శనివారం 04 జూలై 2020
Hyderabad - May 30, 2020 , 03:31:58

కంటైన్‌మెంట్‌ జోన్లలో నేడు, రేపు సర్వే..

కంటైన్‌మెంట్‌ జోన్లలో నేడు, రేపు సర్వే..

హైదరాబాద్‌  :  కరోనా విస్తరణ నేపథ్యంలో హైదరాబాద్‌ నగరంలోని కంటైన్‌మెంట్‌ జోన్లలో సెరో సర్వెలెన్స్‌ సర్వే రెండ్రోజులపాటు జరుగనున్నది. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రీషన్‌ (ఎన్‌ఐఎన్‌), ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) సంస్థలు తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో  ఈనెల 30,31 తేదీల్లో సర్వే చేపట్టనున్నారు. నగరంలో ఉన్న సుమారు 100 కంటైన్‌మెంట్‌ జోన్లలో తీవ్రంగా ఉన్న ఐదు జోన్లను ఎంపికచేసి సర్వే చేపట్టనున్నారు. దేశంలోని 21 రాష్ర్టాల్లో  మొదటి దశలో  69 జిల్లాల్లో  సర్వే నిర్వహించారు. 

ఇప్పటికే  తెలంగాణలోని 3 జిల్లాల్లో సర్వే పూర్తిచేశారు. అదేవిధంగా రెండో దశలో దేశంలో 13 హాట్‌స్పాట్‌ నగరాలను ఎంపిక చేసుకున్నారు. వాటిలో హైదరాబాద్‌ నగరం కూడా ఉండటంతో ఐదు జోన్లలో సర్వే చేపట్టనున్నారు. ఒక్కో కంటైన్‌మెంట్‌ జోన్‌లో 100 మంది చొప్పున 500 మంది పెద్దలపై సర్వేలెన్స్‌ సర్వే చేస్తారు. కంటైన్‌మెంట్‌ జోన్లలో నివసిస్తున్న వారి నుంచి శాంపిల్స్‌ తీసుకుని పరీక్షిస్తారు. దీనికోసం రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు, జీహెచ్‌ఎంసీ అధికారులు (రంగారెడ్డి, హైదరాబాద్‌), జిల్లా వైద్యాధికారులు,  క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందితో కూడిన 10 బృందాలు పనిచేస్తాయి. ఎన్‌ఐఎన్‌-ఐసీఎంఆర్‌కు చెందిన ఐదుగురు ప్రతినిధులు  కో ఆర్డినేటర్లుగా ఉంటారు.logo