ఆదివారం 25 అక్టోబర్ 2020
Hyderabad - Oct 01, 2020 , 06:34:58

రహదారుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు.. ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌

రహదారుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు.. ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌

అంబర్‌పేట/గోల్నాక : అంబర్‌పేట నియోజకవర్గం వ్యాప్తంగా ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ తెలిపారు. ఇందుకు సంబంధించి పనులు వేగవంతం చేశామన్నారు. బుధవారం అంబర్‌పేట డివిజన్‌ బాపునగర్‌లో రూ.32 లక్షల వ్యయంతో కొత్తగా ఏర్పాటు చేస్తున్న సీసీ రోడ్డు ఏర్పాటు పనులను కార్పొరేటర్‌ పులి జగన్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..అభివృద్ధి పనుల్లో ఖచ్చితంగా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులకు సూచించారు. నియోజకవర్గ వ్యాప్తంగా మౌలిక వసుతుల కల్పనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. ఇందులో భాగంగా  రహదారుల అభివృద్ధి, ఫుట్‌పాత్‌ల సుందరీకరణ, మురుగు, మంచినీటి పైపులైన్ల ఆధునీకరణ తదితర అభివృద్ధి పనులు వేగవంతం చేశామని తెలిపారు. అనంతరం స్థానిక కార్పొరేటర్‌ పులి జగన్‌తో పాటు పలు శాఖల అధికారులతో కలసి బాపునగర్‌లో పాదయాత్ర నిర్వహించారు. స్థానికుల సమస్యలను తెలుసుకున్నారు. తన దృష్టకి వచ్చిన సమస్యలు  వెంటనే పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు జి.మల్లేశ్‌యాదవ్‌, నాయకులు లవంగు ఆంజనేయులు, విజయ్‌కుమార్‌గౌడ్‌, యాసిన్‌, సిద్ధార్థ్‌ముదిరాజ్‌,  ప్రవీణ్‌, మల్లికార్జున్‌యాదవ్‌, రామారావు, మెట్టు ధన్‌రాజ్‌, లవంగు నాగరాజు, వంజరి నాగరాజు, జాకీబాబు తదితరులు పాల్గొన్నారు. 

 58, 59  జీవోలపై అవగాహన.... 

అంబర్‌పేట : జీవో నెంబర్‌ 58, 59 ప్రకారం రెగ్యులరైజ్‌ కానీ స్థలాలను రెగ్యులరైజ్‌ అయ్యేలా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌, రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు ఏవైనా సమస్యలు ఉన్నా వాటి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. గోల్నాక డివిజన్‌ మారుతీనగర్‌ వాసులతో బుధవారం ఉదయం ఎమ్మెల్యే ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 58, 59 ల కింద క్రమబద్ధీకరణ జరగని ఇండ్లను ఇప్పుడు క్రమబద్ధీకరించుకోవడానికి తగిన చర్యలు తీసుకుంటానని తెలిపారు. మారుతీనగర్‌లో ఈ జీవోల పరిధిలోకి వచ్చే ఇండ్ల జాబితాను తయారు చేసి తనకు ఇవ్వాలన్నారు. అలాగే బస్తీలో ప్రధానంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బస్తీలో మంచినీటి లోఫ్రెషర్‌, డ్రైనేజీ-వరదనీరు కలిసి పారుతుండటంతో బస్తీవాసులు పడుతున్న ఇబ్బందులను వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఆ సమస్యలపై తనకు అవగాహన ఉందని, వర్షపునీరు వెళ్లే నాలాలో పైపులైన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అందుకు నిధులు కూడా మంజూరయ్యాయని తెలిపారు. డ్రైనేజీ, మంచినీటి సమస్యల పరిష్కారానికి ప్రతిపాదనలు తయారు చేసి మంజూరుకు పంపించడం జరిగిందని, నిధులు మంజూరైన వెంటనే పనులు మొదలు పెడతామన్నారు. అంబర్‌పేట మెయిన్‌రోడ్డు శ్రీరమణ చౌరస్తా నుంచి అలీకేఫ్‌ వరకు పెద్ద వరదనీటి పైపులైన్‌ ఏర్పాటు చేయడంతో మారుతీనగర్‌లో వరదనీటి సమస్య చాలా వరకు తగ్గిందన్నారు. త్వరలోనే అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులను తీసుకువచ్చి బస్తీలో సమావేశం పెడతానని, ఆ రోజు బస్తీవాసులంతా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో బస్తీవాసులు ఎన్‌.లింగంయాదవ్‌, పి.మధుసూదన్‌, దేవేందర్‌, కొమ్ము శ్రీను, మాధవరెడ్డి, కె.కుమార్‌, భూపతి, కమల్‌రాజ్‌, పి.శ్రీనివాస్‌, ధర్మేందర్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo