కలయో.. వైష్ణవ మాయో అంటారు కదా..! ఇప్పుడు ఉప్పెన సినిమా కలెక్షన్స్ చూసిన తర్వాత ఇదే అనిపిస్తుంది అందరికీ. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమైన ఈ సినిమా రూ. 50 కోట్ల షేర్ వసూలు చేసింది. కొత్త దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాతోనే కృతి శెట్టి హీరోయిన్ గా పరిచయమైంది. తొలిరోజు ఉప్పెన సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. వైష్ణవ్ తేజ్ బాగా చేశాడు.. కృతి శెట్టి అద్భుతంగా నటించింది.. విజయ్ సేతుపతి ఈ సినిమాను నడిపించాడు.. ఇలా ప్రతి ఒక్కరు ఎవరి అభిప్రాయం వాళ్లు చెప్పారు. కానీ సినిమా బాగుందా అంటే మాత్రం సమాధానం ఊహించిన విధంగా రాలేదు.
క్లైమాక్స్ మినహా సినిమా అంతా రొటీన్ గా ఉంది. రిలీజ్కు ముందు అందరూ చెప్పిన అంత గొప్పగా అయితే ఉప్పెన సినిమా లేదు అంటూ పెదవి విరిచారు విశ్లేషకులు. కానీ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాకు మరో రకంగా తీర్పు ఇచ్చారు. థియేటర్స్ ఓపెన్ చేసిన తర్వాత 100% ఆక్యుపెన్సీలో విడుదలైన తొలి భారీ సినిమా ఇదే. చాలా రోజుల నుంచి కరువులో ఉన్నారో ఏమో గాని ఉప్పెన సినిమా విడుదలై అవ్వగానే థియేటర్లకు పోటెత్తారు ఆడియన్స్. దాని ఫలితమే తొలి రోజు నుంచి ఉప్పెన లాంటి కలెక్షన్స్. తొలి రోజే 10 కోట్లకు పైగా షేర్ వసూలు చేసిన తొలి డెబ్యూ హీరోగా రికార్డులు తిరగరాశాడు వైష్ణవ్ తేజ్. రెండో రోజు నుంచి కూడా ఈ సినిమా దూకుడు ఏమాత్రం తగ్గలేదు. తొలి వారంలో ఏకంగా 70 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్టు దర్శక నిర్మాతలు అధికారికంగా పోస్టర్ విడుదల చేశారు. రెండో వారం కూడా దాదాపు 20 కోట్ల వరకు ఈ సినిమా వసూలు చేసింది. మూడో వారంలో కూడా చాలా చోట్ల ఉప్పెన చెప్పుకోదగ్గ వసూళ్లు తీసుకొస్తుంది.
విడుదలైన 17వ రోజు కూడా కోటి రూపాయలకు పైగా షేర్ వసూలు చేసింది ఈ సినిమా. నితిన్ లాంటి క్రేజీ హీరో నటించిన చెక్ సినిమాకు చెక్ పెడుతూ అద్భుతమైన వసూళ్లు సాధిస్తోంది ఉప్పెన. తాజాగా ఈ సినిమా రూ.50 కోట్ల క్లబ్ లో చేరింది. తొలి సినిమాతోనే 50 కోట్ల షేర్ అందుకోవడం అంటే చిన్న విషయం కాదు. నాని, సాయి ధరం తేజ్, రామ్, నాగచైతన్య ఇలా ఎంతో మంది యంగ్ హీరోలు ఇప్పటికి 50 కోట్ల షేర్ అందుకోలేకపోయారు. అలాంటిది తొలి సినిమాతోనే వైష్ణవ్ తేజ్ హాఫ్ సెంచరీ కొట్టాడు. దాంతో ఆయన తర్వాత సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. క్రిష్ దర్శకత్వంలో ఈయన రెండో సినిమా చేశాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సమ్మర్లో విడుదల కానుంది.