మంగళవారం 19 జనవరి 2021
Hyderabad - Nov 28, 2020 , 09:54:22

శాంతి.. సుస్థిరతకే మా ఓటు

శాంతి.. సుస్థిరతకే మా ఓటు

‘చెరువులో బియ్యంపోసి.. తూముకింద మంటపెడితే అన్నం ఉడుకుతుందా. పనిచేసే ప్రభుత్వాన్ని కాదని ప్రతి పక్షానికి ఓటేలా వేయగలం. అందుకే మేమంతా సమిష్టి నిర్ణయం తీసుకున్నాం. మా ఓటు శాంతికి.. సుస్థిరతకే’

‘హాస్టళ్లల్లో ఉండేవాళ్లంతా మా అతిథులు. 29 రాష్ర్టాలు, పలు దేశాలకు చెందిన ఉద్యోగుల కడుపునింపుతున్నం. చెన్నై.. బెంగళూరు, ముంబైలతో పొల్చితే రోజుకు 200లు తీసుకుంటూ టిఫిన్‌, మధ్యాహ్నాం భోజనం, స్నాక్స్‌, రాత్రిభోజనాన్ని సమకూరుస్తున్నం. టీవీ, ఉచిత వైఫై సౌకర్యాలిస్తున్నం. రేపు అమెజాన్‌, గూగుల్‌, ఫేస్‌బుక్‌లు వస్తే ఐటీ ఉద్యోగులు డబుల్‌ అవుతారు. హాస్టళ్లు డబుల్‌ అయితే మాకే ఉపాధి దొరుకుతుంది. తెలంగాణ ప్రగతితోనే మా ప్రగతి ముడిపడి ఉంది. అందుకే మా ఓటు ప్రగతిశీల ప్రభుత్వానికే’

హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మద్ధతు ప్రకటించారు ఐటీ కారిడార్‌ హాస్టల్స్‌ అసో సియేన్‌ ప్రతినిధులు. అంతే కాకుండా కొండాపూర్‌, మాదా పూర్‌, గచ్చిబౌలి డివిజన్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపునకు కృషిచేస్తామని బహిరంగంగా ప్రకటించారు. అసోసియేషన్‌ సమావేశాన్ని శుక్రవారం మాదాపూర్‌లోని బుట్టా కన్వెన్సన్‌ సెంటర్లో  నిర్వహించారు. చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి, రైతు బంధు సమన్వయ సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డా. పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

 ఈ సందర్భంగా అసొసియేషన్‌ మద్ధతు లేఖను వారికందజేశారు. ఐటీ కారిడార్‌లో 3,600 పైచిలుకు హాస్టళ్లు ఉన్నాయని, 80వేల మంది వర్కర్లు తమ వద్ద పనిచేస్తున్నారని, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకే మద్ధతునిస్తున్నామని ప్రకటించారు. తమ సమస్యల పరిష్కా రానికి కృషిచేయడమే కాకుండా, మూముళ్ల ముప్పును తొలగిం చిన టీఆర్‌ఎస్‌ పార్టీకే మద్ధతునిస్తున్నట్లు నేతలు ప్రకటించారు. అంతే కాకుండా 20వేల లీటర్ల ఉచిత మంచినీటి హామీతో అత్య ధికంగా తమకే లబ్దిచేకూరు తుందన్నారు. ఈ సందర్భంగా కరెంట్‌, నల్లా కనెక్షన్లను సెమి కమర్షియల్‌ కోటాలోకి మార్చా లని, ఆస్తిపన్ను నుంచి మినహాయించాలని నేతలు కోరారు.

కేసీఆర్‌, కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్తాం

శేరిలింగంపల్లి హస్టల్స్‌ నిర్వాహకులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ల దృష్టికి తీసుకువెళ్తామని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు.  ఎంపీ గడ్డ రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ హస్టల్స్‌ యాజమానుల మద్దతు గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఎంతో అవసరమని, హస్టల్స్‌ అసోసియేషన్‌ సభ్యులందరు టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటును వేసి శేరిలింగంపల్లిలోని అన్ని డివిజన్‌ల అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలన్నారు.  

ఉచిత నీళ్లతో ఉపశమనం 

మేము నడిపే హాస్టళ్లల్లో రోజుకు 3-4వేల లీటర్ల నీళ్లు వాడుతుండటంతో నెల కు లక్షలు లక్షలు బిల్లులు చెల్లిస్తున్నాం. కేసీఆర్‌ నెలకు 20,000 లీటర్ల వరకు ఉచితంగా నీళ్లిస్తామన్నారు. ఈ పథకంతో అత్యధికంగా లాభం పొందేది మేమే. మా ఎమ్మెల్యే అరికపూడి గాంధీ  సైతం మాకు చాలా సహకరించారు. కరో నా సమయంలో భవన యజమానులతో అద్దెల సమస్య తలెత్తినప్పుడు సామరస్యంగా పరిష్కరించారు.కష్టకాలంలో ఉన్నప్పుడు మంత్రి శ్రీనివాస్‌యాదవ్‌, స్థానిక కార్పొరేటర్లు మాకు అండగా ఉన్నారు.- పాశం అమర్‌నాథ్‌రెడ్డి, అసోసియేషన్‌ అధ్యక్షుడు

మామూళ్ల ముప్పు తొలగింది 

గతంలో గెలిచిన పాత కార్పొరేటర్లు నెలనెలా మామూళ్లు వసూలు చేసేవారు. అది చాలదన్నట్లు ఆ పేరు.. ఈ పేరు చెప్పి చందాలు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడేవాళ్లు. తెలంగాణ వచ్చాక టీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన కార్పొరేటర్లు ఒక్కరు కూడా మా వద్దకు వచ్చి మామూళ్లని, చందాలు ఇవ్వాలని అడగలేదు. పైగా మేము ఎదుర్కొంటున్న డ్రైనేజీ, నల్లా, విద్యుత్‌ సంబంధ సమస్యలను తీర్చేందుకు ప్రయత్నించారు.  అందుకే మా మద్ధతు గులాబీ పార్టీకే. - టి.కరుణాకర్‌, అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి