ఆదివారం 29 నవంబర్ 2020
Hyderabad - Oct 20, 2020 , 06:17:10

కష్టకాలం.. వరద బాధితులకు సర్కారు భరోసా

కష్టకాలం..  వరద బాధితులకు సర్కారు భరోసా

వర్షం విరుచుకుపడి, వరద విపత్తులో చిక్కుకున్న నగర జీవికి సర్కారు ఆపన్న హస్తం అందిస్తున్నది. కష్టకాలంలో కొండంత అండగా నిలుస్తున్నది. ముంపు ప్రాంతాల్లోని ఇంటింటికీ కేసీఆర్‌ రిలీఫ్‌ కిట్లతో నిత్యావసరాలు, దుప్పట్లు పంపిణీ చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు నష్టపరిహారం కూడా ప్రకటించింది. మంగళవారం నుంచే పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించడంతో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ సర్కిళ ్లవారీగా 250 బృందాలను ఏర్పాటుచేశారు. స్థానిక కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులనూ అందులోభాగస్వాములను చేశారు. గతంలో ఏ సర్కారూ చేయని విధంగా భారీ సాయానికి సిద్ధ్దమైన తెలంగాణ ప్రభుత్వానికి బాధితులు కృతజతలు తెలుపుతున్నారు. సీఎం కేసీఆర్‌మేలు మరిచిపోలేం అంటున్నారు. 

రోడ్డునపడ్డ బతుకులకు ఊరట

రోజంతా ఆటో నడిపితేనే పూట గడుస్తది. నామీద ఆధారపడి భార్య, ఇద్దరు పిల్లలు, అమ్మ ఉన్నరు. మొన్న కురిసిన వానకి ఇంట్లోకి నడుం లోతు నీళ్లొచ్చినయి. బియ్యం, సరుకులన్నీ కొట్టుకుపోయినయి. మా బతుకులు రోడ్డున పడ్డట్టు అయింది. ఇలాంటి సమయంలో సీఎం కేసీఆర్‌ సార్‌ 10వేల రూపాయలు ఇచ్చి ఆదుకోవడం చాలా సంతోషం. ఆయన మేలు మర్చిపోం. - ఎస్‌కే సాజిద్‌ పాషా, బీఎస్‌ మక్తా

సిటీబ్యూరో: భాగ్యనగర వాసులకు అనుకోని కష్టమిది. అసాధారణ వర్షం..ఎందరికో నిల్వ నీడ లేకుండా చేసింది. ఈ విపత్కర పరిస్థితుల్లో బాధితులకు కొండంత అండగా ఉంటున్నది ప్రభుత్వం. వరద నీటి ప్రభావానికి గురైన ప్రజలను అన్ని విధాలా ఆదుకుంటున్నది. కేసీఆర్‌ రిలీఫ్‌ కిట్లతో రూ. 2800 విలువైన నిత్యావసర వస్తువులు, ఒక్కో కుటుంబానికి మూడేసి బ్లాంకెట్లను అందిస్తున్నది. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి.. నిర్వాసితులకు నిల్వనీడ కల్పించి.. ఆహారం, తాగునీరు అందిస్తూ.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నది. తాజాగా ప్రభావిత ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి రూ. 10 వేలు అందించాలని సర్కారు నిర్ణయించింది. నేటి నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానున్నది. నష్టపోయిన వారు ఎంతమంది ఉన్నా.. ఆదుకునేందుకు సిద్ధమైంది. అంతేకాదు వర్షాలు, వరద వల్ల పూర్తిగా ఇల్లు కూలిపోయిన వారికి రూ. లక్ష, పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లకు రూ. 50 వేలు చొప్పున పరిహారం అందించనున్నది. 

250 ప్రత్యేక బృందాలు 

జీహెచ్‌ఎంసీ పరిధిలో సుమారు 37వేల కుటుంబాలు ముంపునకు గురైనట్లు అధికారులు గుర్తించారు. బాధిత కుటుంబాలకు ఇప్పటికే బియ్యం, నిత్యావసర వస్తువులతో కూడిన సీఎం రిలీఫ్‌ కిట్లను అందిస్తున్నారు. తాజాగా ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంగళవారం నుంచే ఈ సాయం అందించాలని సీఎం కేసీఆర్‌ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో బల్దియా కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ సర్కిళ్ల వారీగా బృందాలను ఏర్పాటు చేశారు.  చార్మినార్‌, ఎల్బీనగర్‌, ఖైరతాబాద్‌, సికింద్రాబాద్‌ జోన్ల పరిధిలో ముంపు ఎక్కువగా జరుగడంతో ఈ ప్రాంతాల్లోనే అధికంగా బృందాలను ఏర్పాటు చేసిన కమిషనర్‌... వార్డుల వారీగా స్థానిక కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులను కూడా ఈ బృందాల్లో భాగస్వాములను చేశారు.  ఈ బృందాలు బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి జరిగిన నష్టం ఆధారంగా పరిహారాన్ని అందజేస్తాయి. మొత్తంగా బల్దియా, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల పరిధిలో పరిహారం పంపిణీకి  250 బృందాలు పనిచేయనున్నాయని అధికారులు తెలిపారు. కాగా, ఈ ఆపత్కాలంలో ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుండటంతో ముంపు ప్రభావిత ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. సర్కారుకు రుణపడి ఉంటామంటూ..సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెబుతున్నారు.

ప్రజలు ఇబ్బందులు పడకుండా.. 

భారీ వర్షాలతో నిర్వాసితులైన వారి కోసం తక్షణ సహాయం కింద రూ. 550కోట్లు విడుదల చేస్తూ సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం అభినందనీయం. గతంలో ఎన్నడూ లేని విధంగా కనీవినీ ఎరుగని రీతిలో వర్షం బీభత్సం సృష్టించింది. ఈ నేపథ్యంలో  ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. -కిశోర్‌ గౌడ్‌, టీఆర్‌ఎస్‌ నేత

సంతోషకరమైన విషయం.. 

వరదలతో పుట్టెడు దు:ఖంలో ఉన్న నగరవాసులకు ఆర్థిక సాయం చేసేందుకు  ప్రభుత్వం రూ. 550 కోట్లను తక్షణం విడుదల చేయడం సంతోషకరమైన విషయం. ఓ వైపు వరదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకుంటూనే మరో వైపు వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఇంటికి లబ్ధి చేకూరేలా నిధులను ప్రకటించడం అభినందనీయం. -ధనలక్ష్మి (కొండాపూర్‌)

కృతజ్ఞతలు  

మా కాలనీని వరదలు ముంచెత్తడంతో ఇండ్లన్నీ నీట మునిగాయి. కాలనీ వీధుల మీదుగా వరద పోటెత్తుతుండటంతో  సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతున్నది. వారం రోజులుగా వరద నీటిలో అవస్థలు పడుతున్న ముంపు ప్రాంత ప్రజలకు సీఎం కేసీఆర్‌ ఆర్థిక సాయం ప్రకటించడం ఆనందంగా ఉంది. బాధితులను ఆదుకుంటున్న కేసీఆర్‌కు కృతజ్ఞతలు. -తొండ వెంకటేశ్‌, రంగనాయకులగుట్ట (హయత్‌నగర్‌)

విపత్కర పరిస్థితుల్లో.. 

ఓ వైపు కరోనా మరో వైపు వరదలు నగర వాసులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న సమయంలో సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ఔదార్యాన్ని చాటుకున్నారు. ముంచెత్తుతున్న వరదలతో నగర వాసులు ఆర్థికంగా చితికిపోయారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం బాధితులకు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించడం సంతోషకరం. - మిరియాల రాఘవరావు (కొండాపూర్‌)

పేదలకు చేయూతచరిత్రలో ఎన్నడూ లేనంత స్థాయిలో భారీ వర్షాలు కురవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు చేయూతనిచ్చేందుకు రూ.550 కోట్ల సాయం ప్రకటించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. నాలుగురోజులుగా ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న సమయంలో అనేక ఇండ్లలోకి నీరు చేరడంతో బియ్యంతో పాటు సామాన్లు నీట మునిగి ఇబ్బందులు పడుతున్నామని బాధితులు చెప్పారు. ఈ నేపథ్యంలో ముంపు బాధితులకు రూ. 10వేల చొప్పున సాయం అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడంతో వారికి ఊరట కల్పించినట్లయింది. ఇండ్లు కూలిన వారికి రూ. లక్ష ఇవ్వడంతో పాటు పాక్షికంగా కూలిన వారికి రూ.50వేలు ఇవ్వడం వల్ల పేదలకు ఎంతో మేలు జరుగుతుంది. - మాగంటి గోపీనాథ్‌, ఎమ్మెల్యే

సదుపాయాలు కల్పిస్తున్నాం.

.సీఎం కేసీఆర్‌ ప్రకటించిన ఆర్థిక సాయంతో ముంపు ప్రాంతవాసులకు ఎంతో భరోసా ఏర్పడింది. నాలుగురోజులుగా ఇక్కట్లు ఎదుర్కొంటున్న వారికి సీఎం కేసీఆర్‌ తీపికబురు చెప్పారు. ఖైరతాబాద్‌ నియోజకవర్గంలోని ఎంఎస్‌ మక్తా, బీఎస్‌ మక్తా, రాజ్‌నగర్‌, బీజేఆర్‌నగర్‌, మారుతీనగర్‌ తదితర ప్రాంతాలు హుస్సేన్‌ సాగర్‌ సమీపంలో ఉండటంతో ఇటీవల వర్షానికి బాగా దెబ్బతిన్నాయి. చాలా ఇండ్లలోకి వరదనీరు చేరడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే బాధితులకు కావాల్సిన సదుపాయాలను కల్పిస్తున్నాం. మంత్రి కేటీఆర్‌ సూచనలతో రేషన్‌ సరఫరా చేశాం. తాజాగా సీఎం కేసీఆర్‌ బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నాం. -దానం నాగేందర్‌, ఎమ్మెల్యే

‘కేసీఆర్‌ది గొప్ప మనసు’ 

కంటోన్మెంట్‌:  గొప్ప మనసున్న ముఖ్యమంత్రిగా మరోసారి కేసీఆర్‌ నిరూపించుకున్నారని ఎమ్మెల్యే సాయన్న, మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. మర్రి రాజశేఖర్‌రెడ్డి బోయిన్‌పల్లిలోని తన నివాసంలో ఎమ్మెల్యే సాయన్నతో కలిసి విలేకర్ల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయన్న, మర్రి రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ  వరద ప్రభావానికి గురైన ప్రతి ఇంటికీ రూ.10 వేల సాయం అందించేందుకు మంగళవారం నుంచి అధికారులతో కలిసి పర్యటించనున్నట్లు  వెల్లడించారు. ముంపు బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.  కంటోన్మెంట్‌ ప్రాంతంలో ఇప్పటికే బోర్డు ఆధ్వర్యంలో దెబ్బతిన్న రహదారులకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు  తెలిపారు. మంగళవారం నుంచి మండల అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి నష్టపోయిన ప్రతి ఒక్కరినీ గుర్తించే పనిలో నిమగ్నమవుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో బోర్డు సభ్యులు జక్కుల మహేశ్వర్‌రెడ్డి, సదా కేశవరెడ్డి, నళినికిరణ్‌, పాండుయాదవ్‌, లోక్‌నాథం, మాజీ సభ్యులు ప్రభాకర్‌, శ్యామ్‌కుమార్‌, బోయిన్‌పల్లి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ టీఎన్‌ శ్రీనివాస్‌, మార్కెట్‌ డైరెక్టర్‌ దేవులపల్లి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

రుణపడి ఉంటాం.. 

భారీ వర్షాలతో నిల్వ నీడ లేక రోడ్డున పడ్డాం. వారం రోజులుగా వరదలతో ముమ్ముతిప్పలు పడుతున్నాం. వరద నీటిలో మునిగిన ఇంటిని వదల లేక బయటికి వెళ్లలేక నానా అవస్థలు పడుతున్నాం. ఆపదలో ఉన్న బాధితులను ఆదుకునేందుకు పరిహారం ప్రకటించి.. సీఎం కేసీఆర్‌ ఆపద్బాంధవుడిగా నిలిచారు. భారీ వర్షాలతో గూడు, కూడు, బట్ట లేక అవస్థలు పడుతున్న పేదలకు అండగా నిలిచిన సీఎం కేసీఆర్‌ సార్‌కు రుణపడి ఉంటాం. -మెగావత్‌ నరేందర్‌, అంబేద్కర్‌ నగర్‌ (హయత్‌నగర్‌)

కష్టాలు తెలిసిన వ్యక్తి.. 

భారీ వర్షాలకు అతలాకుతలమైన రోడ్ల మరమ్మతులకు, బాధితులకు సహాయం కోసం సర్కారు తక్షణ సహాయంగా రూ. 550 కోట్లు ప్రకటించడం అభినందనీయం. ముంపు ప్రాంతాల్లో అటు అధికారులు, మంత్రి కేటీఆర్‌ పర్యటించి సహాయక చర్యలు చేపట్టారు. నష్ట పోయిన ప్రతి ఇంటికీ రూ. 10 వేలు, కూలిన ఇండ్లకు లక్ష , పాక్షికంగా దెబ్బతిన్న గృహాలకు రూ. 50 వేలు ప్రకటించడం వల్ల బాధితులకు ఎంతో ఊరట కలిగింది. ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి సీఎం కావడం వల్ల ఇబ్బందులను తెలుసుకొని ఆదుకుంటున్నారు. - పాలకూర శ్రీకాంత్‌గౌడ్‌ (రామంతాపూర్‌)

అండగా నిలిచారు 

వరదల వల్ల  ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అండగా నిలిచారు. చిన్న చిన్న పనులు చేసుకుని జీవనం సాగించే బస్తీ వాసులకు ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించడం సంతోషం. 2000లో వరదలు వచ్చినప్పుడు ఎవ్వరూ పట్టించుకోలేదు. తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటున్నది.- రాజ్‌కుమార్‌, అరుధంతినగర్‌, (చిక్కడపల్లి).

చాలా ఇబ్బందులు పడ్డాం

భారీ వర్షానికి మా ఇంట్లో మొకాలు లోతు నీరు చేరింది. రాత్రంతా కరెంటు లేక ఇబ్బందులు పడ్డాం. బియ్యం, దుస్తులు నీటిలో తడిచిపోయాయి. తక్షణ సాయంగా అందించిన రేషన్‌ కిట్లు మాకెంతో ఆసరాగా నిలిచాయి. వరద బాధితులకు ఇంటికి రూ.10వేలు అందించడం మంచి ఆలోచన. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉంటాం. - కె. శ్రీవిద్య, బీజేఆర్‌నగర్‌(ఖైరతాబాద్‌)

నమ్మకం ఉంది.. 

వరదలో సైతం నడుచుకుంటూ మా బస్తీలకు మంత్రి కేటీఆర్‌ సార్‌ వచ్చారు. కష్టాలు విన్నారు. బాధలు చూశారు. మళ్లీ ఈ కష్టాలు రాకుండా చేస్తానని చెప్పారు.  ప్రేమ్‌నగర్‌ నాలా సమస్య పరిష్కరిస్తారనే నమ్మకం ఉన్నది. -నిర్మల, ప్రేమ్‌నగర్‌ (అంబర్‌పేట)

ఎంతో ఆసరా.. 

జూనియర్‌ ఆర్టిస్టుగా  పనిచేస్తూ  కుటుంబాన్ని పోషించుకుంటున్నా. నాకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌లు లేక ఇబ్బందులు పడ్డాం. ప్రభుత్వం నాడు అందించిన సాయంతో రోజులు నెట్టుకొచ్చాం. ఇప్పుడు వరదల వల్ల ఇంట్లో సామాన్లు కొట్టుకుపోయాయి. రేషన్‌ కిట్లు, బ్లాంకెట్లు ఇచ్చి ఆదుకున్న  ప్రభుత్వం ఇంటికి రూ.10వేలు ఇవ్వడం మా లాంటి వారికి చాలా ఆసరా అవుతుంది. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.- ఎస్‌ఏ అలీం, జూనియర్‌ ఆర్టిస్ట్‌, బీఎస్‌ మక్తా (ఖైరతాబాద్‌)

ఆనందంగా ఉంది..

వరదల వల్ల తీవ్రంగా సమస్యలు ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వం మమ్మల్ని ఆర్థికంగా ఆదుకునేందుకు ముందుకు రావడం ఆనందంగా ఉంది. కొన్ని నెలలుగా కరోనా వల్ల పనులు లేక ఇబ్బందులు పడుతూ వచ్చాం. ఇప్పుడు వరదల తో కష్టాలు వచ్చాయి. కరోనా సమయంలో ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు ఎంతో ఉపాయోగపడ్డాయి. - భాగ్యమ్మ ,చిక్కడపల్లి

గొప్ప ఊరట 

ప్రభుత్వ నిర్ణయం వరద బాధితులకు గొప్ప ఉరట ఇచ్చింది. వర్షాలతో అనేక విధాలుగా నష్టపోయిన మాకు సీఎం కేసీఆర్‌ అండగా నిలిచారు. వరదనీటి ప్రభావానికి గురైన ప్రతి ఇంటికి ఆర్థిక సహాయం అందించడం శుభపరిణామం. బాధితులకు తక్షణ సాయం అందించేందుకు నిధులను మంజూరు చేయడం హర్షణీయం. వరద నీటి తొలగింపు, ప్రాణనష్టం జరుగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం అభినందనీయం. -సంజీవ్‌, ఎస్పీనగర్‌(మల్కాజిగిరి)

నష్టపోయాం

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మా ఇల్లు నీట మునిగింది. చాలా సామాన్లు కొట్టుకుపోయాయి. ఆర్థికంగా నష్టపోయాం. తక్షణ సాయంగా ప్రభుత్వం అందించే రూ.10వేలు మా కష్టాలు తీరుస్తాయి. ఆపత్కాలంలోప్రజల సంక్షేమానికి ఆర్థికంగా చేయూతనందిస్తున్న  ప్రభుత్వానికి  రుణపడి ఉంటాం. 

- ఎండీ సలీం ఫారూఖి, బీఎస్‌ మక్తా(ఖైరతాబాద్‌)