శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Hyderabad - Jan 24, 2021 , 07:07:58

15 నిమిషాల్లో దోపిడీ చేసి.. 15 గంటల్లో పట్టుబడ్డారు

15 నిమిషాల్లో దోపిడీ చేసి.. 15 గంటల్లో పట్టుబడ్డారు

  • చోరీ సొత్తుతో హైదరాబాద్‌ మీదుగా నాగ్‌పూర్‌కు..
  • అక్కడి పోలీసుల సమాచారంతో ఇక్కడ అప్రమత్తం 
  • తొండుపల్లి టోల్‌ ప్లాజా వద్ద పట్టుబడిన దుండగులు
  • వీడిన తమిళనాడు ముత్తూట్‌ దోపిడీ మిస్టరీ..

తమిళనాడు కృష్ణగిరి హడ్కో పోలీసు స్టేషన్‌ పరిధిలో మధ్యప్రదేశ్‌కు చెందిన ముఠా సభ్యులు పక్కా స్కేచ్‌వేసి రూ.12 కోట్ల విలువ చేసే 25 కేజీల బంగారాన్ని 15 నిమిషాల్లో కొట్టేసినా.. సైబరాబాద్‌ పోలీసులు వేసిన వలకు 15 గంటల్లోనే చిక్కారు.. తమిళనాడు పోలీసులు ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసు బాసులు వెంటనే 100 మంది పోలీసులను రంగంలోకి దింపారు.. నిందితులు అనంతపురం నుంచి నగరం వైపు మీదుగా నాగ్‌పూర్‌ వెళ్తున్నట్లు గుర్తించారు. దీంతో ప్రతి టోల్‌ ప్లాజా, చెక్‌ పోస్టు వద్ద పోలీసులను మొహరించారు. అలా.. వచ్చిన దుండగులు దాదాపు 670 కి.మీ ప్రయాణించి చివరకు సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని తొండుపల్లి టోల్‌ ప్లాజా వద్ద దొరికిపోయారు.   

 మూడు నెలల ముందు నుంచే..

ఈ దోపిడీ దొంగల ముఠా ప్రధాన సూత్రధారి రూప్‌సింగ్‌ బాగల్‌ విద్యాభ్యాసాన్ని మధ్యలోనే ఆపేసి.. భారీ దోపిడీకి స్కెచ్‌ వేశాడు. ఇందుకు మూడు నెలల కిందట రాంచిలో పని చేసినప్పుడు పరిచయం అయిన అమిత్‌ ను, సోదరుడు శంకర్‌ సింగ్‌ బాగల్‌ను కలుపుకుని బెంగళూరులోని ఎలక్ట్రాన్‌ సిటీలో అద్దెకు ఉన్నాడు. ఆ తర్వాత బెంగళూరు, తమిళనాడు ప్రాంతాల్లో ముత్తూట్‌ ఫైనాన్స్‌ సంస్థలు ఉన్న ప్రాంతాలను గుర్తించారు. చివరకు బెంగళూరు, తమిళనాడు సరిహద్దులో ఉన్న కృష్ణగిరి వద్ద ఉన్న హడ్కో పోలీసు స్టేషన్‌ ప్రాంతంలోని ముత్తూట్‌ సంస్థను టార్గెట్‌ పెట్టుకున్నారు. ముందుగా రూప్‌సింగ్‌ దాని వివరాలన్నీ తెలుసుకుని.. వీడియో తీశాడు.. ఇలా మూడుసార్లు రెక్కీ నిర్వహించి.. శుక్రవారం అమలు చేశాడు. 

మొదట సుమో.. ఆ తర్వాత కంటెయినర్‌

దోపిడీ తర్వాత దుండగులు వస్తున్నారనే సమాచారంతో సైబరాబాద్‌ పోలీసులు రాయ్‌కల్‌ దగ్గర మఫ్టీలో నిలబడ్డారు. దుండగుల వద్ద తుపాకులు ఉన్నాయని సమాచారం అందగానే.. రాయ్‌కల్‌ వద్దకు వచ్చిన సుమోను, కంటెయినర్‌ను అడ్డగించకుండా వదిలిపెట్టారు. ఆ తర్వాత తొండుపల్లి టోల్‌ప్లాజా వద్ద ఉన్న పోలీసులకు సమాచారం అందించారు.  ముందుగా కంటెయినర్‌ వెళ్లిపోగానే దాని వెనకాల వచ్చిన సుమోను పోలీసులు అదుపులోకి తీసుకున్నా రు. దీంతో ఐదుగురు దోపిడీ ముఠా సభ్యులు చిక్కారు. ఆ తర్వాత మేడ్చల్‌ చెక్‌ పోస్టు వద్ద కంటెయినర్‌ను అదుపులోకి తీసుకోవడంతో 25 కేజీల బంగారం దొరికిపోయింది. ఇందు లో ప్రధాన నిందితుడు రూప్‌సింగ్‌ ఒక్కడే ఫోన్‌ వాడగా... మిగతా ముఠా సభ్యులు ఫోన్లు స్విచ్‌ ఆఫ్‌ చేశారు.  

దోపిడీకి తుపాకులు..

దోపిడీకి తుపాకులు అవసరం ఉండటంతో రూప్‌సింగ్‌...తన స్నేహితుడు లులియాపాండేను సంప్రదించాడు. అతడు ఏడు తుపాకులు, 10 మ్యాగ్జిన్‌లు, 97 బుల్లెట్‌లను ఇచ్చాడు. అలాగే.. దోపిడీ తర్వాత దోచుకున్న బంగారాన్ని తరలించేందుకు కంటెయినర్‌ కావాలని చెప్పగా డ్రైవర్‌ టెక్‌రామ్‌ ఉన్నాడని లులియాపాండే చెప్పాడు.. లులియాపాండే సూచన మేరకు టెక్‌ రామ్‌ కంటెయినర్‌ను తీసుకుని కృష్ణగిరి వద్ద క్లీనర్‌ రాజీవ్‌కుమార్‌తో కలిసి ఐదు రోజులు ఉన్నాడు. దుండగులు దోపిడీ జరగానే నేరుగా బైక్‌ల మీద బంగారాన్ని తీసుకువచ్చి ఆ వాహనాలను అక్కడే వదిలేసి కొందరు కంటెయినర్‌ ఎక్కి ప్రత్యేక క్యాబిన్‌లో బంగారం, తుపాకులు పెట్టుకుని, మరికొందరు సుమోలో వయా హైదరాబాద్‌ మీదు నాగ్‌పూర్‌ ప్రయాణం అయ్యి సైబరాబాద్‌లో దొరికిపోయారు. ఈ దోపిడీ కోసం దుండగులు మూడు హైస్పీడ్‌ బైక్‌లను కొనుగోలు చేశారు. 

కాగా.. రూప్‌సింగ్‌ ముఠా.. గత ఏడాది అక్టోబర్‌లో పంజాబ్‌ లుథియానాలో ముత్తూట్‌ సంస్థలో దోపిడీకి స్కెచ్‌ వేసి విఫలమైంది. ఆ సమయంలో ఈ ముఠా దాదాపు 33 బుల్లెట్‌ల వర్షాన్ని కురిపించారు. 24/7 అందుబాటులో.. తెలంగాణవైపు గానీ, హైదరాబాద్‌వైపు గానీ అంతర్రాష్ట్ర ముఠా కన్నెత్తి చూస్తే.. వారి భరతం పడతాం. ఇప్పటి వరకు 24 అంతర్రాష్ట్ర గ్యాంగ్‌లను అరెస్ట్‌చేసి 95 మంది నిందితులను జైలుకు పంపాం. ఈ నిందితుల నుంచి రూ.5.39 కోట్లను స్వాధీనం చేసుకుని.. 5 తుపాకులను సీజ్‌ చేశాం. ఈ విధంగా నేరాల నియంత్రణకు 24/7 అందుబాటులో ఉంటాం. ప్రతి ఫైనాన్స్‌ సంస్థలు తప్పకుండా సాయుధ సెక్యూరిటీని పెట్టుకోవాలి. ఎవరైనా దుండగులు వచ్చినప్పుడు సింగిల్‌ బజర్‌ బటన్‌తో పోలీసులు, సెక్యూరిటీ, వారి ప్రధాన కార్యాలయాన్ని అప్రమత్తం చేసేలా సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకోవాలి. నాణ్యమైన సీసీ కెమెరాలను పెట్టుకోవాలి. - సజ్జనార్‌, సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌

VIDEOS

logo