e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, May 18, 2021
Home హైదరాబాద్‌ ఊరిలోనే ఉండొచ్చు.. ఉద్యోగం కొట్టొచ్చు

ఊరిలోనే ఉండొచ్చు.. ఉద్యోగం కొట్టొచ్చు

ఊరిలోనే ఉండొచ్చు.. ఉద్యోగం కొట్టొచ్చు
  • ప్రతి నియోజకవర్గానికో స్టడీ సెంటర్‌
  • జూన్‌ రెండు లోగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వ నిర్ణయం
  • ఆ దిశగా చర్యలు చేపట్టిన అధికారులు
  • పేద విద్యార్థులకు తప్పనున్న ఆర్థిక భారం

ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే పట్నం బాట పట్టాల్సిందేనన్న భావన ప్రతిఒక్కరిది. అందుకు కారణం లేకపోలేదు. నగరంలో అయితే నిపుణుల సూచనలు, సలహాలు పొందే అవకాశం ఉంటుందని నిరుద్యోగుల ఆలోచన. ఆర్థికంగా బాగున్నవారు సుదూర ప్రాంతాలకు వెళ్లి పోటీ పరీక్షలకు తర్ఫీదు పొందు తారు. కానీ ఎటొచ్చి పేద విద్యార్థుల పరిస్థితే అగమ్యగోచరం. పట్నం పోలేక, ఉన్న ఊరిలో శిక్షణ పొందలేక సతమతమవుతుంటారు. ఇలాంటి అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. నియోజకవర్గానికో స్టడీ సెంటర్‌ను ఏర్పాటు చేసి ఉచిత శిక్షణ ఇప్పించేందుకు సన్నాహాలు చేస్తున్నది. జూన్‌ రెండు కల్లా ఈ ప్రక్రియను పూర్తి చేసే లక్ష్యంతో అధికార యంత్రాంగం ముందుకు సాగుతుండగా, ప్రభుత్వ నిర్ణయంపై యువత హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నది.

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే తీవ్రంగా శ్రమించాల్సిందే. అందుకు తగ్గ శిక్షణ, నైపుణ్యాలను పెంచుకోవాల్సిందే. ఇందుకోసం పట్నం బాట పట్టాల్సిందే. అక్కడ అద్దెకు లేదంటే వసతి గృహాల్లో ఉంటూ కోచింగ్‌ సెంటర్ల చుట్టూ తిరుగుతూ ఉద్యోగ సాధనే ధ్యేయంగా అవిశ్రాంతంగా శ్రమించాల్సిందే. ఇదంతా ఆర్థికంగా ఎంతో భారాన్ని మోపుతుంది. దీన్ని భరించలేని పేద విద్యార్థులు కొందరు అభద్రతకు లోనవుతూ మానసిక వేదనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిభ ఉన్న పేద యువతీయువకులకు ప్రభుత్వం ఇప్పటికే ఉచిత శిక్షణ అందిస్తున్నది. ఇందుకోసం ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ స్టడీ సర్కిళ్లతో పాటు ఎస్సీ, ఎస్టీ సర్కిళ్లను కూడా ఏర్పాటు చేసింది.

జాతీయ, రాష్ట్రస్థాయి పోటీ పరీక్షలకు తర్ఫీదు..

బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టడీ సర్కిళ్ల ద్వారా ఆయా వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు ప్రభుత్వం ఉచిత శిక్షణను అందిస్తున్నది. జాతీయస్థాయిలో సివిల్స్‌, ఎస్‌ఎస్‌సీ, బ్యాంక్‌ ఉద్యోగాల సాధనకు, అదేవిధంగా రాష్ట్రస్థాయిలో నిర్వహించే అన్ని గ్రూప్‌ పరీక్షలు, డీఎస్సీ, సింగరేణి, పోలీస్‌ ఉద్యోగాలకు సన్నద్ధం చేస్తున్నది. అంతేకాక ఉచిత భోజనం, వసతిని కల్పిస్తున్నది. నిపుణులతో సలహాలు, సూచనలు ఇప్పిస్తూ ఉద్యోగ సాధనలో పాటించాల్సిన మెళకువలపై అవగాహన పెంచుతున్నది. వీటితో పాటు స్టడీ మెటీరియల్‌, ఉపకార వేతనాలనూ అందిస్తున్నది.

పారిశ్రామిక అవసరాలకూ..

పోటీ పరీక్షలకే కాకుండా యువశక్తిని పారిశ్రామిక, ఉత్పత్తి రంగాల్లో వినియోగించేలా స్టడీ సెంటర్ల ద్వారా ప్రభుత్వం శిక్షణ ఇప్పిస్తున్నది. అత్యధికంగా ఉపాధి అవకాశాలను కల్పిస్తున్న సేవా రంగానికి కావాల్సిన నిపుణులను తీర్చిదిద్దుతున్నది. అంతేకాక స్పోకెన్‌ ఇంగ్లిష్‌, సాఫ్ట్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ తదితర అంశాల్లో ప్రత్యేక శిక్షణను ఇప్పిస్తూ రాష్ట్రంలోని యువతను ఉత్పత్తి శక్తిగా మారుస్తున్నది.

నియోజకవర్గానికో సెంటర్‌..

రాష్ట్రంలో మొదటగా 1994లో వరంగల్‌ వేదికగా స్టడీ సర్కిల్‌ ఏర్పాటైంది. అనంతరం 1996లో హైదరాబాద్‌లో నెలకొల్పారు. ఆ తర్వాత ఏడు ఉమ్మడి జిల్లా కేంద్రాలకు వీటిని విస్తరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తంగా 11 బీసీ స్టడీ సర్కిళ్లు ఉన్నాయి. అయితే వీటిల్లో నాణ్యమైన ఉచిత శిక్షణ, భోజన సౌకర్యాలు కల్పిస్తుండటంతో ఉద్యోగార్థుల నుంచి విపరీతమైన పోటీ నెలకొన్నది. అర్హత పరీక్షను నిర్వహించి నియమిత సంఖ్యలోనే అభ్యర్థులను ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించి ఆ దిశగా సన్నాహాలు చేస్తున్నది. జూన్‌ రెండు లోగా ప్రక్రియ పూర్తి కావాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో నియోజకవర్గ కేంద్రాల్లో స్టడీ సర్కిళ్ల ఏర్పాటుకు అనువైన కళాశాలలు, లైబ్రరీలు తదితర వాటి అన్వేషణలో అధికారులు నిమగ్నమయ్యారు.

పేద అభ్యర్థులకు ఎంతో లబ్ధి..

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో నిరుపేద ఉద్యోగార్థులకు ఎంతో లబ్ధి చేకూరనున్నది. ఇప్పటివరకు సాధారణంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు చాలా మంది యువతీయువకులు పట్టణాలకు వెళ్లాల్సి వచ్చేది. అక్కడ ఇద్దరు ముగ్గురు కలిసి రూములు అద్దెకు తీసుకోవడం, లేదంటే వసతి గృహాల్లో ఉండేవారు. ప్రైవేట్‌ ఇనిస్టిట్యూట్లలో శిక్షణ తీసుకునేవారు. ఇది ఉద్యోగార్థులకు ఆర్థికంగా ఎంతో భారంగా మారుతున్నది. ఆర్థిక స్థోమత అంతగా లేని యువతీయువకులు ప్రిపరేషన్‌ను మధ్యలోనే వదిలేసి ఇండ్లకు వెళ్తుండగా, కొందరు అప్పులు చేసి మరీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వారందరికీ ఆర్థిక భారం తప్పనుంది. పల్లెలను విడిచి పట్టణాలకు వెళ్లాల్సిన పనిలేకుండా పోయింది. అదీగాక కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఒడిదొడుకులతో చదువును కొనసాగించలేక కుల వృత్తులు చేసుకుంటూ పల్లెలకే పరిమితమైన యువతకు ఇది వరంగా మారనుంది.

జూన్‌ రెండు లోగా ఏర్పాటు చేస్తాం..

నియోజకవర్గానికి ఒక స్టడీ సర్కిల్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నాం. త్వరలో నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉండటంతో ప్రతి నియోజకవర్గంలో స్టడీ సెంటర్లను ఏర్పాటు చేసి యువతకు శిక్షణ ఇస్తాం. ప్రభుత్వ నిర్ణయంతో పేద విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరడం ఖాయం. – బాలాచారి, డైరెక్టర్‌, హైదరాబాద్‌ బీసీ స్టడీ సర్కిల్‌

Advertisement
ఊరిలోనే ఉండొచ్చు.. ఉద్యోగం కొట్టొచ్చు
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement