ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Hyderabad - Jan 28, 2021 , 06:09:48

ఫ్లాట్లన్నీ విక్రయించాక.. అదనపు అంతస్థు ఎలా నిర్మిస్తారు

ఫ్లాట్లన్నీ విక్రయించాక.. అదనపు అంతస్థు ఎలా నిర్మిస్తారు

  • ఓ అపార్టుమెంటు నిర్మాణ వివాదంలో హైకోర్టు వ్యాఖ్య
  • తుది తీర్పునకు లోబడి అనుమతులు ఉంటాయని స్పష్టం

హైదరాబాద్‌ ; ఒకసారి అనుమతి పొందిన అపార్ట్‌మెంట్‌లో అదనపు అంతస్థు నిర్మాణం కోసం మరోసారి అనుమతి పొంది చేపట్టిన నిర్మాణం భవిష్యత్తు తమ తుది తీర్పునకు లోబడి ఉంటుందని హైకోర్టు పేర్కొన్నది. హైదరాబాద్‌ హిమాయత్‌నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌ నిర్మాణానికి సంబంధించి 2017లో స్టిల్ట్‌, నాలుగు అంతస్థులకు అనుమతి పొంది నిర్మాణం చేపట్టారు. 2020లో బిల్డర్‌ ఐదో అంతస్థు నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ నుంచి అనుమతి తీసుకున్నాడు. తమకు తెలియకుండా ఐదో అంతస్థు నిర్మిస్తున్నారని అపార్ట్‌మెంట్‌ వాసి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. దీన్ని సింగిల్‌ జడ్జి కొట్టేయడంతో రిట్‌ అప్పీల్‌ దాఖలు చేశారు. దీనిపై బుధవారం చీఫ్‌ జస్టిస్‌ హిమాకోహ్లి, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.

తెలంగాణ అపార్ట్‌మెంట్స్‌ యాక్ట్‌ -1987 ప్రకారం ఒక్కసారి అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్స్‌ విక్రయించిన తర్వాత మరో అంతస్థుకు అనుమతి పొందే హక్కు నిర్మాణదారుడికి లేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదించారు. ఫ్లాట్స్‌ యజమానులందరి అంగీకారంతోనే అదనపు అంతస్థుకు అనుమతి పొందినట్లు నిర్మాణదారు తరఫు న్యాయవాది పేర్కొన్నారు. అంతర్గత పనులు మినహా నిర్మాణం పూర్తిచేసినట్లు ధర్మాసనానికి నివేదించారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. జీహెచ్‌ఎంసీ వైఖరిని తెలియజేయాలని ఆదేశించింది. తుది తీర్పునకు లోబడి అదనపు అంతస్థు నిర్మాణం భవిష్యత్తుపై ఆధారపడి ఉంటుందని స్పష్టంచేసింది. ఈ మేరకు విచారణను మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది. 

VIDEOS

logo