శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Hyderabad - Feb 23, 2021 , 05:58:36

సేవే లక్ష్యం..బోధనే మార్గం

సేవే లక్ష్యం..బోధనే మార్గం

అల్వాల్‌, ఫిబ్రవరి 22 : అనాథలు, నిరాశ్రయులైన పిల్లలను చేరదీసి ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్నది ఎయిమ్‌ ఫర్‌ సేవా సంస్థ. ఉచిత భోజనం, వసతి, విద్యాబోధనలు అందించి సేవాగుణాన్ని చాటుకుంటున్నది. 2000 సంవత్సరంలో స్వామి దయానంద సరస్వతి ఆలిండియా మూవ్‌మెంట్‌ ఫర్‌ సేవ పేరుతో దేశ వ్యాప్తంగా 17 రాష్ర్టాల్లో 120కి పైగా వసతి గృహాలను స్థాపించగా, మన రాష్ట్రంలో ఆరు చోట్ల సేవలందిస్తున్నది. అల్వాల్‌ మచ్చబొల్లారం సెవెన్‌ టెంపుల్‌ సమీపంలోని సర్వేశ్వర గుట్టలో 2004లో ఈ సంస్థ వసతి గృహం ప్రారంభించింది.

సవాళ్లను ఎదుర్కొనేలా..

ఈ వసతి గృహంలో సుమారు వంద మంది పిల్లలు ఆశ్రయం పొందుతున్నారు. ఆరోగ్యకర జీవనం, సానుకూల బోధనా విధానంలో చిన్నారులకు కేజీ నుంచి పీజీ వరకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తున్నది. ప్రముఖ విద్యాసంస్థల సహకారంతో విద్యాబోధన కొనసాగిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళలో యోగా, మెడిటేషన్‌, ఆటలు, ఆత్మరక్షణ విద్యా, వ్యక్తిత్వ వికాసంతోపాటు దేశభక్తి, మానవతా విలువల బోధన, సామాజిక సేవలో తమవంతు కర్తవ్యం తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. పోటీ పరీక్షల్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేలా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి విజేతలుగా తీర్చిదిద్దుతున్నది ఎయిమ్‌ ఫర్‌ సేవా. 

విదేశాల్లోనూ చదువులు..

ఎయిమ్‌ ఫర్‌ సేవా సంస్థ అల్వాల్‌ శిక్షణ కేంద్రంలో 16 సంవత్సరాల వ్యవధిలో సుమారు వెయ్యికి పైగా విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దారు. హరీశ్‌ అనే విద్యార్థి జర్మనీలో ప్రస్తుతం ఎంఎస్‌ మెకానికల్‌ చదువుతుండగా, రోహిత్‌ ఇన్ఫోటెక్‌లో, అఖిల్‌ సిటీ యూనియన్‌ బ్యాంకులో ఉద్యోగాలు చేస్తున్నారు. వీరికి తోడు ఎంతో మంది విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో రాణిస్తున్నట్లు వసతి గృహ పర్యవేక్షకుడు శ్రీనివాస్‌ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు వచ్చి వసతి గృహానికి అవసరమైన స్థలాన్ని, భవనాలు అందిస్తే మరిన్ని ప్రాంతాల్లో సేవలు విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. 

VIDEOS

logo