e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, October 21, 2021
Home హైదరాబాద్‌ సంబురమాడే..సింగిడి మేళా..

సంబురమాడే..సింగిడి మేళా..

  • ప్రత్యేక ఆకర్షణగా రైల్వేబ్యాండ్‌ షో, బాణాసంచా హరివిల్లులు
  • వినూత్న వేషధారణతో ఆకట్టుకున్న కళాకారులు
  • కొలువుదీరిన తీరొక్క స్టాళ్లు

చిన్నారుల కేరింతలు, సెల్ఫీలతో యువత సందడి తెలంగాణ సంప్రదాయాలతో సాగర తీరం పులకించింది. పోతరాజుల విన్యాసాలు, డప్పుచప్పుళ్లు, కోలాటాలు, తీన్మార్‌ నృత్యాలతో హోరెత్తింది. ఓ వైపు వినోదం.. మరోవైపు సామాజిక అవగాహన.. ఇంకోవైపు శారీరక వ్యాయామ ప్రాధాన్యాన్ని చాటుతూ సండే ఫన్‌డే సాగింది. ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుంచే నగరవాసులు, పర్యాటకులు ట్యాంక్‌బండ్‌కు భారీగా తరలివచ్చి సందడి చేశారు. వినూత్న వేషధారణతో పలువురు ఆకట్టుకోగా.. రైల్వే ఆధ్వర్యంలో నిర్వహించిన బ్యాండ్‌ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గతవారానికి భిన్నంగా ఈ వారం బాణాసంచా హరివిల్లులు ప్రతిఒక్కరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాయి. మరోవైపు ఫుడ్‌కోర్టుల్లోని నోరూరించే వంటకాలను నగరవాసులు ఆరగించారు. ప్రత్యేకంగా తందూరి చాయ్‌ విశేషంగా ఆకట్టుకున్నది. ఇదిలా ఉంటే సండే ఫన్‌డే కార్యక్రమాన్ని హెచ్‌ఎండీఏ అధికారులు పర్యవేక్షించారు.

సాగర తీరంలో సంధ్యా సమయాన సందడి నెలకొన్నది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా ధూమ్‌ ధామ్‌గా జరిగింది. పోతరాజుల విన్యాసాలు.. డప్పుచప్పుళ్లు.. కోలాటాలు.. చీరకట్టులో నృత్యాలతో సాగర్‌ పులకించింది. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన ‘సన్‌ డే ఫన్‌ డే’ కార్యక్రమం నగరవాసుల మదిదోచింది. పైసా ఖర్చు లేకుండా వంద శాతం ఆహ్లాదం పంచే వేదికగా ‘సన్‌ డే ఫన్‌ డే’ కార్యక్రమం స్థానం సంపాదించుకుంది. పర్యాటకులకు వినోదమే లక్ష్యంగా ప్రతీ ఆదివారం ప్రభుత్వం టాంక్‌బండ్‌ను ట్రాఫిక్‌ ఫ్రీగా కేటాయించింది. ఈ సారి మధ్యాహ్నం 3 గంటల నుంచే అనుమతి ఇవ్వడంతో రాత్రి పది గంటల వరకు నగరవాసులు భారీ సంఖ్యలో తరలొచ్చారు. చిన్నారులు కేరింతలతో జోష్‌గా గడిపారు. ఓ వైపు వినోదం..మరోవైపు సామాజిక అంశాలపై అవగాహన.. ఇంకోవైపు శారీరక వ్యాయామం ప్రాధాన్యతను చాటుతూ సాగిన టాంక్‌బండ్‌ వినోదం చూడముచ్చటగా సాగింది. వినూత్న వేషధారణలతో పలువురు ఆకట్టుకున్నారు.

హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ఏర్పాట్లు

- Advertisement -

నగరవాసులంతా సందడి చేసేందుకు వీలుగా హెచ్‌ఎండీఏ కార్యదర్శి సంతోష్‌, అర్బన్‌ ఫారెస్ట్‌ విభాగం డైరెక్టర్‌ ప్రభాకర్‌, చీఫ్‌ ఇంజినీర్‌ బీ.ఎల్‌.ఎన్‌.రెడ్డి, పలువురు ఇంజినీర్లు, అధికారులు ట్యాంక్‌బండ్‌ సన్‌ డే ఫన్‌ డే ఏర్పాట్లను పర్యవేక్షించారు. సుమారు హెచ్‌ఎండీఏ నుంచే 50 మంది వరకు అధికారులు, సిబ్బంది క్షేత్ర స్థాయిలో పనిచేశారు. ట్యాంక్‌బండ్‌ ఒక చివరి నుంచి మరో చివరి వరకు సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సిటీ పోలీస్‌ అధికారులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.

మనసారా ఆస్వాదించాం

ప్రతీ సండే ఏదో ఒక పర్యాటక ప్రాంతానికి వెళుతుంటాం. ఈ సారి ట్యాంక్‌ బండ్‌ వద్ద ఇలాంటి సందడి ఉందని తెలుసుకుని వచ్చాం. నిజంగా ప్రభుత్వం పర్యాటకుల కోసం మంచి నిర్ణయం తీసుకున్నది. ఎప్పుడు ట్యాంక్‌బండ్‌ వచ్చినా మనసారా పరిసర సౌందర్యాలను చూడటం కష్టంగా ఉండేది. ఈసారి తనివితీరా ఫ్యామిలీతో గడిపాం. – లావణ్య

షాపింగ్‌.. సందడి..

ట్యాంక్‌బండ్‌పై చార్మినార్‌ షాపింగ్‌ కేంద్రాలు వెలిశాయి. తెల్లని షామియానాలను ఏర్పాటు చేసి రకరకాల వస్తువులను విక్రయించేలా కౌంటర్లను తీర్చిదిద్దారు. పాతనగరంలో ప్రత్యేకంగా దొరికే మట్టి గాజులు, ముత్యాల హారాలు, కృత్రిమ జ్యువెలరీ, అత్తర్లు… ఇలా మొత్తంగా మగువల మదిదోచే ఎన్నో వస్తువులు అందంగా కొలువుదీరాయి. మహిళలు, యువతులు ఎంతో ఇష్టంగా వాటిని కొనుగోలు చేస్తూ పాతనగరం షాపింగ్‌ అనుభవమంతా ఆదివారం ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన షాపింగ్‌ కేంద్రాల్లో సొంతం చేసుకున్నారు.

ప్రత్యేక ఆకర్షణగా రైల్వే బ్యాండ్‌ షో

రైల్వే ఆధ్వర్యంలో నిర్వహించిన బ్యాండ్‌ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పోలీసులు చిన్నారులు, మహిళలపై జరుగుతున్న నేరాలపై అవగాహన కల్పించేలా నాటికలను ప్రదర్శించారు. హుస్సేన్‌ సాగర్‌ మధ్యలో ఉన్న బుద్ధ విగ్రహం వద్ద బాణాసంచా హరివిల్లులతో సాగర్‌తీరం కళకళలాడింది. ఇంతకు ముందు వేడుకలో లేజర్‌ షో ఆకట్టుకోగా, ఈసారి బాణాసంచ మోత సందర్శకులను ఆకర్శించింది. అదేక్రమంలో ఆర్మీ బ్యాండ్‌ స్థానంలో రైల్వే బ్యాండ్‌ షో ఆకట్టుకుంది. ఇలా ప్రతీ సండే ఏదో ఒక కొత్తదనంతో సందర్శకులకు పండుగ వాతావరణాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తుండడం విశేషం.

తీరొక్క స్టాల్‌..

ఫుడ్‌ కోర్టులు, షాపింగ్‌ స్టాల్స్‌ ఏర్పాటు చేయడంతో వినియోగదారుల సందడి అంబరాన్నంటింది. వారికి నచ్చిన వస్తువులను కొనుగోలు చేశారు. నోరూరించే వంటకాలు అందుబాటులో ఉండటంతో తృప్తిగా ఆరిగించారు. ప్రత్యేకంగా తందూరి చాయ్‌ కస్టమర్లను విశేషంగా ఆకట్టుకుంది. తీరొక్క అత్తర్లు పర్యాటకులకు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎటు చూసినా సెల్ఫీలతో పర్యాటకులు సందడి చేశారు.

షీ టీమ్స్‌ నిఘా..

ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన ‘సన్‌ డే ఫన్‌ డే’ కార్యక్రమంలో ఆకతాయిల నుంచి రక్షించేందుకు షీ టీమ్స్‌ గట్టి నిఘాను ఏర్పాటు చేశాయి. గతంలో సాధారణ పోలీసులతో కలిసి మఫ్టీలో ఉన్న షీ టీమ్స్‌, తాజాగా ట్యాంక్‌బండ్‌పై ప్రత్యేకంగా ఒక వేదికను ఏర్పాటు చేశారు. మరీ ముఖ్యంగా కుటుంబసభ్యులతో వచ్చే మహిళల గౌరవానికి భంగం కలుగకుండా, ఆడపిల్లల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.

మొక్కలు, మాస్కులు పంపిణీ

ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రంలో హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో మొక్కలు, మాస్కులను పంపిణీ చేశారు. నగరం నలుమూలల నుంచి వేలాది మంది తరలివచ్చారు. కుటుంబసభ్యులతో కలిసి వచ్చిన వారికి హెచ్‌ఎండీఏ అధికారులు, సిబ్బంది ఉచితంగా 30 రకాల మొక్కలను పంపిణీ చేశారు. ఇదే సమయంలో వారికి ఆ మొక్కల ఉపయోగాలను అర్బన్‌ ఫారెస్ట్రీ విభాగం అధికారులు వివరించారు. కొవిడ్‌-19 నిబంధనల నేపథ్యంలో మాస్కులు ధరించకుండా వచ్చిన వారికి ఉచితంగా పంపిణీ చేస్తూ, కొవిడ్‌ జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

స్టెప్పులు వేశాం

ఎంటర్‌టైన్‌మెంట్‌ కావాలంటే ట్యాంక్‌బండ్‌ రావాల్సిందే. మాది జోర్దన్‌. ఓయూలో పీహెచ్‌డీ చేస్తున్నాను. టాంక్‌బండ్‌కు రావడం అంటే తెలంగాణ సంప్రదాయాలను తెలుసుకోవడమే. ఇక్కడ పోతరాజుల విన్యాసాలు, కోలాటాలు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మేం కూడా స్టెప్పులు వేశాం. ఐ లవ్‌ హైదరాబాద్‌. – మోత్‌, పరిశోధక విద్యార్థి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement