గురువారం 03 డిసెంబర్ 2020
Hyderabad - Jun 10, 2020 , 00:25:37

నాలా సమస్య పరిష్కారానికి చర్యలు

నాలా సమస్య పరిష్కారానికి చర్యలు

సికింద్రాబాద్‌:  వర్షాకాలం వచ్చిందటే  చాలు రోడ్డుపై నిలిచిన నీరు ఇండ్లలోకి చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. దీంతో డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుగౌడ్‌  ముందస్తుగా రానున్న వర్షాకాలంలో నాలాలు పొంగిపొర్లకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తున్నారు.  గతంలో వర్షాకాలం వచ్చిందంటే ఇండ్లల్లోకి వరదనీరు చేరి  కంటిమీద కునుకులేకుండా చేసేది. పద్మారావు గౌడ్‌ ఆదేశాల మేరకు అధికారులు తీసుకుంటున్న చర్యలతో గత రెండు సంవత్సరాలుగా నాలా పరివాహక ప్రాంత ప్రజలు  ఎలాంటి ఆందోళన చెందకుండా నిద్రించగలుగుతున్నారు.

అదేవిధంగా ప్రతి సంవత్సరం డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుగౌడ్‌ అప్రమత్తంగా ఉంటూ, అధికారులను నిత్యం పనుల్లో ఉండే విధంగా చేస్తున్నారు.  మూడు రోజుల కిందట డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌ మాన్‌సూన్‌ సందర్భంగా  అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి ప్రజలకు ఇబ్బందులు కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టమైన  ఆదేశాలు ఇచ్చారు. సికింద్రాబాద్‌ నియోజకవర్గానికి ప్రధాన సమస్యగా మారిన లాలాపేట్‌, మహ్మద్‌గూడ నాలాల వల్ల వర్షాకాలం వచ్చిందంటేనే  వణికిపోయే పరిస్థితులు ఉండేవి.  డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుగౌడ్‌ చొరవతో నాలా సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తున్నారు. 

భారీవర్షాలు కురిసినప్పుడు....

వరదనీటి సమస్య పరిష్కారానికి ఎన్ని చర్యలు చేపట్టినా  భారీ వర్షాలు కురిసిన సమయంలో కొన్నిసార్లు వరద సమస్యలు తప్పడం లేదు. ముఖ్యంగా       జీహెచ్‌ఎంసీ  సిబ్బంది సంవత్సరంలో ఒకసారి మాత్రమే నాలాలోంచి సిల్ట్‌ తీయడం,  కేవలం కొన్ని రోజుల్లోనే తిరిగి సిల్ట్‌ నిండటంతో  భారీ వర్షాలు వచ్చినప్పుడు నాలాలో వరద నీరు నిండి వీధుల్లోకి వస్తున్నాయి. ఇలాంటి సమస్యను పరిష్కరించడం కోసం లాలాపేట్‌లో రూ. 4కోట్లతో కల్వర్టును నిర్మించారు.  ఈ కల్వర్టు నిర్మాణం పూర్తికావడంతో  వరదనీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమైంది.  అయితే భారీ వర్షాలు కురిస్తే మాత్రం ఇబ్బందులు పడాల్సి వస్తుందని డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌  తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. 

వారానికోసారి సిల్ట్‌ తొలగింపు..

వరదనీరు నాలాల్లో  నుంచి వెళ్లడంతో తరచూ  సిల్ట్‌ నిండి వరదనీరు వీధుల్లోకి వస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ అధికారులు సంవత్సరంలో ఒకసారి మాత్రమే సిల్ట్‌ను తొలగిస్తుండటంతో పెద్దగా ఫలితం ఉండడం లేదు.  కొన్నిరోజుల కిందట పద్మారావు లాలాపేట్‌, సిరిపురి కాలనీ, చంద్రబాబునగర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు నాలాలో  సిల్ట్‌ నిండటం వల్లే ఇబ్బందులు వస్తున్నాయని పద్మారావుకు తెలిపారు. దీంతో అప్పటికప్పుడు జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్‌ అధికారులను పిలిపించి వర్షాకాలంలో ప్రతీ వారం వసంతపురి కాలనీ నుంచి లాలాపేట్‌ వరకు సిల్ట్‌ తీయాలని అధికారులను ఆదేశించారు. 

ఎంతైనా ఖర్చు చేస్తాం..

వరద నీటి సమస్యను పరిష్కరించడం కోసం ఎంతైన  ఖర్చు  చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అధికారులు అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షాకాలం ముగిసే వరకు అవసరమైన ప్రతిసారి నాలాలోంచి పూడికతీతను తొలగించాలని అధికారులను ఆదేశించాం.  ప్రజల ఇబ్బందులను తొలగించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే  చర్యలు తప్పవు. - టీ. పద్మారావు గౌడ్‌,డిప్యూటీ స్పీకర్‌