బుధవారం 25 నవంబర్ 2020
Hyderabad - Oct 31, 2020 , 05:53:40

ఎలక్ట్రిక్‌ వాహనాలతో మేలెంతో..

ఎలక్ట్రిక్‌ వాహనాలతో మేలెంతో..

 • విద్యుత్‌ వాహనాల వాడకానికి సర్కారు ప్రోత్సాహం
 • ‘ఎలక్ట్రిక్‌ వెహికిల్‌, ఎనర్జీ స్టోరేజీ 2020-30 పాలసీ’ మార్గదర్శకాలు విడుదల
 • రిజిస్ట్రేషన్‌, రోడ్డు పన్ను నుంచి మినహాయింపులు 
 • ప్రతి 50 కిలోమీటర్లకు ఒక చార్జింగ్‌ స్టేషన్‌ 
 • అనేక రాయితీలతో నూతన విధానం 
 • పెరుగనున్న ఈవీల వినియోగం
 • ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ తయారీకి గమ్యస్థానంగా మారనున్న
 • తెలంగాణ ప్రభుత్వ పాలసీపై పారిశ్రామికవేత్తల హర్షం
ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్న కాలుష్య నివారణకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నది. శాశ్వతంగా కాలుష్య పీడను తరిమికొట్టడంతో పాటు పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ దుష్ఫలితాలను అంతం చేయడం.. అంతకు మించి ఎలక్ట్రిక్‌ వాహనాలతో ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణాన్ని అందించడమే పరమావధిగా త్రీడీ (డీ కార్బనైజేషన్‌, డిజిటైజేషన్‌, డిసెంట్రలైజేషన్‌) మంత్రాన్ని ప్రయోగించింది. ఇందులో భాగంగా తెలంగాణ ఎలక్ట్రిక్‌ వెహికల్‌- ఎనర్జీ స్టోరేజ్‌ 2020-30 పాలసీని రూపొందించింది. మంత్రి కేటీఆర్‌ ఆలోచనలతో రూపుదిద్దుకున్న ఈ పాలసీతో రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ జోరు కొనసాగనుంది. క్షేత్రస్థాయిలో ఈవీ కొనుగోళ్లు పెరగనున్నాయి. ఎంతో ముందుచూపుతో ప్రవేశపెట్టిన ఈ పాలసీపై అటు పెట్టుబడిదారులు, ఇటు వినియోగదారులు, మరోవైపు పారిశ్రామికవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

12 కిలోమీటర్ల మైలేజ్‌ ఇచ్చే ఒక పెట్రోల్‌ కారు ఏడాదిలో 12 వేల కిలోమీటర్లు తిరిగితే వెయ్యి లీటర్ల పెట్రోల్‌ అవసరమవుతుంది. లీటర్‌కు రూ.84 వేసుకుంటే ఏడాదికి రూ.84వేల ఖర్చవుతుంది. ఇదే కారు 8 ఏండ్ల పాటు తిప్పితే రూ.6.72 లక్షలను కేవలం పెట్రోల్‌ కోసమే వెచ్చించాలి.

 • అదే ఒక యూనిట్‌కు 6 రూపాయలు పెట్టి ఛార్జింగ్‌ చేయిస్తే ఒక యూనిట్‌తో 9 కిలోమీటర్లు తిరగొచ్చు. అంటే కిలోమీటర్‌కు రూ.0.659 మాత్రమే ఖర్చవుతుంది. ఏడాదికి 12 వేల కిలోమీటర్లు తిరిగితే కేవలం రూ.7,908 మాత్రమే ఖర్చవుతుంది. ఒక వాహనం 8 సంవత్సరాల పాటు తిప్పితే కేవలం రూ.63,264 మాత్రమే ఖర్చవుతుంది..
 • ఒక ఎలక్ట్రిక్‌ కారు 3వేల కిలోమీటర్లు తిరగాలంటే.. 333 యూనిట్ల విద్యుత్‌ అవసరమవుతుంది. యూనిట్‌కు రూ. 14 చొప్పున ఖర్చు చేస్తే.. మొత్తం రూ.4, 667 వ్యయం అవుతుంది. అంటే కిలోమీటర్‌కు రూ. 1.60 మాత్రమే ఖర్చు వస్తుంది. ఈ లెక్కన చూస్తే.. విద్యుత్‌ వాహనాలు ఎంత మేలు చేస్తున్నాయో తెలుస్తున్నది.
 • ఎలక్ట్రిక్‌ వాహనాలు.. సంక్షిప్తంగా ఈవీ. ప్రపంచమంతా ఇప్పుడు ఇదే జపం చేస్తున్నది. కాలుష్యాన్ని కుమ్మరిస్తున్న డీజిల్‌, పెట్రోల్‌ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ను ఎంచుకుంటున్నది. కాలుష్యరహిత, పర్యావరణహిత వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నది.  ఇదే కోవలో తెలంగాణ సర్కారు శుక్రవారం తెలంగాణ ఎలక్ట్రిక్‌ వాహన పాలసీని ప్రకటించింది. ఇందులో  భాగంగా పెద్ద ఎత్తున రాయితీలను సైతం ఇచ్చింది. మంత్రి కేటీఆర్‌ ఆలోచనలతో రూపుదిద్దుకున్న ఈ విధానంతో రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ వినియోగం రెట్టింపుకానున్నది. ఈవీ హబ్‌గా తెలంగాణ మారనున్నది.

రాష్ట్రాన్ని ఈవీ హబ్‌గా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం  నూతన పాలసీని తీసుకొచ్చింది.  ‘తెలంగాణ ఎలక్ట్రిక్‌ వెహికిల్‌-ఎనర్జీ స్టోరేజీ 2020-30 పాలసీని ప్రకటించింది. ప్రపంచ స్థాయి మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా పదేండ్ల పాటు ఈ విధానం పనిచేయనున్నది. ఈ పాలసీ అమలుతో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలువనున్నది. అటు పెట్టుబడిదారులకు, ఇటు వినియోగదారులకు ప్రోత్సాహకం అందించేలా పాలసీ ఉండటంపై కంపెనీలు, పారిశ్రామికవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  తెలంగాణను విద్యుత్‌ వాహనాలు, ఎనర్జీ స్టోరేజీ కేంద్రంగా మార్చేందుకు ఈ పాలసీ ఉపయోగపడనుందని అభిప్రాయపడుతున్నారు.  పెట్టుబడుల ఆకర్షణ, పరిశోధన, అభివృద్ధి, తయారీకి ప్రోత్సాహం అందించేందుకు సర్కారు అనేక రాయితీలు ప్రకటించింది. ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం పెంచడం, మ్యానుఫ్యాక్చరింగ్‌ కంపెనీలను ప్రోత్సహించేందుకు ఈ పాలసీ ఉతమివ్వనున్నది. కాగా, మహీంద్రా లిమిటెడ్‌, ఏఎన్‌ఐ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, జూమ్‌కార్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఆటోమెటివ్‌ మ్యాన్యుఫ్రాక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, వాసవీ వీల్స్‌ కంపెనీలు ఎలక్ట్రిక్‌ వాహనాలను తయారు చేస్తున్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్ట్రిక్‌ వాహన పాలసీతో మరిన్ని కొత్త ఈవీ వాహనాలు నగర రోడ్లపై పరుగులు పెట్టే అవకాశమున్నది.

గ్రేటర్‌లో 50 లక్షల వాహనాలు.. 

గ్రేటర్‌లో ప్రతి రోజూ 50 లక్షల వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. 1.25 లక్షల ఆటోలు ఉన్నాయి.   8 లక్షల మంది వీటిని వినియోగిస్తున్నారు. నగరంలో 1.20 లక్షల క్యాబ్‌ సర్వీసులు ఉన్నాయి. వాటిల్లో పది లక్షల మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఆర్టీసీ బస్సుల్లో 35 లక్షలకు పైగా జర్నీ చేస్తున్నారు. పెట్రోల్‌, డీజిల్‌ వినియోగం విపరీతంగా పెరిగింది. ఫలితంగా స్వచ్ఛమైన గాలి దొరకడం కష్టంగా మారింది. అనేక రకాల అనారోగ్య సమస్యలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. శ్వాసకోశ వ్యాధులతో వైద్యశాలల చుట్టూ తిరుగుతున్నారు. పెట్రోల్‌, డీజిల్‌ వాహనాల వల్ల వెలువడే కాలుష్యంతో దుష్ఫలితాలు సంభవిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎలక్ట్రిక్‌ వాహనాల పాలసీ తీసుకురావడం శుభపరిణామం అని వాహనదారులు అభిప్రాయపడుతున్నారు. 

పలు చోట్ల..

హైదరాబాద్‌లో ఫోర్టమ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ పలు చోట్ల పబ్లిక్‌ చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేసింది. వీటి  కోసం టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ అధికారులు సైతం చకచకా అనుమతులు మంజూరు చేశారు. గ్రేటర్‌లోని ప్రకాశ్‌నగర్‌, గోషామహల్‌, మదీనగూడ, హైదర్‌నగర్‌, కొంపల్లి, సికింద్రాబాద్‌, మూసాపేట, జూబ్లీహిల్స్‌, హబ్సిగూడ, బేగంపేటలో చార్జింగ్‌ పాయింట్లు ఉన్నాయి. 

మరో 158..

తెలంగాణలో ఇప్పటివరకు 5,431 ఎలక్ట్రిక్‌ వాహనాలు రిజిస్టర్‌ అయ్యాయి. అందులో 4,706 మోటార్‌ సైకిళ్లు, 491 క్యాబ్స్‌, 194 ఈ- రిక్షాలు, 40 ఎలక్ట్రిక్‌ బస్సులు ఉన్నాయి. వీటి కోసం ప్రత్యేకంగా చార్జింగ్‌ స్టేషన్లు నడుస్తున్నాయి. వీటికి విద్యుత్‌నందించేందుకు ప్రత్యేక టారిఫ్‌ను అమలు చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా మరో 158 స్టేషన్లు ఏర్పాటు కాబోతున్నాయి.

నూతన పాలసీ మార్గదర్శకాలు ఇవే..

 • తెలంగాణలో తయారైన ఎలక్ట్రిక్‌ వాహనాలు కొనుగోలు జరిగే తొలి 2 లక్షల ఎలక్ట్రిక్‌ ద్విచక్రవాహనాలకు అలాగే మొదటి 20 వేల ఆటోలకు, 5 వేల నాలుగు చక్రాల వాహనాలకు, 10 వేల తేలికపాటి రవాణా వాహనాలకు, 5 వేల కార్లకు, 500 ఎలక్ట్రిక్‌ బస్సులకు వంద శాతం రిజిస్ట్రేషన్‌, రోడ్డు ట్యాక్సీ నుంచి మినహాయింపు ఇచ్చారు. 
 • ట్రాక్టర్లకు రోడ్డు ట్యాక్స్‌, రిజిస్ట్రేషన్‌ రుసుము లేదు.
 • పారిశ్రామిక లాజిస్టిక్స్‌, రవాణా కేంద్రాల పరిధిలో రాత్రి పూట పార్కింగ్‌, చార్జింగ్‌ సదుపాయాలు కల్పించారు. 
 • ఆటోలకు అదనంగా ఫిట్‌మెంట్‌ రాయితీల కింద రూ.15 వేలకు మించకుండా 15 శాతం సబ్సిడీ ఉంటుంది. 
 • టౌన్‌షిప్‌ల్లో చార్జింగ్‌ కేంద్రాలు, ప్రతి 50 కిలోమీటర్లకు ఒకటి ఏర్పాటు.
 • నగర నలుమూలల నుంచి బస్సు, మెట్రోస్టేషన్లకు బ్యాటరీ ఆధారిత వాహనాలు. 
 • వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే విద్యుత్‌ వాహనాల కొనుగోలుకు స్వయం ఉపాధి పథకాల కింద ఆర్థిక సాయం. 
 • విద్యుత్‌ వాహనాలు, సంబంధిత పరికరాలు తయారు చేసే కంపెనీలకు ప్రోత్సాహకాలు, రూ..200 కోట్ల పెట్టుబడి, వెయ్యి మందికి ఉపాధి కల్పించే బడా కంపెనీలకు 20 శాతం పెట్టబడి రాయితీ.  ఏడేండ్ల పాటు ఏడాదికి రూ.5 కోట్ల చొప్పున ఎస్‌జీఎస్‌టీ రీఎంబర్స్‌మెంట్‌ ఉంటుంది. ఐదేండ్ల పాటు గరిష్ఠ  పరిమితి రూ.5 కోట్లు మించకుండా 25 శాతం విద్యుత్‌ రాయితీ, ఐదేండ్ల పాటు విద్యుత్‌ సుంకం, స్టాంప్‌ డ్యూటీపై వంద శాతం రాయితీ.
 • ప్రత్యేక మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్లు, ఈవీ తయారీ పారిశ్రామికవాడల్లో మౌలిక వసతులు కల్పిస్తారు. ప్రభుత్వ శాఖల ద్వారా ఈవీల కొనుగోలు, పరిశోధన, అభివృద్ధికి ప్రోత్సాహం అందిస్తారు. 


గ్రేటర్‌లో 158 చార్జింగ్‌ స్టేషన్లు  

ఎలక్ట్రిక్‌ వాహనాల మొబిలిటీని ప్రోత్సహించేందుకు టీఎస్‌ రెడ్‌కో నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరించనున్నది. కొత్తగా గ్రేటర్‌లో 158 చార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయబోతున్నాం. వీటి ఏర్పాటుతో నగరవాసులకు ఎక్కడంటే అక్కడ చార్జింగ్‌ చేసుకునే అవకాశం లభించనున్నది. విమానాశ్రయాలు, మెట్రోస్టేషన్‌, పార్కింగ్‌ స్థలాల్లో వీటిని నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటాం. -జానయ్య, వీసీ అండ్‌ ఎండీ టీఎస్‌రెడ్‌కో

ప్రభుత్వ పాలసీ భేష్‌

ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేస్తున్న పాలసీలు కంపెనీలకు, వినియోగదారులకు ఆమోదయోగ్యంగా ఉన్నాయి. కాలుష్యానికి కారణమవుతున్న పెట్రోల్‌, డీజిల్‌ వినియోగాన్ని తగ్గించేందుకు ఈవీ కంపెనీలకు ప్రోత్సాహం అందించడం మంచి పరిణామం. సరిపడా చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తే నగరవాసులు కచ్చితంగా ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ వైపునకు ఆసక్తి చూపిస్తారు. సులభ పద్ధతుల్లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తవుతుంది. అంతేకాదు వినియోగదారుడికి కావాల్సిన తరహాలో డిజైన్‌ చేసి ఈ వెహికిల్స్‌ అందుబాబులోకి తెచ్చాం. ప్రభుత్వ విధానం చాలా బాగుంది. - ఎ. దేవేందర్‌రెడ్డి, ఫౌండర్‌, ఈరైడ్‌ కంపెనీ 

రానున్న రోజుల్లో ఈవీ జోరు

మొన్నటి వరకు ఎలక్ట్రిక్‌ వాహనాలు కొంతమంది వరకే చేరాయి. పెద్దగా ప్రచారం, రాయితీలు లేకపోవడం వల్ల కొనుగోలు ఆశించినస్థాయిలో జరుగలేదు. ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీతో ఈవీల జోరు రెట్టింపవుతుంది. తెలంగాణలో ఎలక్ట్రిక్‌ వాహనాలు ఇక చక్కర్లు కొట్టనున్నాయి. ఈవీ తయారీ కంపెనీలకు పలు రాయితీలు ప్రకటించడం గొప్ప విషయం. పెద్ద ఎత్తున వాహనాల తయారీపై దృష్టి పెట్టబోతున్నాం. థ్యాంక్సు టూ తెలంగాణ గవర్నమెంట్‌. -ఎం. రాజ శ్రీవత్స, ఎండీ, శ్రీటెక్‌ ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌