పట్టుకోలేరనుకున్నాడు..

వివాహితను లైంగిక కోరికలు తీర్చమని వేధిస్తున్న ఓ విద్యార్థిని బుధవారం రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోచారం గ్రామానికి చెందిన భరత్ తన ఇంటి పక్కన ఉండే వివాహితపై కన్నేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో లోపలికి ప్రవేశించి లైంగిక వాంఛ తీర్చమని బలవంతం చేశాడు. దీంతో ఆ గృహిణి అతడిని బయటికి గెంటేసింది. ఇది మనస్సులో పెట్టుకుని ప్రైవేటు నంబర్ అని డిస్ప్లే అయ్యే విధంగా ఓ యాప్ నుంచి వర్చువల్ నంబరును ఏడాదికి రూ.3400 చెల్లించి తీసుకున్నాడు. తరచూ ఈ నంబర్ల ద్వారా ఫోన్ చేసి తన కోరిక తీర్చమని వేధించడం మొదలు పెట్టాడు. బాధిత గృహిణి భర్తకు కూడా అశ్లీల, అసభ్యకరమైన మెసేజ్‌లు పంపిస్తూ ఇబ్బంది పెడుతున్నాడు. దీనిపై ఆందోళనకు గురైన బాధితురాలు రాచకొండ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. పోలీసు అధికారులు సాంకేతిక క్లూస్‌తో నిందితుడు భరత్‌గా గుర్తించి అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.