ఆదివారం 17 జనవరి 2021
Hyderabad - Aug 18, 2020 , 23:55:34

ఇంట్లోనే ఉంటూ.. వైరస్‌ను గెలిచా..

ఇంట్లోనే ఉంటూ..  వైరస్‌ను గెలిచా..

 గొంతునొప్పితో మొదలు..

పాజిటివ్‌ రాగానే.. 

కరోనా రావడం.. ఇప్పుడు సహజం

 ధైర్యంగా ఉంటే.. మహమ్మారిని జయించవచ్చు

కరోనా విజేత ప్రసాద్‌కుమార్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ : కరోనా వచ్చినప్పుడు తీవ్ర ఒత్తిడికి లోనై స్నేహితులు, డాక్టర్ల సూచనలతో ధైర్యంగా వైరస్‌ను జయించిన వారు ఎందరో ఉంటున్నారు. కరోనా వస్తే అంతా అయిపోయినట్లే కాదని వారు అనుభవంతో చెబుతున్నారు. 

హైదరాబాద్‌లోని ఆదర్శనగర్‌లో ఉండే ఆర్‌.ప్రసాద్‌కుమార్‌(35)కు గత నెల 8న గొంతు నొప్పి మొదలైంది. రెండు రోజుల తర్వాత ఇంకా పెరిగింది. అనుమానంతో టెస్ట్‌ చేయించుకుంటే 10న పాజిటివ్‌గా రిపోర్టు వచ్చింది. అప్పుడు ప్రసాద్‌ తీవ్రంగా ఆందోళన చెందాడు. నిర్మాణరంగంలో ఉన్న ప్రసాద్‌ కరోనాకు ముందే భారీగా పెట్టుబడులు పెట్టి కొత్త వాటిని మొదలుపెట్టాడు. జీవితం ఎలా అనే అంతగా నైరాశ్యంలోకి వెళ్లాడు. ఇంట్లోని 60 ఏండ్లు దాటిన తల్లిదండ్రులు, 10 ఏండ్లలోపు పిల్లలకు వస్తే ఏమిటని ఆందోళనపడ్డాడు. దగ్గరి స్నేహితులకు ఫోన్‌ చేసి ఏడ్చాడు. 

అండగా నిలిచిన స్నేహితుడు

ప్రసాద్‌ పరిస్థితిని అర్థం చేసుకున్న ఒక స్నేహితుడు వెంటనే స్థానికంగా ఉండే గవర్నమెంట్‌ డాక్టర్‌ వి.ఎస్‌.విజేందర్‌కు ఫోన్‌ చేసి ప్రసాద్‌ పరిస్థితిని వివరించాడు. డాక్టర్‌ వెంటనే ప్రసాద్‌కు అవసరమైన మందుల లిస్టును వాట్సాప్‌ చేశాడు. వాటిని కొని ప్రసాద్‌ ఇంట్లో ఇచ్చాడు. ప్రసాద్‌ అప్పటికే తన ఇంట్లోని పైఅంతస్తులోని ఓ రూంలో ఐసోలేషన్‌లో ఉన్నాడు. మొదటిరోజు రాత్రి ప్రసాద్‌ నిద్రపోలేదు. తర్వాత రోజు పొద్దున్నే ప్రసాద్‌లో కొంచెం ధైర్యం వచ్చింది. డాక్టర్‌తో అతనే డైరెక్టుగా ఫోన్‌ చేసి మాట్లాడాడు. వేసుకునే మందులు, తినే ఆహారం వివరాలను అడిగి రాసుకున్నాడు. సరిగ్గా వారం తర్వాత టెస్టు చేసుకుంటే నెగిటివ్‌ రిపోర్టు వచ్చింది. 

నెల క్రితం పరిస్థితి ఇలా లేదు..!

‘కరోనా ఇప్పుడు మన చుట్టు పక్కల ఉండే చాలా మందికి వస్తున్నది. నెల క్రితం పరిస్థితి ఇలా లేదు. అప్పుడు కరోనా వచ్చిన వారిని ఇరుగుపొరుగు వారు ఒకరకంగా చూసేవారు. నేనూ ఆ పరిస్థితిని ఎదుర్కొన్నా. లాక్‌డౌన్‌ నుంచి వీలైనన్ని జాగ్రత్తలు తీసుకున్నా. ఎలా సోకిందో ఇప్పటికీ తెలియడంలేదు. పాజిటివ్‌ అని తెలియగానే ఏమీ అర్థం కాలేదు. బాగా డిప్రెషన్‌లోకి వెళ్లిన. ఫ్రెండ్స్‌తోనే కొంచెం ధైర్యం వచ్చింది. నా పరిస్థితి చెప్పినంక డాక్టర్‌ ఏమీకాదని చెప్పడంతో మరింత ధైర్యం పెరిగింది. కుటుంబ సభ్యులకు వస్తుందని భయపడ్డా. అదృష్టవశాత్తు ఎవరికీ లక్షణాలు రాలేదు. నాకు గొంతు నొప్పి లక్షణాలు మొదలుకాగానే ఐసోలేషన్‌ అయ్యా. దీంతో ఇంట్లో వాళ్లకు వైరస్‌ సోకలేదని అనుకుంటున్నా. కరోనా రావడం ఇప్పుడు సహజం. మానసికంగా గట్టిగా ఉండాలని నా అనుభవంతో చెబుతున్నా’ అని ప్రసాద్‌ తన అనుభవాలను వివరించాడు.