వెంగళరావునగర్, జూలై 18 : నిన్ను ప్రాణంగా ప్రేమించాను.. నా ప్రేమను నువ్వు నమ్మేలా లేవు.. నా చావుతోనైనా నాది నిజమైన ప్రేమని తెలుసుకుంటావు.. ఇక ఉంటా.. అంటూ సెల్ఫీ వీడియో తీసుకుని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ సైదులు కథనం ప్రకారం.. బీకేగూడలోని వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద జి.సుధాకర్ (30) తన మిత్రుడు భార్గవ్‌తో కలిసి అద్దె గదిలో ఉంటున్నాడు. ఎస్ఐ కావాలన్న ఆశతో వచ్చాడు. వయస్సు అర్హత దాటడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకొని, సాఫ్ట్వేర్ కోచింగ్ తీసుకుంటున్నాడు. మిత్రులతో కలిసి ఆన్లైన్లో కిరాణా షాఫు నిర్వహిస్తున్నాడు. ఏడాది నుంచి ఫేస్బుక్ ద్వారా పరిచయమైన ఓ యువతిని ప్రేమించసాగాడు.
ఆ యువతి సుధాకర్ ప్రేమను నిరాకరించడంతో తట్టుకోలేక పోయాడు. తీవ్ర మనస్తాపం చెందాడు. తన చావుతోనైనా తనది నిజమైన ప్రేమేనని ఆ యువతి గుర్తించాలని భావించాడు. చనిపోయే ముందు సెల్ఫీ వీడియో తీసుకుని.. రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బయటనుంచి వచ్చిన భార్గవ్ తలుపు తట్టగా తీయలేదు. కంగారుతో ఇంటి వెనుక ఉన్న కిటికీలో నుంచి చూడగా.. సుధాకర్ ఉరేసుకుని కనిపించాడు. ఎస్ఆర్నగర్ పోలీసులకు సమాచారం అందించారు. ఆత్మహత్య చేసుకున్న సుధాకర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. సుధాకర్ చిన్నాన్న జి.శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.