శనివారం 04 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 13, 2020 , 07:29:40

ఉత్సాహంగా జేఎన్‌టీయూలో టెక్నికల్‌ ఫెస్ట్‌

ఉత్సాహంగా జేఎన్‌టీయూలో టెక్నికల్‌ ఫెస్ట్‌

హైదరాబాద్ : ప్రతిభ.. మేధస్సు..ఇవే 21వ శతాబ్దాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్న అంశాలు. ప్రతిభ ఉన్నవారి ముందు యావత్తు ప్రపంచం మోకరిల్లుతున్నది. నలుదిక్కులా ఎటూచూసినా..వింతలు..విశేషాలు. విభిన్నమైన వ్యక్తుల కలబోతే. నలుగురితో నేను నడిస్తే ఏం లాభమని.. సృజనతో తమ మేధస్సుకు పదునుపెట్టి ఆద్భుతమైన ఆవిష్కరణకు అంకురార్పణ చేస్తున్నారు. ఎన్నో ఆపరిష్కృత సమస్యలకు పరిష్కారాలు చూపుతున్నారు. ఇలాం టి కొన్ని ఆవిష్కరణలను జవహర్‌లాల్‌నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం(జేఎన్‌టీయూ)లో నిర్వహించిన టెక్నికల్‌ ఫెస్ట్‌లో విద్యార్థులు ప్రదర్శించారు. 


రోకర్‌ బోగి..

దేశ ప్రతిష్టతను ఇనుమడింపజేసే చంద్రయాన్‌ ప్రయోగం విజయవంతంకావాలని మనమంతా కోరుకున్నాం. కానీ ప్రజ్ఞా రోవర్‌ ల్యాండింగ్‌లో సమస్యలతో ప్రయోగం విఫలమయ్యింది. దీని నుంచి పాఠాలు నేర్చుకున్న మన విద్యార్థులు ఈ రోవర్‌ను మించిన రోకర్‌బోగి అనే రోవర్‌ను తయారుచేశారు కౌషల్‌, భార్గవ్‌ అనే విద్యార్థులు ప్రజ్ఞ రోవర్‌ ముందుకు..వెనక్కి  మాత్రమే వెళ్లగలదు. ఎత్తు పల్లా ల్లో.. ఎగుడు, దిగుడుకారణంగా చిత్రాలు స్పష్టంగా కనపడవు. కానీ రోకర్‌బోగి మాత్రం వెనక్కి ముందుకే కాకుం డా.. పక్కలకు సైతం వెళ్లగలదు. అంతేకాదు. ఎత్తుపల్లాల్లో.. ఎగుడుదిగుడు నేలల్లో ప్రయాణించినా దానంతటదే సర్దుబాటు చేసుకోవడం దీని ప్రత్యేకత. గుంతల్లో ప్రయాణించినా కెమెరా కదలకుండా స్పష్టంగా చిత్రాలు తీయడం దీని ప్రత్యేకతగా విద్యార్థులు అభివర్ణిస్తున్నారు.


భూకంపాలను తట్టుకునే నిర్మాణాలు..

భూకంపాలు వచ్చినా తట్టుకునే ఇండ్లను నిర్మించొచ్చని విద్యాజ్యోతి ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులు ప్రశాంత్‌, ఉపేందర్‌, రాంబాబు, అన్వేష్‌, అమృత బేస్‌ ఐసోలేషన్‌ స్ట్రక్చర్‌ నిర్మాణానికి అంకురార్పణ చేశారు. పునాదుల్లో స్పిం గ్‌లు,  బాల్‌  బేరింగ్స్‌ను ఉపయోగించి 10అంతస్తుల వర కు నిర్మించుకోవచ్చని చెబుతున్నారు. ఈ ప్రయోగం సఫలీకృతమైనందని, భవనాల భద్రతకు ఢోకా ఉండదని చెబుతున్నారు. గుజరాత్‌లో భూకంపాలు సంభవించే ప్రాంతా ల్లో ఇలాంటి నిర్మాణాలను చేపడుతున్నారని చెబుతున్నారు.


కన్‌స్ట్రక్షన్‌ రోబో..

ఇళ్లు కట్టిచూడు.. పెండ్లిచేసి చూడు అన్నారు పెద్దలు. ఇండ్లు కట్టడం అంత తేలికకాదన్నది ఈ సూక్తి సారాంశం. కానీ అనుకున్నదే తడువుగా చకచకా కట్టుకునేలా నిర్మాణరంగం రోజురోజుకూ పురోభివృద్ధి చెందుతున్నది. ఇదేకోవలో కన్‌స్ట్రక్షన్‌రోబోను జేఎన్‌టీయూ విద్యార్థి మహ్మద్‌ ఉమర్‌ తయారు చేశాడు. ఇటుకలను మోసుకెళ్లడం దగ్గర నుంచి అన్ని పనులు చేసే రోబోను తయారు చేశారు. ఇటుకల మధ్యలో సరైన మొతాదులో ఇసుక సిమెంట్‌ మిశ్రమాన్ని పోయడం దగ్గర నుంచి వాటర్‌ క్యూరింగ్‌ చేయడం, నిర్మాణం పూర్తయిన తర్వాత రంగులు వేయడం కూడా ఈ రోబో చేసిపెడుతుందని ఉమర్‌ చెబుతున్నాడు.


రైళ్ల స్పీడ్‌కు బ్రేకులు..

రైళ్ల వేగాన్ని నియంత్రించే వ్యవస్థలను రూపొందించారు జేఎన్‌టీయూ విద్యార్థులు. ఎత్తైన, పొడవైన వంతెనలపై రైళ్లు నిర్ధిష్ట వేగానికంటే ఎక్కువగా వెలితే ఆటోమెటిక్‌గా ఆపేసే సెన్సార్లను కనిపెట్టారు. సెన్సార్లను రైల్వేట్రాక్‌పై అమ ర్చి, నిర్ధిష్టవేగాన్ని మించగానే ఆగిపోయేలా రూపొందించారు. దేశంలో ఈఫిల్‌టవర్‌ కంటే ఎత్తైన చినాబ్‌నదిపై నిర్మిస్తున్న వంతెనపై ఉపయోగిస్తున్నారని విద్యార్థులు రుషిత, మేఘన, లిఖిత, సాయితేజ, సాకేత్‌, సార్ధక్‌ తెలిపారు.


ఇంజినీర్డ్‌ సాయిల్‌..

కాల్వలు, వంతెనలకు సమాంతరంగా నిర్మించిన కరకట్టలను చూస్తే ఏటవాలుగా ఉంటాయి. ఇలాఉండటం వల్ల స్థలం వృథాకావడంతోపాటు నిర్మాణ వ్యయం సైతం అధికమవుతుంది. దీనికి పరిష్కారంగా చందన, సహర్ష అనే విద్యార్థులు సౌజన్య మార్గదర్శనంలో ఇంజినీర్డ్‌ సాయిల్‌ ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేశారు. జియోటెక్స్‌లైట్‌, జియోగ్రిడ్‌, జియోమెంబ్రేన్‌, బ్రాగ్‌ పద్ధతుల్లో సమాంతరంగా నిర్మాణాలు చేపట్టవచ్చని విద్యార్థులు చెబుతున్నారు.


logo