్‌ అవసరమో కచ్చితంగా తెలుస్తుంది. అప్పటి వరకు ప్రస్తుతం కేటాయించిన 200 కోట్లతో మూసీ పరిరక్షణతోపాటు  సర్వే, బఫర్‌ జోన్‌ల మార్కింగ్‌, ల్యాండ్‌ స్కేపింగ్‌, డీపీఆర్‌ కోసం కన్సల్టెంట్‌ నియామకం వంటి పనులు చేపడతాం. – డి.సుధీర్‌ రెడ్డి, ఎంఆర్‌డీసీఎల్‌ చైర్మన్‌, ఎమ్మెల్యే 

ప్రాజెక్టు స్వరూపమిది…

 • సాగునీటి ప్రాజెక్టు అయిన ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టుతో సంబంధం లేకుండా సుంకిశాల దగ్గర సాగర్‌ జలాశయం ఫోర్‌షోర్‌ ద్వారా ముడి నీటిని సేకరిస్తారు. 
 • ఇక్కడ నాగార్జునసాగర్‌ జలాశయ నీటిమట్టం 462 అడుగుల స్థాయిలో ఉంటుంది. నీటి నిల్వ 132 టీఎంసీలు ఉంటుంది. 
 • సుంకిశాల దగ్గర జలాశయంలో ఇన్‌టేక్‌ పాయింట్‌ ఏర్పాటు చేసి… అక్కడ పంపుహౌస్‌ను నిర్మిస్తారు. 
 • ఈ పంపుహౌస్‌లో 1.2 మెగావాట్ల సామర్థ్యంతో 18 పంపులను ఏర్పాటు చేస్తారు. ఒక్కో పంప్‌ డిశ్చార్జి సామర్థ్యం సుమారు 50 క్యూసెక్కుల వరకు ఉంటుంది.
 • అక్కడి నుంచి 17.2కిలోమీటర్ల మేర పైప్‌లైన్‌ నిర్మాణాన్ని చేపట్టి… పంపుల ద్వారా ఎత్తిపోసిన నీటిని తరలిస్తారు. ఈ పైప్‌లైన్‌ డయా 2375 ఎంఎం అంటే 2.375 మీటర్లుగా ఉంటుంది.
 • నగరానికి మూడు దశల్లో ఏర్పాటు చేసిన మూడు పైపులైన్ల ద్వారా కృష్ణాజలాల్ని తరలిస్తున్నందున సుంకిశాల నుంచి కోదండాపూర్‌ వరకు కూడా మూడు వరుసల పైపులైన్‌ నిర్మాణాన్ని చేపడతారు. 
 • సుంకిశాల నుంచి కోదండాపూర్‌కు కృష్ణాజలాలను 104 మీటర్ల మేర ఎత్తిపోస్తారు. తద్వారా సాగర్‌ జలాశయం నుంచి తరలించిన ముడి నీటిని (రా వాటర్‌)ను తొలుత కోదండాపూర్‌, నసర్లపల్లి, గున్‌గల్‌, సాహెబ్‌నగర్‌ కేంద్రాల్లో శుద్ధి చేసి నగరానికి సరఫరా చేస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా వర్షాభావంతో కృష్ణా నదికి వరుసగా రెండు, మూడు సంవత్సరాలు వరద రాకున్నా డెడ్‌స్టోరేజీ నుంచి హైదరాబాద్‌ తాగునీటి కోసం కృష్ణాజలాలను సేకరించే అద్భుత అవకాశం ఏర్పడుతుంది.

అంచనా వ్యయం  రూ. 1450 కోట్లు…

సుంకిశాల ప్రతిపాదనను రూ. 1450 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించారు. ఇందులో రూ. 1176 కోట్లు సివిల్‌ పనులకు కేటాయించగా… ఎలక్ట్రికల్‌ పనులకు రూ. 274 కోట్లు కేటాయించారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం గురువారం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుకు రూ. 725 కోట్లను కేటాయించింది. దీంతో సుంకిశాల ప్రతిపాదన శరవేగంగా పూర్తయి… కృష్ణాజలాల సరఫరాలోనూ విశ్వనగరం శాశ్వత పరిష్కారాన్ని సాధించినట్లవుతుంది. అయితే దేశంలోని ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై… ఇలా ఏ నగరాన్ని తీసుకున్నా తాగునీటి కొరతతోపాటు జనాభా పెరిగే కొద్దీ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. కానీ ఒక్క హైదరాబాద్‌ నగరానికి మాత్రమే రానున్న ఐదారు దశాబ్దాల్లోనూ ఎలాంటి ఢోకాలేని వ్యవస్థను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. 

Advertisement
భాగ్యనగరానికి మహా జీవధార

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement