శుక్రవారం 05 జూన్ 2020
Hyderabad - May 20, 2020 , 00:36:25

కాలుష్యం వెదజల్లే పరిశ్రమలపై కఠిన చర్యలు

కాలుష్యం వెదజల్లే పరిశ్రమలపై కఠిన చర్యలు

హైదరాబాద్ : నిబంధనల ప్రకారం నడుచుకోని పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకుంటామని టీపీసీబీ మెంబర్‌ సెక్రటరీ నీతూ కుమారి ప్రసాద్‌ హెచ్చరించారు. జాయింట్‌ చీఫ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీర్స్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి రీజనల్‌ ఆఫీసర్స్‌తో మంగళవారం జరిగిన సమావేశంలో  పరిశ్రమలపై ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై ఆమె చర్చించారు. ప్రధానంగా కూకట్‌పల్లి, మియాపూర్‌, తెల్లపూర్‌,నాచారం తదితర ప్రాంతాల్లోనిఅపార్ట్‌మెంట్‌ వాసులు పరిశ్రమల కారణంగా వచ్చే మురుగు వాసనతో ఇబ్బందులు పడుతున్నారు. 

జీడిమెట్ల,మల్లాపూర్‌ పారిశ్రామిక ప్రాంతాల్లో నాలాలు వ్యర్థాలతో నిండిపోవడం వల్ల వచ్చే మురుగు వాసనతో జనం అల్లాడిపోతున్నారు. ఈ పరిస్థితిపై పీసీబీ మెంబర్‌ సెక్రటరీ నీతూ కుమారి ప్రసాద్‌ ఆరా తీశారు. పరిశ్రమలు నిబంధనలను అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్‌ ఆదేశించినట్టుగా ఆమె వివరించారు. పారిశ్రామిక వాడల్లో 24 గంటలు అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదుకు జవాబుదారీగా ఉండాలని రీజనల్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

    అన్ని ఫార్మా, కెమికల్‌, వాటర్‌ పొల్యూటింగ్‌ ఇండస్ట్రీలు తప్పనిసరిగా ప్రధాన ద్వారం వద్ద పరిసరాలు కవర్‌ అయ్యేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకో వాలని సూచించారు. కాలుష్యానికి సంబంధించి ఫిర్యాదులు చేయాలంటే టోల్‌ ఫ్రీ నంబర్‌ 10471కు ఫోన్‌ చేసి తెలియజేయొచ్చని ఆమె పేర్కొన్నారు. logo