గురువారం 25 ఫిబ్రవరి 2021
Hyderabad - Jan 18, 2021 , 05:40:05

కాంట్రాక్టు అధ్యాపకులకు ప్రభుత్వం అండగా ఉంటుంది

కాంట్రాక్టు అధ్యాపకులకు ప్రభుత్వం అండగా ఉంటుంది

తెలుగుయూనివర్సిటీ : కాంట్రాక్టు అధ్యాపకులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర శాసన మండలి సభ్యుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. అబిడ్స్‌ తిలక్‌రోడ్డులోని తెలంగాణ సారస్వతీ పరిషత్తులో ఆదివారం నిర్వహించిన డిగ్రీ కళాశాలల కాంట్రాక్టు అధ్యాపకుల ఆత్మీయ సమ్మేళనంకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణ విషయంలో న్యాయబద్ధంగా వ్యవహరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఏండ్ల తరబడి కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న అధ్యాపకులను ఎట్టిపరిస్థితుల్లో సర్వీస్‌ నుంచి తొలగించే ప్రసక్తే లేదన్నారు. కాంట్రాక్టు వ్యవస్థ రద్దుతో పాటు పర్మినెంట్‌ చేసే విషయంలో ప్రభుత్వంతో చర్చించి తనవంతు ప్రయత్నాలు చేస్తానని భరోసానిచ్చారు. కాంట్రాక్టు అధ్యాపకుల విషయంలో సీఎం కేసీఆర్‌ సానుకూలంగా ఉన్నారని.., కొందరు సమస్యలు సృష్టిస్తూ అడ్డుకుంటున్నారని తెలిపారు. ఈ విషయంలో అధ్యాపకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీఎల్‌, వేతనాల పెంపుతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పటికే ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. డిగ్రీ కళాశాలల కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ ఏండ్ల తరబడి పనిచేసిన 22మంది డిగ్రీ కళాశాలల అధ్యాపకులను అకారణంగా తొలగించారని.. వారిని వెంటనే విధుల్లోకి తీసుకునేల కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇంటర్‌ కళాశాలల అధ్యాపకుల జేఏసీ చైర్మన్‌ మధుసూదన్‌రెడ్డి, డిగ్రీ కళాశాలల అధ్యాపకుల సంఘం నాయకులు రాజుగౌడ్‌, మహేశ్‌, కనకచంద్ర, అరుణ్‌కుమార్‌, నీలిమ తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo