లక్షణంగా ఉల్లంఘన..

గుట్టుచప్పుడు కాకుండా వ్యర్థాలను వదిలించుకుంటున్న పరిశ్రమలు
నగరం నడిబొడ్డున సాగుతున్న అక్రమ దందా
తాజాగా ఓ రసాయన ట్యాంకర్‌ను పట్టుకున్న పీసీబీ అధికారులు
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : పీసీబీ పరిభాషలో హై-టీడీఎస్ (అత్యధిక గాఢత) కలిగిన రసాయన వ్యర్థ జలాలంటే యాసిడ్‌తో సమానం. సోడియం.. సీసం.. మెగ్నీషియం, సల్ఫేట్లు, పొటాషియం, క్లోరైడ్స్ సమ్మేళమైన ఈ వ్యర్థజలాలు అత్యంత ప్రమాదకరమైనవి. ఇలాంటి 20 వేల లీటర్ల వ్యర్థజలాలను నేరుగా నీటిలో కలిపితే ఎలా ఉంటుందో ఊహించడానికే కష్టం. చేపలు, కప్పలు ఇతర జలచరాలు క్షణాల్లో ప్రాణాలొదులుతాయి. ఇంతటి ప్రమాదకరమైన వ్యర్థజలాలను కూకట్పల్లి నాలాలో పారబోయడానికి తీసుకెళుతున్న ఓ ట్యాంకర్‌ను ఇటీవలే పీసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎల్బీనగర్ వద్ద రాత్రిపూట ట్యాంకర్‌ను పట్టకుని లోతుగా విచారణ జరిపితే వెల్లడైన వాస్తవాలు చూస్తే పీసీబీ అధికారులకు బైర్లు కమ్మాయి. ఇంత జరుగుతుందా అని పీసీబీ అధికారులే ముక్కున వేలేసుకున్నారంటే పరిస్థితి ఎంత దిగజారుతున్నదో అర్థం చేసుకోవచ్చు. ఇలాగే చౌటుప్పల్‌లోని ఓ ఔషధాల తయారీ పరిశ్రమ అడ్డదారులు తొక్కేందుకు వెళ్లి అడ్డంగా బుక్కయ్యింది. వక్రమార్గాన్ని అనుసరించి మూసివేతకు రెడీగా ఉంది.
లక్ష ఆదా కోసం..
ఔషధాల తయారీలో భాగంగా పరిశ్రమలలో వెలువడిన రసాయన వ్యర్థజలాలను వాస్తవికంగా జీడిమెట్ల ఇప్లూయంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ (జేఈటీఎల్)కు తరలించి శుద్ధిచేయాలి. ఎంత ఖర్చవుతుందో తెలుసుకోవడానికి సదరు పరిశ్రమ యాజమాన్యం శాంపిల్‌ను సేకరించి జేఈటీఎల్‌కు పంపిస్తే ఒక ట్యాంకర్‌కు రూ. లక్ష అవుతుందని చెప్పారు. తమ వద్ద గలవి హై - టీడీఎస్ వ్యర్థజలాలు కావడంతో పరిశ్రమ నిర్వాహకులు ఎలాగైనా వదిలించుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. ఇలాంటి వాటిలో నేర్పరిగా ఉన్న ఓ ట్యాంకర్ యజమానితో రూ.50వేలకు బేరం కుదుర్చుకున్నారు. అర్ధరాత్రి పూట ముహూర్తం చూసుకుని, తప్పుడు పత్రాలు సృష్టించి తరలిస్తుండగా పీసీబీ అధికారులకు దొరికిపోయారు.
తప్పుడు బిల్లులతో ..
ట్యాంకర్లో ఉన్నవి వ్యర్థజలాలను కాదని చూపించడానికి ట్యాంకర్ యజమాని, పరిశ్రమ నిర్వాహకులు కొత్త నాటకానికి తెరలేపారు. తప్పుడు బిల్లులను సృష్టించి, ట్యాంకర్లో ఉన్నవి రసాయన వ్యర్థజలాలు కావని, సల్ఫర్, అమోనియా లాంటి రసాయనాలు అని బిల్లులు సృష్టించారు. ఆయా రసాయనాలను తాండూరులోని మరో పరిశ్రమకు తరలిస్తున్నట్లుగా కలరింగ్ ఇచ్చారు. అయితే అదే రోజు నైట్ పెట్రోలింగ్ విధుల్లో ఉన్న పీసీబీ అధికారులను నమ్మించేందుకు సైతం ప్రయత్నించారు. అయితే తాండూరులో గల సదరు పరిశ్రమ నిర్వాహకుడు ఇటీవలే చనిపోవడం, అతడితో పీసీబీ అధికారులకు సత్సంబంధాలుండటం, 15 రోజులుగా పరిశ్రమను మూసివేసినట్లుగా ముందస్తుగా సమాచారముండటంతో పీసీబీ అధికారులకు నమ్మకం కుదరలేదు. ఎందుకైనా మంచిదని పై అధికారికి ఫోన్ చేసి సదరు పరిశ్రమ నడుస్తుందో లేదో తెలుసుకుంటే మూసి ఉన్నట్లుగానే తేలడంతో గుట్టరట్టయ్యింది. పైగా పీసీబీ అధికారులు ట్యాంకర్ మూత తీయించి చూడగా పొగలు కక్కుతూ ఘాటువాసనలు రావడంతో అవాక్కయ్యారు. అక్కడిక్కడే ట్యాంకర్ డ్రైవర్‌పై ప్రశ్నల వర్షం కురిపిస్తే నిజాలు ముత్యాల్లా రాలాయి.
జింకల బస్తీ.. పారబోతల జబర్దస్తీ..
ఇది వరకు గ్రేటర్ శివారు ప్రాంతాలు వ్యర్థజలాల అక్రమ డంపింగ్‌కు కేంద్రంగా ఉండేవి. నాగోల్, మూసీతీర ప్రాంతం, ఓఆర్ఆర్ సర్వీసు రోడ్ల కేంద్రంగా అక్రమ డంపింగ్ జరుగుతుండేది. కానీ ఇప్పుడు శివారు ప్రాంతాల నుంచి తీసుకొచ్చి నగరం నడిబొడ్డున పారబోస్తుండటం అత్యంత ఆందోళన కలిగించే అంశం. చౌటుప్పల్ నుంచి బాలానగర్‌లోని జింకలబస్తీకి వ్యర్థజలాలను తరలించి కూకట్పల్లి నాలాలో పారబోస్తున్నట్లుగా ట్యాంకర్ యజమాని పీసీబీ విచారణలో వెళ్లగక్కడం గమనార్హం. అంటే ఈ దందా ఎంత దర్జాగా సాగుతున్నదో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ పలు కెమికల్ గోదాములుండటం, వాటి వద్దకు తరలిస్తున్నట్లుగా చెప్పుకుంటూ తీసుకొచ్చి కూకట్పల్లి నాలాలో పారబోస్తున్నారు. పీసీబీ అధికారులు ఇకనైనా గట్టి నిఘా పెట్టి ఇలాంటి ఉల్లంఘనులకు చెక్‌పెట్టాలని పర్యావరణ వేత్తలు కోరుతున్నారు.
తాజావార్తలు
- వ్యాక్సిన్ తీసుకున్న ఎయిమ్స్ డైరెక్టర్, సీరమ్ సీఈవో
- అంతరిక్ష యాత్ర కేవలం రూ.96 లక్షలకే..
- అమెజాన్ ‘బ్లూ ఆరిజన్’ సక్సెస్
- ప్రజావైద్యుడు లక్ష్మణమూర్తి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
- ప్రభాస్ ‘సలార్’ లేటెస్ట్ అప్డేట్.. హీరోయిన్.. విలన్ ఎవరో తెలుసా?
- బెంగళూరు హైవేపై ప్రమాదం : ఒకరు మృతి
- వైద్య సిబ్బంది సేవలు మరువలేం : మంత్రి సబిత
- మన భూమి కంటే పెద్ద భూమి ఇది..!
- టీకా రాజధానిగా హైదరాబాద్ : మంత్రి కేటీఆర్
- ‘శశి’ వచ్చేది ప్రేమికుల రోజుకే..