శనివారం 05 డిసెంబర్ 2020
Hyderabad - Aug 17, 2020 , 01:07:15

సౌర విద్యుత్‌.. శాశ్వత భరోసా..

సౌర విద్యుత్‌.. శాశ్వత భరోసా..

ఖర్చు తక్కువ.. మన్నిక ఎక్కువ..

సోలార్‌ సో బెటర్‌ అంటున్న నగరవాసులు.. పెరుగుతున్న వినియోగం 

తోడవుతున్న ప్రభుత్వ ప్రోత్సాహకాలు.. అనుకూలంగా భౌగోళిక పరిస్థితులు

ఉస్మానియా యూనివర్సిటీ:  సౌర విద్యుత్‌తో నగరం దేదీప్యమానంగా వెలిగిపోతున్నది.  కరెంటు చార్జీలు కూడా ఆదా అవుతుండటంతో వీటి వినియోగం క్రమంగా పెరుగుతున్నది. ఒకసారి పలకలు ఏర్పాటు చేసుకుంటే.. అవి ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. మరమ్మతులు కూడా అవసరం ఉండదు. దీంతో సోలార్‌..సో బెటర్‌ అంటున్నారు నగరవాసులు. దీనికితోడు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలతో గృహ, వాణిజ్య అవసరాలకు సౌరశక్తిని చక్కగా వినియోగించుకుంటున్నారు.

తగ్గనున్న విద్యుత్‌ చార్జీల భారం..  

ఒక కిలోవాట్‌ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్‌ పలకలను ఏర్పాటు చేసుకునేందుకు అన్ని ఖర్చులు కలిపి (నాలుగు గంటల పాటు బ్యాకప్‌ ఇవ్వగలిగిన బ్యాటరీలతో సహా) రూ.75,000 ఖర్చవుతుంది. ఈ ప్లాంట్‌తో సంవత్సరానికి 1,460 యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది. ఏటా సుమారు   రూ. 10 వేల వరకు ఆదా చేసుకోవచ్చు.

వ్యవసాయ అవసరాలకు..

వ్యవసాయ అవసరాలకు సంబంధించి ఇప్పటికే  రైతులు తమ వ్యవసాయ క్షేత్రాల్లో సోలార్‌ పలకలను ఏర్పాటు చేసుకుంటున్నారు. పొలాలకు నీటి సరఫరా కోసం వినియోగించే సబ్‌మెర్సిబుల్‌ పంపులు సైతం సోలార్‌ ఆధారితమైనవే ఉంటున్నాయి. ఈ పంపులను వినియోగించేందుకు పొలానికి వెళ్లి ఆన్‌ చేసే అవసరం లేకుండా, మొబైల్‌ ఫోన్‌ నుంచి ఆపరేట్‌ చేసుకోవచ్చు.

ప్రభుత్వ ప్రోత్సాహం

గృహ అవసరాలకు సోలార్‌ పలకలు ఏర్పాటు చేసుకునే వారికి ప్రభుత్వం సైతం ప్రోత్సాహకాలు అందజేస్తున్నది. మూడు కిలోవాట్ల సామర్థ్యానికి మించి సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ప్లాంట్లను నెలకొల్పుకుంటున్న వారికి  ప్రభుత్వం 30 శాతం రాయితీ ఇస్తున్నది. సబ్సిడీ పొందాలనుకునే వారు  తెలంగాణ స్టేట్‌ రిన్యూవబుల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సైతం పలు చోట్ల సోలార్‌ పార్కులను నెలకొల్పింది. 

చాలా సులువు

గృహ వినియోగానికి సౌర విద్యుత్‌ ఉత్పత్తి సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా తేలిక. కనీసం 25 ఏండ్ల వరకు మన్నికగా ఉంటుంది. అప్పటివరకు సాధారణంగా ఎలాంటి మరమ్మతులు అవసరం ఉండదు. సాంకేతిక సమస్యలు ఎదురయ్యే అవకాశమే లేదు. ఒక కిలోవాట్‌ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన పలకలను బిగించేందుకు కేవలం వంద చదరపు అడుగుల స్థలం ఉంటే సరిపోతుంది.  

ఎంతో లాభం 

వాయు, శబ్ద కాలుష్యం, పెరుగుతున్న చమురు ధరలు తదితర సమస్యలను ఎదుర్కొంటున్న ప్రజలు.. సోలార్‌ వాహనాల వైపు చూస్తున్నారు. కొంత ధర అధికంగా ఉన్నప్పటికీ నిర్వహణకు పెద్దగా ఖర్చు కాకపోవడం, ఇంధనానికి ఖర్చు చేయాల్సి రాకపోవడంతో ప్రజలు వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో తిరిగే ఆటో రిక్షాలు ఎక్కువ శాతం సోలార్‌తో నడిచేవి కావడం విశేషం. అక్కడి ప్రభుత్వం కూడా వాటిని ప్రోత్సహిస్తున్నది. దీనివల్ల కాలుష్యాన్ని అరికట్టడంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చు.

ఎండలు ఎక్కువ..

సానుకూల అంశం

సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తికి తెలంగాణ రాష్ట్ర భౌగోళిక పరిస్థితులు సైతం తోడు కానున్నాయి. దక్కన్‌ పీఠభూమి సముద్ర మట్టానికి కొంత ఎత్తులో ఉండటం ప్రధానమైనది. దీంతో పాటు మన రాష్ట్రంలో  ఎండలు ఎక్కువ ఉంటాయి. ఇది సౌర విద్యుత్‌ ఉత్పత్తికి ఎంతగానో సానుకూల అంశం.

సలహాలు అందించేందుకు సిద్ధం.. 

గృహ అవసరాలకు సౌర విద్యుత్‌ను వినియోగించడం ద్వారా ఎన్నో ప్రయోజనాలున్నాయి. అతి తక్కువ వ్యయంతో ప్లాంట్‌ను నెలకొల్పడం ద్వారా ఆర్థికంగా కూడా లాభపడవచ్చు. గృహ అవసరాలకు సౌర విద్యుత్‌ ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన సలహాలు, సూచనలు అందించేందుకు ఓయూ ఇంజినీరింగ్‌ కళాశాల ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ విభాగం తరపున మేము సిద్ధంగా ఉన్నాం. మా సహాయ సహకారాలు స్వీకరించవచ్చు. గృహ అవసరాలకు సౌర పలకలను నెలకొల్పడం ద్వారా పర్యావరణాన్ని సైతం రక్షించవచ్చు. 

-ప్రొఫెసర్‌ జి. మల్లేశం, హెడ్‌, ఎలక్ట్రికల్‌

ఇంజినీరింగ్‌ విభాగం,

ఉస్మానియా యూనివర్సిటీ మరింత అవగాహన పెంచాలి.. 

రానున్న రోజుల్లో రాష్ట్ర విద్యుత్‌ అవసరాలను సోలార్‌  సింహభాగం తీర్చనున్నది. ఇప్పటికే సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌ నెలకొల్పేందుకు ప్రభుత్వం రాయితీ ఇస్తున్నది.  గ్రామీణ ప్రాంతాల్లో పలకలను ఎక్కువగా అమర్చేందుకు అవసరమైన స్థలం ఉంటుంది. అక్కడి ప్రజలకు సోలార్‌ విద్యుత్‌ వినియోగంపై మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉన్నది.

-డాక్టర్‌ ఏఎం కృష్ణ,

వైస్‌ ప్రెసిడెంట్‌, యాక్సెస్‌ సోలార్‌ లిమిటెడ్‌