మంగళవారం 20 అక్టోబర్ 2020
Hyderabad - Sep 12, 2020 , 04:06:59

కొడుకు, భర్త దూరమై అనాథగా ‘ఆమె’

కొడుకు, భర్త దూరమై అనాథగా ‘ఆమె’

ఖైరతాబాద్‌ : చేతికొచ్చిన కొడుకు... తోడుగా నిలవాల్సిన భర్త... ఇద్దరూ దూరమై ఆ తల్లి అనాథగా మిగిలింది. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్న ఈ హృదయవిదారకమైన ఘటన అందరినీ కలిచి వేసింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఆ కుటుంబాన్ని పరోక్షంగా కబళించింది. లాక్‌డౌన్‌ కారణంగా వ్యాపారం నడువక.. తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన ఎ. అనీశ్‌ రెడ్డి మరణంతో కడుపుకోతను అనుభవించిన ఆ తల్లికి.. పసుపుకుంకుమలు దూరమయ్యాయి. కొడుకు చితిమంటలు ఆరకముందే కట్టుకున్న భర్త కూడా మరణించడంతో ఆమె దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.

నిన్న కొడుకు.. నేడు భర్త...

ఎర్రమంజిల్‌లోని హిల్‌టాప్‌ కాలనీకి చెందిన శ్రావణి రెడ్డి, రామిరెడ్డి దంపతుల కుమారుడు ఎ. అనీశ్‌ రెడ్డి నగరంలోని పలు ఐటీ కంపెనీల్లో క్యాంటీన్లు నిర్వహిస్తుంటాడు. కరోనా నేపథ్యంలో ఆర్నేళ్లుగా వ్యాపారం పూర్తిగా నిలిచిపోగా, సరైన ఆదాయం లేక తీవ్ర మనస్తాపంతో పాటు మానసిక ఒత్తిడితో సతమతమవుతున్నాడు. ఉన్న ఆసరా పోవడంతో జీవితంపై విరక్తి చెంది తల్లిదండ్రులకు విషమిచ్చి తాను తనువుచాలించాలనుకున్నాడు. అదే క్రమంలో ఓ విషం బాటిల్‌తో ఇంటికి వచ్చిన అనీశ్‌ రెడ్డి కరోనా మందని నమ్మించాడు. తండ్రి, తల్లిని సైతం తాగాలని పురమాయించాడు. తల్లి వంట పని ఉందని వంటింట్లోకి వెళ్లగా, తండ్రి రామిరెడ్డి ఆ మందును తాగగా, కొద్ది సేపటికే అనీశ్‌ రెడ్డి సైతం ఆ మందును తాగాడు. అర్ధగంట తర్వాత తల్లి వంటింట్లో నుంచి వచ్చి చూడగా, తండ్రి, కొడుకులిద్దరూ అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. చుట్టు పక్కల వారి సాయంతో వారిద్దరిని సోమాజిగూడలోని ఓ ప్రైవేట్‌ దవాఖానకు తరలించగా, కొడుకు అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. తండ్రి రామిరెడ్డి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా, చికిత్స అందించారు. అయినా ఫలితం లేకుండాపోయింది. పరిస్థితి విషమించడంతో రామిరెడ్డి (61) మరణించాడు. ఒక్కగానొక్క కొడుకును పోగొట్టుకొని పుట్టెడు దుఖంలో ఉన్న శ్రావణి రెడ్డి.. భర్త కూడా మరణించడంతో జీర్ణించుకోలేకపోతున్నది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


logo