సోమవారం 08 మార్చి 2021
Hyderabad - Jan 18, 2021 , 06:26:58

వివిధ కారణాలతో పలువురి ఆత్మహత్య

వివిధ కారణాలతో పలువురి ఆత్మహత్య

మనస్తాపంతో జీహెచ్‌ఎంసీ ఉద్యోగి..

కాచిగూడ : చేతికొచ్చిన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని.. భార్య క్యాన్సర్‌తో బాధపడుతుందనే మనస్తాపంతో జీహెచ్‌ఎంసీ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన కాచిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్నది. అడ్మిన్‌ ఎస్సై శ్రీనివాస్‌ వివరాల ప్రకారం.. నల్లకుంట డివిజన్‌, గోల్నాకలోని కార్ఖాన లైన్‌ ప్రాంతానికి చెందిన వెంకటయ్య కుమారుడు కురమి సిద్ధప్ప(45) జీహెచ్‌ఎంసీలోని మలేరియా డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నాడు. కాగా.. గత జూన్‌ 26న కొడుకు గణేశ్‌ (21) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పటి నుంచి భార్య రాజేశ్వరికి ఆరోగ్యం బాగుండటంలేదు. అలాగే.. కొన్ని నెలలుగా క్యాన్సర్‌తో బాధపడుతుంది... ఈ క్రమంలో కొడుకు మృతి చెందడం, భార్య క్యాన్సర్‌తో బాధపడుతుండటాన్ని తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో ఈ నెల 10న ఆత్మహత్యకు యత్నించగా స్నేహితులు అడ్డుకున్నారు.  తిరిగి తెల్లవారు జామున ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు టవల్‌తో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం 6 గంటల సమయంలో భార్య రాజేశ్వరి ఇంటికి వచ్చేసరికి భర్త శవమై కనిపించాడు. సోదరుడు సతీశ్‌ ఫిర్యాదు మేరకు.. పోలీసులు, క్లూస్‌టీం ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి.. అక్కడ సిద్ధప్ప రాసిన సూసైడ్‌నోటును స్వాధీనం చేసుకున్నారు. అందులో ‘నేను చనిపోతే నా ఆస్తి తమ్ముడి బిడ్డ మానస’కు చెందాలని రాసి ఉంది. అనంతరం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా  మార్చురీకి తరలించారు. కాగా.. కొడుకు గణేశ్‌, తండ్రి సిద్ధప్ప ఒకే గదిలో ఆత్మహత్యకు పాల్పడటం స్థానికులను కలిచివేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

ఉపాధిలేక.. అప్పులు పెరిగి మనస్తాపంతో కారు డ్రైవర్‌ ఆత్మహత్య

 మన్సూరాబాద్‌, జనవరి 17: కరోనా, లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయాడు.. ఈ క్రమంలో కుటుంబ పోషణకు అప్పులు చేశాడు.. అవి పెరిగిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఎల్బీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా, డిండి మండలం, వావికోల్‌ గ్రామానికి చెందిన మబ్బు శ్రీశైలం (45) భార్య, కుమారుడు అరవింద్‌, కుమార్తె అర్చనతో కలిసి ఎల్బీనగర్‌, బైరామల్‌గూడ శ్రీసాయినగర్‌ కాలనీలో నివాసముంటున్నాడు. కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కరోనా, లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయాడు. దీంతో కుటుంబపోషణ కష్టమైంది. ఈ క్రమంలో బయట అప్పులు తెచ్చాడు. ఒకవైపు ఉపాధిలేక, మరోవైపు తెచ్చిన అప్పులు పెరిగిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. కాగా... శ్రీశైలం భార్య ఆదివారం పని నిమిత్తం ఊరికి వెళ్లగా కుమారుడు బయటకు వెళ్లాడు. కూతురు  పైగదిలో టీవీ చూ స్తుంది. ఈ క్రమంలో ఉదయం 11 గంటల సమయంలో శ్రీశైలం.. భార్య చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. పై అంతస్తు నుంచి కిందకు వచ్చిన కుమార్తె గమనించి తండ్రిని వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.  

కరోనాతో భయాందోళన.. దవాఖాన రెండో అంతస్తు నుంచి దూకి వృద్ధుడు..

మాదాపూర్‌, జనవరి 17: కరోనా సోకడంతో తీవ్ర భయాందోళనకు గురైయ్యాడు.. భయంతో దవాఖాన రెండవ అంతస్తులో నుంచి కింద కు దూకి వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మాదాపూర్‌ ఎస్సై శ్రీనివాస్‌ వివరాల ప్రకారం ... కరీంనగర్‌ జిల్లా వేములవాడకు చెందిన నారాయణ (77) ఈ నెల 13న జ్వరం, దగ్గుతో బాధపడుతుండగా కుటుం బ సభ్యులు కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయించగా కరోనా అని తేలింది. వెంటనే కొండాపూర్‌లోని కిమ్స్‌ దవాఖానకు తీసుకెళ్లారు..అక్కడ చికిత్స పొందుతూ.. ఇక్కడ ఉండటం నాకు ఇష్టంలేదని ఇంటికి వెళ్తానని చెప్పాడు.. దీంతో దవాఖానవారు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వచ్చేలోపే దవాఖాన రెండవ అంతస్తులోని కిటికిలోనుంచి కిందకు దూకాడు. తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కుటుంబ కలహాలతో వాచ్‌మన్‌..

ఉప్పల్‌, జనవరి 17 : కుటుంబ సమస్యలతో మనస్తాపానికి గురైన వాచ్‌మన్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారు.  ఉప్పల్‌ పోలీసుల వివరాల ప్రకారం.. ఉప్పల్‌లోని ఆదర్శనగర్‌లో సందీప్‌(30.. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. స్థానికంగా వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు.. కాగా.. కొంతకాలంగా జరుగుతున్న కుటుంబ కలహాలతో తీవ్ర మనస్తాపానికి గురైయ్యాడు.. ఈ క్రమంలో ఇంట్లో ఎవరులేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.  

అనారోగ్యంతో వాచ్‌మన్‌..

గోల్నాక, జనవరి 17: అనారోగ్యంతో ఓ వాచ్‌మన్‌ బలవన్మరణానికి  పాల్పడ్డాడు. అంబర్‌పేట ఎస్సై లింగం వివరాల ప్రకారం..బాగ్‌అంబర్‌పేట, తురాబ్‌నగర్‌కు చెందిన రాములుగౌడ్‌ (60)కు భార్య,  ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు. డీడీ కాలనీలోని ఓ ఆపార్ట్‌మెంట్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. కాగా.. కొంతకాలంగా గొంతు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు.. ఎంతకీ తగ్గకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై.. తాను పనిచేసే అపార్ట్‌మెంట్‌లోని ఓ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.   

VIDEOS

logo