బుధవారం 02 డిసెంబర్ 2020
Hyderabad - Oct 30, 2020 , 07:19:23

దేశానికే ఆదర్శంగా తెలంగాణ పోలీస్‌

దేశానికే ఆదర్శంగా తెలంగాణ పోలీస్‌

 • శాంతి భద్రతలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
 • ఇండియన్‌ పోలీస్‌ వర్చువల్‌ సమ్మిట్‌లో సీపీ అంజనీకుమార్‌ 
 • సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : తెలంగాణ రాష్ట్రం వయస్సు చిన్నదే అయినా శాంతి భద్రతలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ అన్నారు. శుక్రవారం ఇండియన్‌ పోలీస్‌ వర్చువల్‌ సమ్మిట్‌ అవార్డు కార్యక్రమాన్ని గుజరాత్‌లోని రాష్ట్రీయ రక్ష యూనివర్సిటీతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనరేట్‌ నుంచి సీపీ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే పటిష్టమైన శాంతి భద్రతలపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. అందులో భాగంగానే అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగిస్తూ ప్రజల సహకారంతో సురక్షితమైన నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దినట్లు తెలిపారు. ఆరేండ్లలో సిటీ పోలీసులు చేపట్టిన వివిధ కార్యక్రమాలను ఇలా వివరించారు.
  • ప్రజలకు, పోలీసులకు వారధిగా తీసుకొచ్చిన హాక్‌ఐ మొబైల్‌ అప్లికేషన్‌ ఎంతో ఉపయోగకరంగా మారింది.
  • ప్రజలు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లకుండానే ఒక్క దరఖాస్తుతో 26 వస్తువులకు సంబంధించిన మిస్సింగ్‌ సర్టిఫికెట్లను లాస్ట్‌ రిపోర్ట్‌ యాప్‌ ద్వారా 72 గంటల్లో అందిస్తున్నారు. ఇప్పటివరకు 25 వేల మంది ఇలా సర్టిఫికెట్లు పొందారు.
  • సోషల్‌ మీడియా మేనేజ్‌మెంట్‌ యూనిట్‌ ద్వారా ఫేస్‌బుక్‌లో 25 వేలకు పైగా, వాట్సాప్‌ ద్వారా 38 వేలకు పైగా, ట్విట్టర్‌లో 20 వేలకుపై ఫిర్యాదులు స్వీకరించారు.
  • మీ సేవ సర్వీసెస్‌ ద్వారా 37 వేల దరఖాస్తులు రాగా, అందులో 31 వేలకుపైగా దరఖాస్తులను పరిష్కరించారు. 
  • జాబ్‌ కనెక్ట్‌ పేరుతో 36 ఉద్యోగ మేళాలు ఏర్పాటు చేసి దాదాపు 9 వేల మందికి ప్రైవేట్‌ సంస్థల సహకారంతో ఉద్యోగాలు ఇప్పించారు.
  • మహిళలకు రక్షణ కవచంగా ఉన్న షీ టీమ్స్‌కు 5 వేల పిర్యాదులు అందాయి. 2016లో ప్రారంభించిన భరోసా కేంద్రం ద్వారా ఆదపలో ఉన్న మహిళలు, పిల్లలకు వైద్య సాయం, న్యాయ సలహాలు, పునరావాసం కల్పిస్తున్నారు.
  • పోలీస్‌ అంతర్గత సేవల కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో టీఎస్‌ కాప్‌ మొబైల్‌ అప్లికేషన్‌ ఉపయోగిస్తున్నారు. 10 వేల మంది పోలీసు అధికారులు దాన్ని ఉపయోగిస్తూ ప్రజలకు సత్వర సేవలు అందిస్తున్నారు. డాటా ఎనలాటికల్‌, క్రైమ్‌ మ్యాపింగ్‌తో క్షేత్ర స్థాయిలోని కేసుల దర్యాప్తునకు కీలకమైన సమాచారం లభిస్తున్నది. నగరంలో 29,300 క్రైమ్స్‌కు సంబంధించిన అంశాలను మ్యాపింగ్‌ చేశారు.
  • కానిస్టేబుల్‌, పెట్రోలింగ్‌ సిబ్బంది ద్వారా 4.63 లక్షల ఈ- పిటీ కేసులు కేసులు నమోదు చేశారు.
  • విశ్రాంత అధికారుల సహకారంతో నగర పోలీస్‌ శాఖ ఇన్విస్టిగేషన్‌ సపోర్ట్‌ సెంటర్‌ను నిర్వహిస్తున్నది. ఇది క్షేత్రస్థాయి దర్యాప్తు అధికారులకు బ్యాక్‌ అప్‌లో పని చేస్తున్నది. ఇప్పటి వరకు 3 వేల మంది పోలీసు అధికారులు దీని ద్వారా కేసుల దర్యాప్తులో సలహాలు, సూచలను తీసుకున్నారు.
  • కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి హైదరాబాద్‌ ఎస్‌బీ విభాగం గుర్తింపు పొందింది. వెరీ ఫస్ట్‌ అప్లికేషన్‌ ద్వారా పాస్‌పోర్టు వెరిఫికేషన్‌ను మూడున్నర రోజుల్లో పూర్తి చేస్తున్నారు. 
  • అత్యాధునిక సౌకర్యాలతో రిసెప్షన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేశారు. ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో 12 మంది మహిళా కానిస్టేబుళ్లు ఉన్నారు.
  • థర్డ్‌ పార్టీ కాల్‌ సెంటర్‌ ద్వారా ప్రజలు, పోలీసుల మధ్య సంబంధాలను ఆరా తీస్తూ, క్షేత్రస్థాయిలో సిబ్బంది పని తీరును ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.
  • సిటీలో 3.4 లక్షల కమ్యూనిటీ సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి ప్రపంచంలోనే 16వ స్థానంలో ఉండడం విశేషం. 2021 చివరి నాటికి 5 లక్షల సీసీ కెమెరాల ఏర్పాటు లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. సీసీ కెమెరాలను రియల్‌ టైమ్‌లో చూసేందుకు 40 వ్యూయింగ్‌ సెంటర్లు ఉన్నాయి. పండుగలు, ర్యాలీల సమయంలో మౌంటెడ్‌ వెహికల్‌ కెమెరాలు ఉపయోగిస్తున్నారు.