ఆదివారం 31 మే 2020
Hyderabad - May 24, 2020 , 02:21:54

ఎండతో జీవ కణాలకు వడదెబ్బ ముప్పు

ఎండతో జీవ కణాలకు వడదెబ్బ ముప్పు

హైదరాబాద్ : ఎండల్లో బయటకు వెళ్తున్నారా.. జర జాగ్రత్త!. ఈ ఏడాది భానుడు నిప్పులు కురిపిస్తుండటంతో ప్రజలు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం పొంచి ఉన్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు. వడదెబ్బతో మరణాలు సంభవిస్తున్న ఘటనలు ప్రతి సంవత్సరం నమోదవుతున్న విషయం తెలిసిందే. గడిచిన నెలరోజు లాక్‌డౌన్‌తో జనం ఇండ్ల నుంచి బయటకు రాలేదు. అంతే కాకుండా ఉపరితల ద్రోణి, ఆవర్తన ప్రభావాలతో ఏప్రిల్‌ నెల మొత్తం అడపాదడపా వర్షాలతో గడిచిపోయింది. కానీ మే నెలలో భానుడు భగభగ మండుతూ నిప్పులు కురిపిస్తున్నాడు. ఫలితంగా ఎండల తీవ్రత పెరగడంతోపాటు వడగాలులు వీస్తున్నాయి. ప్రస్తుతం నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42-43డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. దీంతో మెదడు, కిడ్నీలు, కాలేయం తదితర ప్రధాన అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉందని, చిన్నపిల్లలు, వృద్ధులు, క్యాన్సర్‌, కిడ్నీ, హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్థులు అప్రమత్తంగా ఉండాలని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

మనిషి శరీరం 32 డిగ్రీలను మాత్రమే తట్టుకుంటుంది..

మనిషి భౌగోళిక పరిస్థితుల ఆధారంగా ఒక నిర్ణీత వాతావరణానికి అలవాటు పడుతాడు. ఈ క్రమంలో మనిషి  శరీరంలో ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్‌ ఉంటుంది. అంటే మనిషి శరీరం 32 డిగ్రీల ఉష్ణోగ్రతను మాత్రమే తట్టుకుంటుంది. అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రత మనిషిపై పడినప్పుడు రకరకాల వ్యాధులకు గురవుతారు. పలు సందర్భాల్లో మృత్యువాత కూడా పడుతారు. అయితే సూర్యరశ్మీతో వెలువడే వేడితో అస్వస్థతకు గురి కావడాన్నే వడదెబ్బ అంటారు. సాధారణంగా 35 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగత్ర ఉన్నప్పుడు వడదెబ్బ సమస్య ఏర్పడుతుంది. 38-40 డిగ్రీలు అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు ఈ వడదెబ్బ ప్రాణాంతకంగా మారుతుంది. అధిక ఉష్ణోగ్రతకు గురైన వ్యక్తి ఐదు రోజుల్లోనే మృతి చెందే అవకాశాలున్నట్లు ఉస్మానియా వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

వేడిగాలులతో జీవ కణాలు దెబ్బతింటాయి..

వడదెబ్బ అంటే కేవలం ఎండలో తిరిగే వారికే కాదు వేడి గాలులతో కూడా శరీరంలోని ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. శరీరంలోని ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్‌ దాటి పెరిగితే దాన్ని హైపర్‌ థెర్మీ అంటారు. హైపర్‌ థెర్మీతో శరీరంలోని థెర్మోరెగ్యులేషన్‌ దెబ్బతింటుంది. అంటే శరీరంలోని ఉష్ణోగ్రతలు అదుపుతప్పుతాయి. దీంతో శరీరంలోని జీవ రసాయనాలు(ఎంజైమ్స్‌)వేడెక్కి పలుచబడుతాయి. జీవ రసాయనాలు పలుచబడడంతో శరీరంలోని జీవకణాలు(సెల్స్‌) సక్రమంగా పనిచేయవు. జీవ కణాల ద్వారా వచ్చే వేడితో కండరాలు వ్యాకోచిస్తాయి. దీంతో ఒళ్లునొప్పులు ఏర్పడి శరీరంలోని నీరంతా ఆవిరై, శక్తిహీనులవుతారు. జీవకణాలు, కండరాలు దెబ్బతినడంతో మెదడు, గుండెకు రక్తప్రసరణ నిలిచిపోతుంది. అంతే కాకుండా కిడ్నీలు పని చేయడం ఆగిపోతాయి.చివరకు మనిషి మృత్యువాత పడే ప్రమాదముందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. 

సాధారణంగా ఎండలో తిరిగితే మనిషి శరీరంలోని లవణాలు, ఒంట్లోని వేడి చెమట రూపంలో బయటకు వస్తాయి. కానీ 40 డిగ్రీలు..ఆపై ఉష్ణోగ్రతలతో వడగాలులు వీస్తుంటాయి. దీంతో శరీరంపై ఉన్న స్వేద రంధ్రాలు మూసుకుపోయి వేడి చెమట బయటకు రాకుండా ఉండిపోతుంది. ఫలితంగా శరీరంలో వేడి తీవ్రమై అస్వస్థతకు గురికావడం, స్పృహ కోల్పోవడం జరుగుతుంది. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉన్నది. అందుకే స్వీయ రక్షణ పాటించాలి.. తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే తలకు రుమాలు వంటిది కట్టుకోవాలి. ప్రతి 5నుంచి 10నిమిషాలకు ఒకసారి నీరు తాగాలి. నూనె, కొవ్వు పదార్థాలు తీసుకోరాదు. వడదెబ్బకు గురైన వారిని, ఎండలో తిరిగి మూర్చపోయిన వారిని వెంటనే చల్లటి ప్రదేశానికి తరలించాలి. ముఖంపై నీటిని చల్లి, స్పృహ వచ్చిన తరువాత చల్లటి నీరు తాగించాలి. ఐస్‌ ముక్కలతో చంకలు, గజ్జల్లో తుడిచినట్లయితే శరీర ఉష్ణోగ్రత త్వరగా తగ్గుతుంది. వెంటనే దగ్గరలోని దవాఖానకు  తీసుకెళ్లి చికిత్స చేయించాలి. కొబ్బరినీళ్లు, పండ్ల రసాలు, ఉప్పు, చక్కెర కలిపిన నీటిని తాగించాలి. ఎండలో వెళ్లేవారు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను దగర్గ పెట్టుకోవడం ఉత్తమం. చిన్న పిల్లలు, వృద్ధులు,  దీర్ఘకాలిక వ్యాధుల పేషంట్లు మరింత జాగ్రతగా ఉండాలి. సాధారణంగా వడదెబ్బతో డయేరియాకు గురై డీహైడ్రేషన్‌ బారినపడే ప్రమాదం ఉంటుంది. వాంతులు, విరేచనాలు జరిగిన వెంటనే వారిని దవాఖానకు తీసుకెళ్లాలి. బాధితులకు ఓఆర్‌ఎస్‌, కొబ్బరి బోండాలు, మజ్జిగా, అంబలి వంటివి అధికంగా ఇచ్చినట్లయితే త్వరగా కోలుకుంటారు.

- డాక్టర్‌ బి.నాగేందర్‌, సూపరింటెండెంట్‌, ఉస్మానియా దవాఖాన  


logo