గురువారం 09 జూలై 2020
Hyderabad - Jun 03, 2020 , 01:32:39

తెరుచుకున్న సంక్షేమ వసతిగృహాలు

తెరుచుకున్న సంక్షేమ వసతిగృహాలు

హైదరాబాద్  : లాక్‌డౌన్‌ నేపథ్యంలో మూతపడిన ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాలు తిరిగి సోమవారం ప్రారంభమయ్యాయి. ఈనెల 8నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు విద్యార్థుల కోసం ప్రత్యేకంగా వసతి గృహాలను తెరిపించారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పలు రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్యం, రక్షణకు ప్రాధాన్యతనివ్వడంతో పాటు, సజావుగా పరీక్షలు రాసేందుకు గాను జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గదికి ఇద్దరు చొప్పున మాత్రమే విద్యార్థులు ఉండేలా, మెస్‌లో భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇక సిబ్బందికి షిఫ్ట్‌ల వారీగా విధులు కేటాయించమే కాకుండా పరీక్షలు ముగిసే వరకు వసతిగృహ సిబ్బందికి సెలవులను రద్దు చేశారు.

ఏర్పాట్లు.. జాగ్రత్తలు.. 

 • కరోనా నివారణ చర్యల్లో భాగంగా జీహెచ్‌ఎంసీ అధికారులతో సమన్వయం చేసుకుని, వసతిగృహ పరిసరాల్లో సోడియం హైపోక్లోరైట్‌ను పిచికారీ     చేయించడం.
 • ప్రతీ వారం ఓవర్‌హెడ్‌ వాటర్‌ ట్యాంకులు, సంపుల్లో నిల్వ ఉంచిన నీటిని తొలిగించి బ్లీచింగ్‌పౌడర్‌తో శుభ్రం       చేయించడం.  
 • హాస్టల్‌ గదులు, రీడింగ్‌ రూము, వంటశాల, భోజనశాలల ఫ్లోర్‌ను యాంటిసెప్టిక్‌ లిక్విడ్స్‌తో శుభ్రం చేయించడం.
 • గదుల్లో ఇద్దరు విద్యార్థులను మాత్రమే అనుమతించడం, ఒక్కో గదికి రిజిస్టర్‌ను నిర్వహించి, విద్యార్థుల రాకపోకలను నమోదుచేయడం.
 • మెస్‌లో రద్దీ లేకుండా జాగ్రత్తపడటం. 
 • నిమ్మరసం, బత్తాయిజ్యూస్‌లను తయారు చేసి విద్యార్థులకు అందించడం.
 • ప్రతి విద్యార్థికి విధిగా ఆరోగ్య   పరీక్షలు నిర్వహించి, ఎవరైనా జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నట్లయితే రికార్డుల్లో నమోదుచేయడం. ఎవరికైనా కరోనా లక్షణాలుంటే తల్లిదండ్రులతో పాటు, ఉన్నతాధికారులకు, స్థానిక వైద్యసిబ్బందికి సమాచారమివ్వడం.
 •  వసతిగృహం ప్రవేశ ద్వారంతో పాటు, ప్రతి గది ముందు శానిటైజర్లను అందుబాటులో ఉంచడం.
 • విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ఏర్పాట్లు చేయడం.

విద్యార్థికి అందజేసేవి..

 • ఒక్కో విద్యార్థికి 5 ఫేస్‌మాస్క్‌లు.
 • నాలుగు స్నానం, నాలుగు బట్టల సబ్బులు.
 • పరీక్షకు హాజరయ్యే ఒక్కో విద్యార్థికి 500ఎంఎల్‌ సీల్డ్‌ వాటర్‌బాటిల్‌. 
 • ఒక్కో విద్యార్థికి 200 ఎంఎల్‌ శానిటైజర్‌.
 • ఒక్కో హాస్టల్‌కు 5నుంచి 25 లీటర్ల ఫినాయిల్‌.
 •   ఫ్లోర్‌ను శుభ్రంచేసేందుకు 05-20 లీటర్ల లైజాల్‌, డెటాయిల్‌
 • 15-25 కేజీల బ్లీచింగ్‌ ఫౌడర్‌.


logo