సోమవారం 30 నవంబర్ 2020
Hyderabad - Oct 22, 2020 , 06:12:54

అవయవాలు స్థానభ్రంశం ఉస్మానియాలో పునరుజ్జీవం

అవయవాలు స్థానభ్రంశం ఉస్మానియాలో పునరుజ్జీవం

  • మహిళకు అరుదైన ఆపరేషన్‌
  • ఐదు గంటలపాటు శ్రమించిన మూడు విభాగాల వైద్య నిపుణులు 

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ /సుల్తాన్‌బజార్‌: డయాప్రెమటిక్‌ ఎర్నియా విత్‌ గ్యాస్ట్రిక్‌ వాల్వులర్స్‌ సమస్యతో బాధపడుతున్న ఓ  మహిళకు ఉస్మానియా దవాఖాన వైద్యులు ఏకకాలంలో రెండు అరుదైన శస్త్రచికిత్సలు జరిపి పునర్జీవం పోశారు.  ఉస్మానియాలోని తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శస్త్రచికిత్సకు సంబంధించిన వివరాలను ఉస్మానియా దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బి.నాగేందర్‌ వివరించారు. కామారెడ్డికి చెందిన లావణ్య(30) తీవ్ర కడుపునొప్పి, వాంతులు కావడంతో సెప్టెంబర్‌ 28న స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్‌ దవాఖానలో చేరి మూడు రోజుల పాటు  చికిత్స తీసుకోగా.. అక్కడి వైద్యులు రోగిని ఉస్మానియా దవాఖానకు రెఫర్‌ చేశారన్నారు. దీంతో లావణ్యను పరిశీలించిన ఉస్మానియా వైద్యులు  ఆమె అరుదైన ‘డయాప్రెమటిక్‌ ఎర్నియా విత్‌ గ్యాస్ట్రిక్‌ వాల్వులర్స్‌' తో బాధపడుతున్నట్లు గుర్తించారు. దీంతో రోగి కడుపులో ఉన్న జీర్ణాశయం ఛాతి భాగంలోకి వెళ్లి ఊపిరితిత్తులపై ఒత్తిడి పెంచడంతో ఛాతికి ఎడమ వైపున ఉన్న గుండె కుడి వైపునకు జరిగినట్లు  గుర్తించారు. 

5గంటలు.. మూడు విభాగాలు.. 

అరుదైన ఎర్నియాతో అవయవాలు ఉన్న చోట నుంచి వేరే చోటకు స్థానభ్రంశం చెందడంతో అనస్థీషియా, జనరల్‌ సర్జరీ, సీటీ-సర్జరీ విభాగాలకు చెందిన వైద్యబృందాలు ఈ నెల 10న 5గంటల పాటు శ్రమించి ఏకకాలంలో రెండు శస్త్రచికిత్సలు నిర్వహించారు. మొదటి దఫాగా డయాప్రెమటిక్‌ ఎర్నియా విత్‌ గ్యాస్ట్రిక్‌ వాల్వులర్స్‌ శస్త్రచికిత్స జరిపి ఎర్నియాను తొలగించారు. రెండవ దఫాలో గ్యాస్ట్రో టెక్ట్సీ శస్త్రచికిత్స జరిపి కడుపులో నుంచి ఛాతి భాగానికి స్థానభ్రంశం చెందిన జీర్ణాశయాన్ని యథాస్థానానికి తీసుకువచ్చినట్లు వైద్యనిపుణులు వివరించారు. దీంతో ఎడమ వైపునకు జరిగిన గుండె యథాస్థానానికి వచ్చినట్లు వైద్యులు తెలిపారు. రోగిని 10 రోజుల పాటు ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచామని, ప్రస్తుతం లావణ్య కోలుకుని సాధారణ స్థితికి చేరుకుందని వైద్యులు వెల్లడించారు. ఈ శస్త్రచికిత్సకు కార్పొరేట్‌లో రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చవుతుందన్నారు. ఈ సందర్భంగా ఉస్మానియా దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బి.నాగేందర్‌తో పాటు శస్త్రచికిత్సలు జరిపిన అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్‌ పాండు నాయక్‌, డాక్టర్‌ వెంకటేశ్వర్‌, సర్జన్‌లు డాక్టర్‌ అనిల్‌కుమార్‌, డాక్టర్‌ రాణి, కార్డియోథో రాసిస్‌ సర్జన్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌, పీజీలు డాక్టర్‌ రవీంద్రనాథ్‌, డాక్టర్‌ లలిత్‌, డాక్టర్‌ శ్రీనివాస్‌, డాక్టర్‌ ప్రియా, డాక్టర్‌ గౌతమ్‌ వైద్యబృందానికి రోగి లావణ్య కృతజ్ఞతలు తెలిపారు.  అనంతరం దవాఖాన సూపరింటెండెంట్‌ శస్త్రచికిత్స జరిపిన వైద్యబృందాన్ని అభినందించారు.