మంగళవారం 27 అక్టోబర్ 2020
Hyderabad - Oct 18, 2020 , 10:06:14

గ్రేటర్‌ వ్యాప్తంగా అంటువ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు

గ్రేటర్‌ వ్యాప్తంగా అంటువ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు

  • ప్రజల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు
  • వరద ప్రభావిత ప్రాంతాల్లో కరపత్రాల పంపిణీ

సిటీబ్యూరో,నమస్తే తెలంగాణ: ఇటీవల కురిసిన వానల వల్ల తలెత్తిన వరదల కారణంగా అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఉండడంతో అప్రమత్తమైన వైద్య, ఆరోగ్యశాఖ ఔట్‌రీచ్‌ క్యాంపులను ఏర్పాటు చేసింది. వరద బాధితులతో పాటు సాధారణ ప్రజలు అంటువ్యాధులకు గురవకుండా ఉండేందుకు వైద్యాధికారులు ముందస్తు చర్యలను ముమ్మరం చేశారు. ముఖ్యంగా వరదలు వచ్చిన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాల ద్వారా స్థానికులు, వరద బాధితులకు వైద్యసేవలు అందిస్తున్నట్లు హైదరాబాద్‌ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ వెంకటి తెలిపారు. ఇప్పటికే గ్రేటర్‌ వ్యాప్తంగా 208ప్రత్యేక వైద్యశిబిరాలను ఏర్పాటు చేయగా నగరంలో అదనంగా ఔట్‌రీచ్‌ క్యాంపులను ఏర్పాటు చేసి అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నారు. వరదల వల్ల చాలా ప్రాంతాల్లో రహదారులు, వీధులు, చిన్నపాటి గల్లీలు ఇలా పరిసరాలన్నీ అపరిశుభ్రంగా మారడం, నీట మునిగిన నివాసాలు సైతం వరదతో తడిసిపోవడం వల్ల ఇన్‌ఫెక్షన్స్‌ ఏర్పడడం, అంటువ్యాధులు ప్రబలడం, దోమలు వృద్ధిచెందే అవకాశాలుండడంతో వైద్య,ఆరోగ్యశాఖతో సహా జీహెచ్‌ఎంసీ, ఇతర ప్రభుత్వ యంత్రాంగం వరదకు గురైన పురవీధులన్నీ దాదాపు శుభ్రం చేశాయి. అయితే ప్రజలు కూడా తమ వంతు పరిశుభ్రత పాటించాలని, అంటువ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఏ చిన్న ఆనారోగ్య సమస్య వచ్చినా వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆరోగ్యకేంద్రంగాని లేదా ఔట్‌రీచ్‌ హెల్త్‌క్యాంపులను  ఆశ్రయించాలంటూ హైదరాబాద్‌  జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కరపత్రాలతో ఇంటింటి ప్రచారం చేస్తూ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు డాక్టర్‌ వెంకటి తెలిపారు. నగరంలోని 85పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 12ఏరియా దవాఖానలు, గ్రేటర్‌ పరిధిలోని 190బస్తీ దవాఖానలతో పాటు 208ప్రత్యేక వైద్యశిబిరాలు, ఔట్‌రీచ్‌ హెల్త్‌క్యాంపులలో సీజనల్‌, అంటువ్యాధులకు వైద్యసేవలను అందుబాటులో ఉంచినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లా పరిధిలో సైతం అ న్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో వైద్యసేవలను అందుబాటులో ఉంచినట్లు వివరించారు. ముంపుగు గురైన ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంపులు, మొబైల్‌ వ్యాన్‌ద్వారా వైద్యసేవలను అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.  అంటువ్యాధులకు గురైన రోగులకు చికిత్స చేయడంతో పాటు వ్యాధులు ఒక ప్రాంతం ను ంచి మరో ప్రాంతానికి ప్రబలకుండా ఉండేందుకు కూడా అన్నిరకాల ముందస్తు చ ర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. 

ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు

వర్షాలతో పాటు వరదల కారణంగా నగరంలో అంటువ్యాధులు ప్రబలే అవకాశాలున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అన్నిరకాల ముందుజాగ్రత చర్యలు తీసుకున్నది. ప్రస్తుతం ఉన్న ఆరోగ్యకేంద్రాలు కాకుండా అదనంగా ప్రత్యేక వైద్యశిబిరాలను ఏర్పాటు చేసి వైద్యసేవలను మరింత విస్తృతం చేసింది. ప్రజలు తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. ఒక పక్క కరోనా మరో పక్క ప్రకృతి విపత్తులు వల్ల ఏర్పడిన వరదలు వాటి వల్ల అంటువ్యాధుల ముప్పు పొంచిఉంది. కరోనా నియమాలు పాటించాలి. మాస్కు లేనిదే బయటకు రావద్దు. ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా, కరోనా లక్షణాలు కనిపించినా వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. ప్రభుత్వ దవాఖానల్లో అన్ని రకాల పరీక్షలు పూర్తి ఉచితంగా అందుబాటులో ఉన్నాయి.ప్రైవేటు దవాఖానలకు వెళ్లి ఆర్థిక ఇబ్బందులు కొనితెచ్చుకోవద్దు.  -డాక్టర్‌ వెంకటి, వైద్య, ఆరోగ్యశాఖ అధికారి, హైదరాబాద్‌ 


logo