e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home హైదరాబాద్‌ ఇంటికే వచ్చి.. కష్టం తీర్చి..

ఇంటికే వచ్చి.. కష్టం తీర్చి..

ఇంటికే వచ్చి.. కష్టం తీర్చి..
  • కొవిడ్‌ బాధితులకు మందులు, ఆహారం
  • నగరవ్యాప్తంగా 150 మంది వలంటీర్లు
  • కాల్‌ చేస్తే చాలు..నిమిషాల్లో ‘సైకిల్‌’పై సేవలు
  • నిత్యం 300 ఫోన్లు.. ఇంటికే సరుకులు, మందులు
  • కొవిడ్‌ ఆపత్కాలంలో భరోసానిస్తున్న హైదరాబాదీ సైక్లిస్టులు
  • స్ఫూర్తినిస్తున్న ‘రిలీఫ్‌ రైడర్స్‌’

మియాపూర్‌, సిటీబ్యూరో, నమస్తేతెలంగాణ మే 15 : వ్యాయామం …శారీరక దృఢత్వం కోసం ఏండ్ల తరబడి సైకిల్‌ బాట పట్టిన ఆ సైక్లిస్టులు.. ఇప్పుడు సమాజ సేవ వైపు మళ్లారు. కొవిడ్‌ వైరస్‌ వ్యాప్తి తీవ్రమై …బాధితులుగా మారి ఇండ్లకే పరిమితమై నిస్సాహాయ స్థితిలో ఉన్న వారిని తమ వంతుగా ఆదుకోవాలని నిర్ణయించుకున్నారు. వ్యాయామం కోసం రోజు వారీగా చేసే సైక్లింగ్‌ను కొనసాగిస్తూనే.. అలాంటి వారికి మేమున్నామంటూ భరోసా కల్పిస్తున్నారు. అవసరమైన మందులు, ఆహారం, కూరగాయలు, కిరాణా సరుకులను అందిస్తున్నారు. 150 మంది వలంటీర్లతో ‘రిలీఫ్‌ రైడర్స్‌’ పేరుతో సేవా స్ఫూర్తిని చాటుకుంటున్నారు.

నగరవ్యాప్తంగా 150 మంది..

నగరవ్యాప్తంగా ఈ రిలీఫ్‌ రైడర్స్‌ సభ్యులు సేవలందిస్తున్నారు. సులభతరం కోసం నగరాన్ని సికింద్రాబాద్‌, ఓల్డ్‌ హైదరాబాద్‌, సైబరాబాద్‌గా విభజించుకున్నారు. ఒక్కో జోన్‌లో 50 మంది చొప్పున మూడు జోన్లలో కలిపి మొత్తం 150 వలంటీర్లు సేవలో నిమగ్నమయ్యారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా.. సాయం చేసేందుకు నిత్యం అప్రమత్తంగా ఉంటున్నారు. జోన్‌ వారీగా ఫోన్‌ నంబర్లను వాట్సాప్‌ల ద్వారా షేర్‌ చేశారు. ఇప్పటికే రోజువారీగా వీరికి 300 వరకూ ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయి. ఒక్కో వలంటీరు గరిష్ఠంగా 10 కిలో మీటర్ల వరకూ సైకిల్‌పై ప్రయాణిస్తూ..బాధితుల ఇంటికి వెళ్లి అవసరాలను తీరుస్తున్నారు. పూర్తి ఉచితంగా సర్వీసులు అందిస్తున్నారు. ఈ బృందంలో యువతులు సైతం భాగస్వాములవుతుండటం విశేషం.

రోజుకు 300 కాల్స్‌…

బాధితుల నుంచి మాకు రోజువారీగా 300 వరకూ ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయి. అభ్యర్థన అందిన ప్రాంతానికి అక్కడి వలంటీరును అలర్ట్‌ చేసి బాధితులకు ఇంటి వద్దే కావాల్సినవి అందిస్తున్నాం. తొలుత కొద్ది మందితో మొదలైన మా ప్రయాణం రోజురోజుకు విస్తరిస్తున్నది. ఈ కష్టకాలంలో సామాజిక బాధ్యతగా అందిస్తున్న ఈ సేవ ఎంతో సంతృప్తినిస్తున్నది.-సంతన సెల్వన్‌, రిలీఫ్‌ రైడర్స్‌ సమన్వయ కర్త, చైర్మన్‌, సైక్లింగ్‌ క్లబ్‌

ఓల్డ్‌ సిటీ పరిధిలో..

రాజేంద్రనగర్‌, ఆర్టీఎల్‌ క్రాస్‌ రోడ్స్‌, మెహిదీపట్నం, ఫలక్‌నుమా, చార్మినార్‌, కాచిగూడ, ఎంజే మార్కెట్‌, నల్లకుంట, ఎల్బీనగర్‌, నాంపల్లి, అబిడ్స్‌, అత్తాపూర్‌ మెడిసిన్‌-9959771673, ఆహారం- 8686866801

నిమిషాల వ్యవధిలోనే..

కరోనాతో అన్నీ తారుమారయ్యాయి. పాజిటివ్‌ వచ్చిన వారు తమ వారు ఎవరూ లేక.. బయటకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వారికి తోచిన సేవ చేయాలని సంకల్పించాం. ఓ బృందంగా ఏర్పడి.. బాధితులకు అత్యవసరంగా కావాల్సిన మందులు, ఆహారం, ఆక్సిజన్‌ సిలిండర్లను అందిస్తూ.. అండగా నిలుస్తున్నాం. మా వాట్సాప్‌ గ్రూపులో ఎప్పటికప్పుడు సందేశాలను గమనిస్తూ… అందులో వచ్చే అభ్యర్థనలను బట్టి ప్రాంతాల వారీగా నిమిషాల వ్యవధిలో బాధితులకు అవసరాలను తీర్చ గలుగుతున్నాం. -దినేశ్‌ సేల్‌, రిలీఫ్‌ రైడర్స్‌ వలంటీర్‌

వృద్ధులకు అండగా నిలుద్దాం

నగరంలో చాలా మంది వృద్ధులు ఒంటరిగా ఉంటారు. వారి కుటుంబసభ్యులు విదేశాల్లో స్థిరపడటం, మరికొందరికి సహాయకులు ఉండరు. అలాంటి వారు ఈ లాక్‌డౌన్‌లో బయటకు వచ్చి మెడిసిన్స్‌ కొనుగోలు చేయడం కష్టం. కొవిడ్‌ సోకితే వారు కోల్కోవడానికి చాలా సమయం పడుతుంది. అందుకే అలాంటి వారి కోసం మేము ఉచితంగా హోం డెలివరీ అందిస్తున్నాం. ఫోన్‌ చేసి మందుల వివరాలు చెబితే చాలు.. ఇంటికి చేరుస్తాం. – రుతుంబర, సైక్లిస్ట్‌

గరిష్టంగా 10 కిలోమీటర్లు..

రిలీఫ్‌ రైడర్స్‌ వలంటీరుగా పని చేయడం ఆనందాన్నిస్తున్నది. నగరంలో ప్రాంతాల వారీగా బాధితుల నుంచి వచ్చే అభ్యర్థనలు మా వాట్సాప్‌ గ్రూపులో షేర్‌ చేస్తుంటారు. ప్రతి వలంటీరు గరిష్ఠంగా పది కిలోమీటర్ల వరకూ సైకిల్‌పై వెళుతూ..బాధితులకు మందులు, భోజనం, కూరగాయలు అందిస్తున్నాం. ఎలాగో రహదారులపై ట్రాఫిక్‌ కూడా లేకపోవటంతో నిమిషాల వ్యవధిలోనే చేరవేస్తున్నాం. మా సేవలు పూర్తిగా ఉచితమే. సమాజానికి తోచిన సేవ చేయాలన్న సంకల్పంతో ఈ విపత్కర పరిస్థితుల్లో అందిస్తున్న ఈ సర్వీసు మనసుకు ఎంతో సంతృప్త్తినిస్తున్నది. బాధితులకు చేతనైన చేయూత అందిస్తున్నాం. -సాంబారి రవి, రిలీఫ్‌ రైడర్స్‌ వలంటీర్‌

ఆనందాన్ని చూస్తున్నాం…

కరోనాతో బాధపడుతూ సాయం చేసే వారెవరూ లేక ఎందరో బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారికి సేవలందిస్తుండటంతో ఎంతో సంతోషంగా అనిపిస్తున్నది. వారికి కావాల్సిన మందులను దుకాణాల్లో నుంచి స్వయంగా కొనుగోలు చేసి ఇంటి వద్దకు తీసుకెళ్లి అందిస్తున్నాం. ఆ సమయంలో బాధితుల కండ్లలో ఎంతో ఆనందం, ధైర్యం కనిపిస్తున్నది. తగిన జాగ్రత్తలు పాటిస్తూనే సైకిల్‌పైనే గడపగడపకు వెళ్లి వారికి కావాల్సిన సేవలను అందిస్తుండటం మాటల్లో చెప్పలేని ఆనందాన్నిస్తున్నది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ బాధితులకు తోచిన సాయాన్ని అందిస్తే వారిలో మానసిక ధైర్యం పెరిగి మరింత తొందరగా కోలుకునే అవకాశం ఉంటుంది. -అంజనీ, రిలీఫ్‌ రైడర్స్‌ వలంటీర్‌

సైబరాబాద్‌ పరిధిలో..

నానక్‌రాంగూడ, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, గచ్చిబౌలి, నార్సింగి, కొండాపూర్‌, మాదాపూర్‌, కూకట్‌పల్లి, ఫిల్మ్‌నగర్‌, బీహెచ్‌ఈఎల్‌, మణికొండ, మియాపూర్‌,మెడిసిన్‌-9701744814, ఆహారం-8686866801

సింహభాగం కార్పొరేట్‌ ఉద్యోగులే…

రిలీఫ్‌ రైడర్స్‌లో ఉన్న వారిలో సింహభాగం కార్పొరేట్‌ ఉద్యోగులే. వీరంతా ఏండ్ల తరబడి సైక్లింగ్‌ చేస్తున్నారు. హైదరాబాద్‌ సైక్లింగ్‌ క్లబ్‌ చైర్మన్‌, ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్న సంతన సెల్వన్‌కు వచ్చిన ఆలోచనే ‘రిలీఫ్‌ రైడర్స్‌’కు అంకురార్పణ పడింది. తమ రోజు వారీ సైక్లింగ్‌ను కొవిడ్‌ బాధితులకు సహాయం చేసేందుకు మళ్లించాలని నిర్ణయించిన ఆయన.. తన తోటి సైక్లిస్టులతో ఈ విషయాన్ని పంచుకున్నారు. అందరూ సంసిద్ధత వ్యక్తం చేయడంతో మే 1న ‘రిలీఫ్‌ రైడర్స్‌’ పేరుతో ఓ బృందంగా ఏర్పడ్డారు. పాజిటివ్‌ వచ్చి.. సహాయం చేసే వారెవరూ లేక ఇంటికే పరిమితమయ్యే వారికి మందులు, భోజనం, కూరగాయలు, కిరాణా సరుకులను అందించాలని సంకల్పించారు. ఓ వాట్సాప్‌ గ్రూపును ఏర్పాటు చేసుకుని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థనలను బృందంలో పంచుకుంటున్నారు. వెంటనే సమీపంలో ఉండే వలంటీరు నిముషాల్లో కావాల్సినవి కొనుగోలు చేసి అన్ని జాగ్రత్తలు తీసుకొని, సైకిల్‌పై బాధితుల ఇంటికి వెళ్లి అందిస్తున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఇంటికే వచ్చి.. కష్టం తీర్చి..

ట్రెండింగ్‌

Advertisement