సిటీబ్యూరో, జూలై 31 (నమస్తే తెలంగాణ) : సాయం చేయాలన్న తపన..ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలన్న మనస్సు ఉంటే ఏ రూపంలోనైనా చేయవచ్చు. మనం బాగుంటే చాలని కాకుండా ఇతరులకు సాయం చేస్తూ వారి అభ్యున్నతికి బాటలు వేస్తున్నది కేరళ మహిళ, సాఫ్ట్వేర్ ఇంజినీర్ డాక్టర్ సారద (సారా). విద్యతోనే మనిషి ఉన్నతి సాధ్యమని నమ్మిన ఆమె.. ఎలాంటి అండ లేని వారిని చదివిస్తోంది. హైదరాబాద్‌లో స్థిరపడి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ కష్టాల్లో ఉన్నవారికి నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్నది. ఓ వైపు ఐటీ ఉద్యోగం చేస్తూనే మరోవైపు సమాజ చైతన్యానికి అడుగులు వేస్తున్నది. కరోనా విపత్కర పరిస్థితిలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి ధైర్యం కల్పించింది. సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే వినతులను పరిశీలించి వారి అండగా నిలుస్తున్నారు.
తల్లిదండ్రులను కోల్పోయి.. ఆర్థిక సమస్యలతో చదువుకు దూరమైన పిల్లలను చేరదీసి వారికి విద్యనందిస్తున్నది. ఇప్పటివరకు 31 మంది విద్యార్థులను చదవిస్తున్నది. కొవిడ్ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు నివాసం, ఆరోగ్యం ఇతర అవసరాలతో అండగా ఉంటోంది. పదోతరగతి పూర్తిచేసి ఉన్నత చదువు చదివేందుకు ఆర్థిక స్థోమత లేని వారికి సాయ మందిస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభగల విద్యార్థుల ఉన్నత చదువు కోసం, తమకు నచ్చిన కాలేజీల్లో చేర్పించడానికి సహాయం చేస్తుంది. పాఠ్య, నోటు పుస్తకాలు, స్టేషనరీ, ఆట సామగ్రి అందించి వారి వికాసానికి దోహదం చేస్తోంది. కొవిడ్ సమయంలో 31 వేల కుటుంబాలకు రైస్‌తోపాటు నిత్యావసర సరుకులు, మెడికల్ కిట్లు అందజేశారు. ఉచిత భోజనం అందించారు.
ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న వారికి వ్యాపారానికి సంబంధించిన పరికరాలు అందించి అండగా నిలిచారు. ప్రధానంగా దివ్యాంగులకు వారి పిల్లలకు ఏంకావాలో వారి అవసరాలు సమకూర్చుతూ ఆత్మైస్థెర్యం నింపుతున్నారు. 2016లో సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహించేందుకు సెవెన్ రేస్ ఫౌండేషన్‌ను స్థాపించిన ఆమె ఇప్పటివరకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్వయం ఉపాధి పొందేందుకు మహిళలకు 30 వరకు కుట్టు మిషన్లు అందించారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆర్థికసాయం చేయడంలోనూ ఆమె ముందుంటారు.
కష్టాల్లో ఉన్నవారికి ఏదో రకంగా అండగా నిలిస్తే వారికి ఎంతో ఊరట లభిస్తుంది. జీవితంలో ఎంత సంపాదించామన్నది కాదు.. ఏం చేశామన్నది చాలా ముఖ్యం. నావంతుగా ఏదోక సహాయం అందించాలని నిర్ణయించుకున్నా. కొవిడ్‌తో చాలా కుటుంబాలు ఆగమయ్యాయి. ఏ విద్యార్థి చదువుకు దూరం కాకూడదు. విద్యయే వారికి ఆస్తి. స్వశక్తితో ఎదిగే అవకాశం ఇస్తుంది. ఎలాంటి సాయం కావాలన్నా 9908088258ను సంప్రదించొచ్చు. మా బృందం ఆ సమస్యను నిశితంగా పరిశీలించి నిజమైతే తప్పకుండా సాయం చేస్తాం.
-డాక్టర్ సార, ఫౌండర్, సెవెన్‌రేస్ ఫౌండేషన్